యువత ఆలోచనలకు రెక్కలు తొడుగుతున్న టీ హబ్

ఘనంగా టీ హబ్ తొలి వార్షికోత్సవ వేడుకలు

యువత ఆలోచనలకు రెక్కలు తొడుగుతున్న టీ హబ్

Saturday November 12, 2016,

2 min Read

ఐటీ రంగంలో నూతన ఆలోచనలకు రెక్కలు తొడుగుతోన్న టీ-హబ్ లక్ష్య సాధనలో దూసుకెళుతోంది. తెలంగాణ యువత నైపుణ్యానికి పదును పెట్టి వారి స్వప్నాలను సాకారం చేసే లక్ష్యంతో ప్రారంభమైన టీ-హబ్ ఏడాదిలోనే అద్భుత ఫలితాలు సాధించింది. విజయవంతంగా ఎన్నో స్టార్టప్స్ కు వేదికగా నిలిచిన టీ-హబ్ మరింత ఉత్సాహంతో రెండో వసంతంలోకి అడుగు పెట్టింది. మాదాపూర్లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లో టీ-హబ్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆలోచనలకు అవకాశం కల్పిండమే లక్ష్యంగా టీ-హబ్ కు శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు. తొలి ఏడాదిలోనే టీ-హబ్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ యువత ఆలోచనలకు టీ-హబ్ రెక్కలు తొడిగిందన్నారు. ఎంతో మంది నైపుణ్యాభివృద్ధికి వేదికైందని తెలిపారు. ఉత్సాహవంతులైన యువతకు టీ హబ్ అండగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాదులో ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు.

image


ఈ సందర్భంగా టీ-హబ్ సెకండ్ ఫేజ్ కు సంబంధించిన లక్ష్యాలను మంత్రి కేటీఆర్ డాక్యుమెంటరీ సాయంతో వివరించారు. టీ-హబ్ సెకండ్ ఫేజ్ విజన్ను ఈ వీడియో కళ్లకు కట్టింది. టీ-హబ్ సెకండ్ ఫేజ్ ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. టీ-హబ్ -2 బిల్డింగును నిర్మిస్తామని, 1000 స్టార్టప్స్ కు అవకాశం కల్పించడాన్ని సెకండ్ ఫేజ్ లో లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఐటీ రంగంతో పాటు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ రంగాల్లోనూ స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తామని అన్నారు.

image


ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ ప్రముఖులు టీ-హబ్ పై  ప్రశంసలు గుప్పించారు. నైపుణ్యం గల యువకులకు ఎందరికో టీ-హబ్ గొప్ప వేదికైందన్నారు. ప్రపంచంలోనే టీ హబ్ టాప్ టెన్ లో నిలవాలని శ్రీనివాస్ కొల్లిపొర ఆకాంక్షించారు. ఇంక్యుబేషన్ సెంటర్ల విషయంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని బీవీఆర్ మెహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీ హబ్ ఫౌండర్ మెంబర్లలో ఒకరైన బీవీఆర్.. టీ హబ్ విజయం అందరిదీ అని వ్యాఖ్యానించారు. పాలసీ ఎగ్జిక్యూషన్ లో టీ హబ్ సక్సెస్ అయిందని జయక్రిష్ణన్ అన్నారు. టీ హబ్ లో సూపర్ కంప్యూటర్ తో పాటు ఐఓటీ లాంటి టెక్నాలజీ కి సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆయన తెలిపారు.

image


ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు ఐటీ ప్రముఖులు హాజరయ్యారు.