మహిళా కెరీర్ రీస్టార్ట్.. కేరాఫ్ అవతార్ ఐ విన్!

మహిళా కెరీర్ రీస్టార్ట్.. కేరాఫ్ అవతార్ ఐ విన్!

Thursday March 17, 2016,

3 min Read


కొంతమంది మహిళలకు పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయగలనా లేదా అనే సందేహాలు తలెత్తుతాయి. ఇంకొందరేమో ఇటు పిల్లలను చూసుకోలేక... అటు ఉద్యోగం చేయలేక మెంటల్ గా ఇదైపోతుంటారు. కెరీర్ కు బ్రేక్ ఈవెన్ రావాల్సిన సమయంలో బ్రేక్ తీసుకోవాల్సి వస్తే ఎవరికైనా బాధే కదా.  పెద్ద చదువులు చదువుకుని... కష్టపడి జాబ్ సంపాదించి... కెరీర్ లో పైకొస్తున్న సమయంలో... కేవలం పిల్లల్ని కనడం కోసం ఉద్యోగం మానేస్తున్నారు చాలామంది. 

ఇలా కెరీర్ లో బ్రేక్ తీసుకున్నవారికి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు చెన్నైకి చెందిన సౌందర్య రాజేశ్. రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందిస్తున్న ఆమె.. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్, ఫేస్ బుక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక మహిళల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఒత్తిళ్లతో సహవాసం చేసే మహిళలకు అండగా నిలిచారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది.

డాక్టర్‌ సౌందర్య రాజేష్‌ దేశంలోనే టాప్‌ 100 మంది మహిళా అచీవర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. తమ కెరీర్లను అర్థాంతరంగా వివిధ కారణాల చేత ఆపివేసిన మహిళలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేసిన సౌందర్యరాజేష్ ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్రమంత్రి మేనకా గాంధీ ఘనంగా సన్మానించారు.

అవతార్‌ ఐ విన్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థను స్థాపించి సౌందర్య రాజేష్‌ గత రెండు దశాబ్దాలుగా ఎన్నెన్నో అవార్డులను పొందింది. మహిళలకు సాధికారత కల్పించడంలో సౌందర్య చూపిన చొరవ ఎందరికో స్ఫూర్తి కలిగించింది. 47 ఏళ్ల సౌందర్య రాజేష్‌ ఎందరికో ఉపాధిని, దారిని చూపింది.

image


అవతార్‌ ఐ విన్‌..!

2000 సంవత్సరంలో సౌందర్య రాజేష్‌ అవతార్‌ కెరీర్‌ కన్సల్టెన్సీని స్థాపించారు. 2005లో అవతార్‌ ఐ విన్‌ పేరిట ఆన్‌లైన్‌ సేవలను అందించడం ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా మహిళలను తిరిగి తమ కెరీర్లను రీస్టార్ట్‌ చేయించే కన్సల్టెన్సీగా అవతార్‌ పేరు పొందింది. ముఖ్యంగా కౌన్సెలింగ్‌ ద్వారా మహిళలను తమ కెరీర్లను రీస్టార్ట్‌ చేయించే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంది. ఇప్పటికే సుమారు 75 మంది మహిళా ఉద్యోగినులతో విస్తరించడమే కాదు.. 8000 పైచిలుకు మహిళలను తమ కెరీర్లను రీస్టార్ట్‌ చేసేందుకు సహకరించింది.

అడ్డంకులను ఎదుర్కొంటూ పయనం..

మహిళల కెరీర్ రీస్టార్ట్‌ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిన సౌందర్య రాజేష్‌ ప్రయాణం పూలబాటలా సాగలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చాలా కంపెనీలు తమ కంపెనీల్లో కెరీర్ బ్రేక్‌ ఇచ్చిన మహిళలకు మళ్లీ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అంతేకాదు వారి రెజ్యూమెలను కంపెనీలకు ఫార్వర్డ్‌ చేసినప్పుడు సౌందర్య రాజేష్ చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు.

అయినా, నిరుత్సాహ పడలేదు. అనేక సంస్థలను ఉద్యోగాలు ఇవ్వమని రారు. మహిళల కెరీర్‌ రీస్టార్ట్‌ చేయడంపై గల సందేహాలను ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగాలతో చర్చించారు. పరిష్కార మార్గాలనూ సజెస్ట్‌ చేశారు. సెకండ్‌ కెరీర్‌ అనే ప్రోగ్రాంపై ఏడాది పాటు కష్టపడ్డారు. ఫలితంగా సుమారు 400 మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇది అవతార్‌ ఐ విన్‌ సాధించిన అతిపెద్ద విజయం.

image


గెలుపు బాటలో..!

మహిళలను తమ కెరీర్‌ రీ స్టార్ట్‌ చేసేలా మోటివేట్‌ చేసేందుకు సౌందర్య చాలా కష్టపడింది. అవ్‌తార్‌ ఐ విన్‌ ద్వారా సుమారు 40 వేల మంది మహిళలను కాంటాక్ట్‌ లో పెట్టుకుంది. వీరిలో పలురంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. ప్రస్తుతం నిపుణులైన మానవ వనరుల కోసం వెతుకుతున్న కంపెనీలకు అవ్‌తార్‌ ఐ విన్‌ వన్‌ స్టాప్‌ పాయింట్‌గా నిలిచింది. ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్తాన్‌ లివర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గోల్డ్‌ మన్‌ సాక్స్‌, ఫిడెలిటీ, హెచ్‌సీఎల్‌, గోద్రేజ్‌, ఫిలిప్స్‌, మైక్రోసాఫ్ట్‌లు అవ్‌తార్‌ ఐ విన్‌ను సంప్రదిస్తున్నాయి.

అవ్‌తార్‌ కన్సల్టెన్సీ ద్వారా సౌందర్య అందుకున్న మొదటి ప్రాజెక్టు చెన్నై కంటెయినర్‌ టెర్మినల్‌ ప్రైవేటైజేషన్‌. ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున మహిళా ఇంజనీర్లను అవతార్‌ కన్సెల్టెన్సీ అందించింది. పురుషులతో సమానంగా పలువురిని రిక్రూట్‌ చేయడంలో అవతార్‌ తన ప్రత్యేకతను చాటుకుంది. అత్యంత కఠినమైన పనులను సైతం తమ కెరీర్‌ రీస్టార్ట్‌ లో చేపట్టేందుకు మహిళలు ముందుకు వచ్చారంటే అవ్‌తార్‌ ఇచ్చిన కౌన్సెలింగ్‌ ఎలా పనిచేసిందో చెప్పవచ్చు.

image


వ్యక్తిగత జీవితం..!

పుదుచ్చేరిలో జన్మించిన సౌందర్యరాజేష్‌ చిన్నప్పటి నుంచే సృజనాత్మకమైన ఆలోచనలతో తన జీవితాన్ని సాగించింది. 1988లో మద్రాసు యూనివర్సిటీ నుంచి గోల్డ్‌ మెడల్‌ పొందిన సౌందర్య తన బ్యాచ్‌మేట్‌ రాజేష్‌ ను వివాహమాడింది. ఇద్దరు పిల్లలు. సిటీ బ్యాంకులో ఉద్యోగానికి రాజీనామా చేసిన సౌందర్య... కెరీర్‌ రీస్టార్టింగ్‌లో వచ్చిన ఆటంకాలను గుర్తించి అవ్‌తార్‌ కన్సెల్టెన్సీని స్థాపించారు.

అంతేకాదు సౌందర్య రాజేష్‌ గెస్ట్‌ లెక్చరర్‌గా చెన్నైలోని ఎంవోపీ వైష్ణవ్‌ కళాశాలలో బోధిస్తోంది. 2005లో యూకే వెళ్లి, అక్కడ మహిళా ప్రొఫెషనల్స్‌కు అందుతున్న సదుపాయాలను చూసి స్ఫూర్తి పొందారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిని మన దేశంలో కూడా కల్పించడమే లక్ష్యంగా ఆమె ముందుకు కదులుతున్నారు. 

మహిళా ఉపాధి - గణాంకాలు !

గడిచిన 30 దశాబ్దాలలో మహిళలు వివిధ రంగాల్లో విస్తరించారు. అనేక రంగాలలో తమ పట్టును సాధించారు. అయితే గడిచిన 20 సంవత్సరాలుగా, అంటే 1990 నుంచి 2010 మధ్య కాలంలో వర్కింగ్ విమెన్‌ శాతం తగ్గిపోతూ వస్తోంది. ఆ లెక్క సుమారు 8 శాతంగా ఉంది. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. ఇదే విషయాన్ని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కూడా నిర్ధారించింది. దేశ జీడీపీని సైతం మహిళల భాగస్వామ్యం ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.

రానున్న 40 సంవత్సరాల్లో భారత్‌లో సుమారు 42.4 కోట్లమంది వర్కింగ్ విమెన్‌ అవతరించనున్నారు. 2015 లో వెలువడిన మెకిన్సీ గ్లోబల్‌ అధ్యయనం ప్రకారం, భారత్‌ తన శ్రామికశక్తిలో మహిళ భాగస్వామ్యాన్ని పదిశాతం కనుక పెంచగలిగితే.. 2025 కల్లా భారత్‌ తన జీడీపీని 16 శాతం పెరుగుతుందని అంచనా. అంతేకాదు ఇండియా సుమారు 46 లక్షల కోట్ల రూపాయల జీడీపీలో అదనంగా ఆర్జించనుందని అధ్యయనంలో తేలింది.

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి