వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విమెన్ టెండూల్కర్ మిథాలీరాజ్

0

విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ వన్డేల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఆరువేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌ విమెన్‌గా ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ పేరిట ఉన్న రికార్డును చెరిపి వేసింది. 183 వన్డేలు ఆడిన మిథాలీ 164వ ఇన్నింగ్స్‌ లో ఈ ఘనత సాధించడం విశేషం. క్రికెట్‌ మైదానంలో రికార్డుల మోత మోగించిన మిథాలీని అందుకోడం బహుశా మరో క్రికెటర్ కు సాధ్యం కాదేమో.

14ఏళ్ల వయసులోనే ఇండియన్ టీం స్టాండ్ బై ప్లేయర్ గా అవకాశం దక్కించుకున్న మిథాలీ.. 16 ఏళ్ల వయసులో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కు ఎంపికైంది. 1999 జూన్ 26న మిల్టన్ కీనెస్ లోని క్యాంప్ బెల్ పార్క్ లో జరిగిన మ్యాచ్ లో మిథాలీ, రేష్మా గాంధీతో కలిసి ఓపెనర్ గా బరిలో దిగారు. ఆ మ్యాచ్ లో 114 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది మిథాలీ. ఇండియన్ విమెన్ క్రికెట్ టీంకు మరో స్టార్ దొరికిందని బోర్డు ఆనందం వ్యక్తం చేసింది. ఆ తర్వాత మిథాలీ వెనుదిరిగి చూసుకోలేదు. వన్డే ఫార్మాట్ లో 6వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.

మిథాలీ క్రికెట్‌ కెరియర్ నల్లేరు మీద నడకలా సాగలేదు. ఆమె ఆడటం మొదలు పెట్టిన రోజుల్లో విమెన్ క్రికెట్‌ టోర్నమెంట్లు కూడా జరుగుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి మిథాలీ టీంలో చోటు సంపాదించుకునే వరకు కూడా ఇండియన్ విమెన్ క్రికెట్ టీంలో స్టార్ ప్లేయర్ ఎవరు? ఆమె ఎలా ఉంటుంది? సాధించిన రికార్డులేంటి? ఈ విషయాలేవీ ఆమెకు తెలియదు. సీనియర్ టీంలో ప్లేస్ దొరికిన తర్వాతే మిథాలీకి శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. అప్పటికి దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఇండియన్ మెన్స్ క్రికెట్ టీంలో పాత, కొత్త క్రికెటర్ల పేర్లు తెలుసు.

మిథాలీ క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టినప్పుడు తనకంటూ పెద్ద లక్ష్యాలేం లేవు. అప్పటికి ఇండియన్‌ టీంలో స్థానం సంపాదించడమే ఆమె టార్గెట్. అయితే టీంలో ప్లేస్ దొరికాక దాన్ని సుస్థిరంచేసుకోవాలన్నదే ఆమె లక్ష్యంగా మారింది. జట్టులో స్థానం కన్ఫమ్ అయ్యాక కెప్టెన్‌ కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. మిథాలీకి సారథ్య పగ్గాలు అంత ఆషామాషీగా దక్కలేదు. అహర్నిశలు శ్రమించింది. కెప్టెన్సీ కావాలంటే అద్భుతమైన ఆటతీరు కనబరచాలి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఈ విషయం మిథాలీకి బాగా తెలుసు. అందుకే ప్రతి మ్యాచ్ లోనూ కీ ప్లేయర్ గా మారింది. అలా కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యం వైపు అడుగులేసింది. హోదాతో పాటు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటను ఎప్పుడు మర్చిపోకుండా, ఇప్పటికీ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూనే ఉంది.

1982 డిసెంబర్‌ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టింది మిథాలీ రాజ్‌. చిన్నతనంలోనే ఆమె కుటుంబం హైదరాబాదులో సెటిల్ అయింది. అందుకే ఆమెను హైదరాబాదీ అంటారు. తండ్రి ఎయిర్‌ఫోర్స్ నుంచి రిటైర్‌ అయ్యాక బ్యాంక్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. కూతురి కెరీర్‌ కోసం తల్లి ఉద్యోగం వదిలేసి కుటుంబానికి అంకితమై పోయారు.

2010, 2011, 2012 ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది మిథాలీ రాజ్. ఇలాంటి రికార్డు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ మిథాలీనే. టెస్ట్, వన్‌ డే, టీ-20 ఈ మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్సీ చేసిన ఘనత ఆమె సొంతం. మిథాలీ సాధించిన విజయాలకు గానూ భారత ప్రభుత్వం అర్జున, పద్మ శ్రీ అవార్డులతో సత్కరించింది.

Related Stories

Stories by team ys telugu