బైక్ పంక్చర్ కాకుండా ఉపాయాన్ని కనిపెట్టిన విలేజ్‌ సైంటిస్ట్  

0

చదివింది ఇంటర్‌. అయినా మహామహులకు సాధ్యం కాని ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నాడో వ్యక్తి. ఓ వైపు మెకానిక్‌ పని చేస్తూనే, మరోవైపు విభిన్న ప్రయోగాలతో ముందుకెళుతున్నాడు. నలుగురికీ ఉపయోగపడే పరికరాలు కనుగొంటూ విలేజ్‌ సైంటిస్ట్ గా పేరు సంపాదించుకున్నాడు.

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ కు చెందిన పాండురంగా రావు ఓ సాధారణ బైక్‌ మెకానిక్‌. ఇంటర్‌ తోనే విద్యాభ్యాసం ముగిసింది. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన, నలుగురికీ ఉపయోగపడాలన్న ఆలోచనలు, ఆయన్ను వినూత్న ఆవిష్కరణలవైపు నడిపించాయి.

పాండురంగా రావు ఒకరోజు రాత్రి తన కుటుంబ సభ్యులతో బైక్‌ మీద వెళ్తుండగా అది పంక్చరైంది. దాంతో, చాలా దూరం వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ సంఘటనే పాండురంగారావులో దాగున్న ప్రతిభను వెలికితీసింది. బైక్‌ పంక్చర్‌ అయి ఇబ్బంది పడే వాళ్ల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రయోగాలు మొదలుపెట్టారు. 8 నెలల పాటు కష్టపడ్డాడు. దాదాపు 25 కెమికల్స్‌ తో ఎక్స్ పరిమెంట్స్ చేశారు. వాటిలో 3 కెమికల్స్‌ పాజిటివ్‌ రిజల్ట్స్‌ ఇచ్చాయి. పల్లె సృజన, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ప్రోత్సాహంతో తన ప్రయోగానికి మెరుగులు దిద్ది తుది ఫలితాన్ని సాధించాడు.

పాండురంగా రావు తయారుచేసిన రసాయన మిశ్రమాన్ని టైర్లలోకి ఎక్కిస్తే చాలు. ముళ్లు, మేకులు, ఇంకా దేనివల్లా టైర్లకు ఎలాంటి టెన్షన్‌ ఉండదు. ఒకవేళ పంక్చర్‌ అయినా కూడా... లోపల ఉండే రసాయనం కారణంగా ట్యూబులు వాటికవే పూడుకుపోతాయి. రంధ్రం పడిన చోటు నుంచి గాలి బయటకు వెళ్లదు. ట్యూబులోంచి గాలి దిగిపోదు. ఇప్పటికే చాలా వాహనాల మీద ప్రయోగం చేసి విజయం సాధించారు.

పాండురంగా రావు రూపొందించిన మరో ప్రయోగం- పోల్‌ క్లైంబర్‌. కరెంటు స్తంభాలను అవలీలగా ఎక్కేందుకు ఒక పరికరాన్ని తయారుచేశాడు. దాన్ని చెప్పుల్లాగా కాళ్లకు తొడుక్కుంటే చాలు.. ఎలాంటి భయం లేకుండా పోల్ ఎక్కొచ్చు, దిగొచ్చు. కిందపడిపోతామన్న టెన్షన్ లేదు. పట్టుజారిపోతుందన్న భయమూ అక్కర్లేదు.

వినూత్న ప్రయోగాలు చేస్తున్న పాండురంగా రావును అందరూ విలేజ్‌ సైంటిస్ట్ పిలుస్తారు. ఆయనలోని నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్రం... రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేసింది. ఆయనలోని ప్రతిభను గుర్తించిన నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అవార్డుకు సిఫార్సు చేశారు. సరికొత్త ప్రయోగాలతో ముందుకెళుతున్న పాండురంగా రావు భవిష్యత్ లో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని కోరుకుందాం.

Related Stories