ఆన్‌లైన్, స్కైప్‌ ద్వారా సంగీతం నేర్పే ప్రతిభా ఇ-కాడమీ

ఆన్‌లైన్, స్కైప్‌ ద్వారా సంగీతం నేర్పే ప్రతిభా ఇ-కాడమీ

Wednesday August 26, 2015,

4 min Read

మనస్సును మైమరపించే ఆ స్వరం... స్పష్టమైన గాన మాధుర్యం... నిన్ను మరోలోకంలోకి తీసుకెళ్తుంది. ఆ పాటల అల్లికలోని జిగిబిగి నిన్ను మాయ చేస్తుంది. ఆనందంలో ముంచెత్తి.. సమ్మోహన పరిచే శక్తి ఒక్క సంగీతానికే ఉంది. కానీ ప్రతిభా పార్థసారధి విషయానికొస్తే కేవలం మాయ చెయ్యడమే కాదు... అది ఆమె జీవనగమనం కూడా.

ప్రతిభా పార్థసారధి, ఇకాడమీ వ్యవస్థాపకులు

ప్రతిభా పార్థసారధి, ఇకాడమీ వ్యవస్థాపకులు


ప్రతిభా ఇ-కాడమి స్థాపకురాలు ప్రతిభ. దేశ విదేశాల్లో ఉన్నా.. సంగీతం నేర్చుకోవాలనే అభిలాష ఉన్న వారికి సరైన వేదిక ఇది. గాత్రం కావచ్చు, వాద్య సంగీతమూ కావచ్చు. బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్, ముంబై ఎస్‌పీ జైన్ కాలేజీలో ఎంబీఏ చేసిన ప్రతిభకు శాస్త్రీయ , పాశ్చాత్య, లలిత సంగీతంలో అనేక ప్రదర్శనలిచ్చిన కళాకారిణిగా పదేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకుంటే గురువు దగ్గరకెళ్లి నేర్చుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. దూరం పెరిగిపోయింది. నగరాల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్‌తో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం పెద్ద సవాల్. చదువు - కెరీర్ విషయాల్లో మరింత పోటీ పెరిగిపోయింది. వాటన్నింటి మధ్య తమ అభిరుచులు, ఇష్టమైన వ్యాపకాల కోసం కేటాయించే సమయం కరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సుదూర తీరాలు ప్రయాణించి మంచి గురువు వద్ద సంగీతం నేర్చుకునే పరిస్థితి లేదు. అందుకే ఇష్టమైనా.. కష్టంగా ఉండడంతో చాలా మంది తమ హాబీలకు బై బై చెప్పేస్తున్నారు. 

అలాంటి సమస్యల నుంచే ఇ-కాడమీ ఆలోచన పుట్టుకొచ్చింది అంటారు ప్రతిభ. ఆ అడ్డుగోడల్ని కూల్చేసి సంగీతం అంటే ఆసక్తి ఉన్న వారిని వాళ్ల ఇంటి దగ్గరే కూర్చొని ప్రొఫెషనల్ కళాకారులుగా తీర్చి దిద్దడమే ఇ-కాడమీ లక్ష్యం.

సంగీత యానం

ఐదేళ్ల వయసునుంచే ప్రతిభ సంగీత ప్రయాణం మొదలయ్యింది. కాలేజీకెళ్లేంత వరకు అంటే దాదాపు పదేళ్ల పాటు ఆమె కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. వివిధ వేదికలపై సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చారు. కాలేజీలో రోజుల్లో ఓ బ్యాండ్ ఏర్పాటు చేశారు. లలిత, పాశ్చాత్య సంగీతంతో పరిచయం అక్కడ నుంచే మొదలయ్యింది. ఇలా వేర్వేరు సంగీత విభాగాలపై ప్రతిభకు మంచి అవగాహన ఉండటం తన ఇ-కాడమీ నడపటంలో బాగా పనికొచ్చింది. ప్రతి విభాగానికి ప్రత్యేకంగా తగిన సిలబస్ రూపొందించేందుకు దోహదపడింది.

తన అత్యుత్తమ ప్రదర్శనలతో కూడిన వీడియోలతో ప్రతిభాస్ మ్యూజిక్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ను కూడా నడుపుతున్నారు.

" ప్రయోగాల ద్వారా ప్రతి సారీ నా ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరచడం అంటే నాకు చాలా ఇష్టం. కర్నాటిక్ - రాక్ ఫ్యూజన్, అక్పెల్లా, క్లాసికల్ డబ్ స్టెప్, అన్ ప్లగ్డ్ ,మషుప్స్.. వంటి థీమ్స్ ను కూడా ప్రొడ్యూస్ చేశాను. ఈ వీడియోలను తయారు చేసేందుకు దేశవ్యాప్తంగా 30 మంది ఆర్టిస్టులతో కలిసి పని చేశాను " - ప్రతిభ

ఒకేసారి వేర్వేరు పాత్రలు పోషించడం ఆమెకు పెద్ద సవాలుగా ఉండేది. ఒక రోజులో.. ఓ సారి పాఠాలు చెప్పాలి. మరోసారి కంపోజర్ అవతారం ఎత్తాలి. ఇంకోసారి స్జేజ్ పై ప్రదర్శనలివ్వాలి. ఇవన్నీ చూసుకుంటేనే తాను ఓ సంస్థను నడుపుతున్నాననే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతి పాత్రలోనూ పూర్తిగా లీనమవ్వాలి. అయితే వాటన్నింటిపై ప్రతిభకు పూర్తి అవగానన ఉండటం వల్ల ఏ ఇబ్బందీ లేకుండా సవ్యంగా నడిచిపోయింది.

అమ్మకూచి

అమ్మే ఆమెకు స్ఫూర్తి. వృత్తి పట్ల పూర్తి నిబద్ధత ఉన్న వ్యక్తి. ప్రతిభ మాటల్లో చెప్పాలంటే.. "ఇప్పటికీ నన్ను ఎంతో బాద్యతగా,విలువలతో పెంచాలనుకుంటుంది. పని పట్ల ఆమెకున్న నిబద్ధత, ఏ విషయంలోనూ రాజీకాకపోవడం నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ఈ రెండింటిని నేను ఆమె నుంచి స్వీకరించానని నమ్ముతాను "

పాఠశాల చదువు పూర్తయిన తరువాత పై చదువుల కోసం పదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నారు. తనదైన వ్యక్తిత్వం పెంపొందించుకునేందుకు, స్వతంత్ర మహిళగా ఎదిగేందుకు ఆ పదేళ్లూ ఆమెకు బాగా ఉపయోగపడ్డాయి. ఆమె చదువు, అనుభవం.. ఇ-కాడమీని ప్రారంభించడంలోనూ దాన్ని మరింత అభివృద్ధి పరచడానికి బాగా పనికొచ్చాయి.

ఏంటి ఇ-కాడమీ

గత 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 50 నగరాల నుంచి విద్యార్థులు తన ఇ-కాడమీలో చేరారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. అటు విద్యార్థికి, ఇటు గురువుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నేర్చుకోవడానికి, పాఠాలు చెప్పడానికి అనువుగా ఉండటమే ఈ ప్రాజెక్టులో ఉన్న ప్రధాన సౌలభ్యం.

" మా సంస్థలో సంగీతం నేర్పే ప్రతి ఒక్కరూ మంచి పెర్ ఫార్మర్ కూడా. అందువల్ల విద్యార్థులు కూడా నేర్చుకోవడంలో చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు " అంటారు ప్రతిభ.

భారతీయ సంగీతం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం గాత్ర సంగీతంలో అనేక కోర్సులను ఆఫర్ చేస్తోంది ప్రతిభ ఇ-కాడమీ. శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతంతో పాటు వాయిస్ కల్చర్, లలిత సంగీతం, సినిమా పాటలు పాడటంలో టెక్నిక్స్, సెమీ క్లాసికల్ మ్యూజిక్ విభాగాల్లోనూ స్వల్పకాలిక కోర్సులు ప్రవేశపెట్టింది. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు.


image


ఒకే ఇంట్లో ఇద్దరు ..!

తన భర్త కూడా మరో సంస్థను నడుపుతున్న వ్యక్తే. ఆయన అన్ని విధాల సహకరించడం మాత్రమే కాదు. ఆమెకు స్ఫూర్తిప్రదాత కూడా. రెండు వేర్వేరు సంస్థలు నడుపుతున్న వ్యక్తులు భార్య, భర్తలుగా ఏ ఇబ్బంది లేకుండా కలిసి జీవించడం అంటే మాటలు కాదు. కానీ అభిరుచుల్ని అర్థం చేసుకోవడం, లక్ష్యాన్ని సాధించాలని నిరంతరం గుర్తు చేస్తుండటం.. దాన్ని చేరుకోవడానికి ఏం చెయ్యాలో చెప్పే జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టం అంటారు ప్రతిభ.

ఇక తన సంస్థ , దాని నిర్వాహణలో ఎదురయ్యే సవాళ్ల విషయానికొస్తే.. " ఏ సంస్థ ప్రారంభంలోనైనా కొంత అస్పష్టత, అనిశ్చితి కనిపించడం సహజం. వాస్తవికంగా ఆలోచించకుండా, నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే భ్రాంతిలోనే మిగిలిపోవాల్సి వస్తుంది. వ్యాపారంలో నిరాశలు ఉంటాయి. గుండె పగిలే సంఘటనలూ ఎదురవుతాయి. అలాగని కష్టపడి పని చెయ్యడం మానేయకూడదు. ఓర్పుతో ఏకాగ్రత కోల్పోకుండా మనం చేస్తున్న పని మీదే దృష్టి పెట్టాలి " అంటారు ప్రతిభ.

నిరంతర ప్రేరణ

తన ఏడాది క్యాలెండర్‌లో పరిమిత సంఖ్యలో ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. తన ఛానెల్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల్ని చేరుకోవడం .. ప్రతిభాస్ ఇ-కాడమిని కొత్త వారికి మరింత చేరువ చెయ్యడం ఆమె ముందున్న లక్ష్యాలు.

"ఆరంభించి పరిత్యజింతురు.. విఘ్నాయత్తులై మధ్యముల్" ఇలా అనిపించుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే నా సంస్థ నాణ్యమైన సంగీత విద్యనందించడంలో అందరికన్నా మిన్నగా ఉండాలి " ఆమెకు నిరంతరం ప్రేరణ ఇచ్చేవి ఈ మాటలే.