ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా డిజిటల్ తెలంగాణ పెవిలియన్

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా డిజిటల్ తెలంగాణ పెవిలియన్

Wednesday November 16, 2016,

2 min Read

ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ప్రతిష్టాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2016 అట్టహాసంగా మొదలైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఫేర్ లో 150 కంపెనీల స్టాళ్లు కొలువుదీరాయి. ఈ ఏడాది కేంద్రం డిజిటల్ ఇండియాను స్టాల్ థీమ్గా ఎంచుకుంది. దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ తెలంగాణ థీమ్ తో పెవిలియన్ ఏర్పాటు చేసింది.

టీ హబ్ తో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా పెవిలియన్ రూపొందించారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రపంచస్థాయి సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సదుపాయాలను తెలిపేవిధంగా డిజైన్ చేశారు. ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ నేతృత్వంలో నాలుగు వారాలుగా శ్రమించి పెవిలియన్ కు ఒక రూపం తీసుకొచ్చారు.

టీ హబ్ కేటలిస్ట్ బిల్డింగ్ నమూనాలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ గవర్నెన్స్, ఎమ్-గవర్నెన్స్ ఇన్షియేటివ్స్, టాస్క్ (TASK) సాఫ్ట్‌ నెట్, టీ హబ్ గేమింగ్ జోన్ లాంటి ఐటీ ఇన్షియేటివ్స్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఫైబర్ గ్రిడ్ నమూనా కూడా పెవిలియన్ లో అదనపు ఆకర్షణ.

మిషన్ భగీరథతో పాటు శరవేగంగా పూర్తవుతున్న ఫైబర్ గ్రిడ్ సమగ్ర సమాచారాన్ని రిసెప్షన్ లో అందుబాటులో ఉంది. ఫైబర్ గ్రిడ్ పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయి నెట్ వర్క్‌, జిల్లా, గ్రామస్థాయి నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో డెమో చూపిస్తున్నారు.

ఏడాది కాలంలో టీ హబ్ సాధించిన విజయాలను, మైలురాళ్లను ఇక్కడ పొందుపరిచారు. ఈ-గవర్నెన్స్ కింద అందిస్తున్న పౌరసేవలను, యాప్స్ ద్వారా లభిస్తున్న ఎమ్-గవర్నెన్స్ సర్వీసుల సమాచారాన్ని వివరిస్తున్నారు.

image


ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవ నుంచి 350 సర్వీసులు, ఈ-సేవ నుంచి 245 సేవలను అందిస్తోంది. మొత్తం 4500 సెంటర్లలో 110 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయి. 36 శాఖలను సమన్వయం చేసి మొబైల్ యాప్ ద్వారా 600 సర్వీసులను ఎమ్ గవర్నెస్స్ రూపంలో అందిస్తున్నారు.

ప్రస్తుతం పల్లె సమగ్ర సేవా కేంద్రాలు 300 వరకు ఉన్నాయి. వచ్చే జనవరి నాటికి వాటి సంఖ్య వెయ్యి దాటించాలనే సంకల్పంతో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్య ఉన్నందున త్వరలో దాన్ని పరిష్కరిస్తామని అంటున్నారు.

పల్లె సమగ్ర సేవా కేంద్రాల ముఖ్య ఉద్దేశం విలేజ్ లెవల్ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడం. గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక బృందాలు లీడ్ చేసే వారిని ఆంట్రప్రెన్యూర్లుగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పం. వారికి నెలకు రూ.15-20వేలు కమిషన్ వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రాథమికంగా నాలుగు శాఖలతో సమన్వయం చేసి మహిళలకు ఆర్ధికంగా చేయూతనిస్తున్నారు. ఇటీవలే మహబూబన్ నగర్ కు చెందిన ఒకావిడ పల్లె సమగ్ర సేవా కేంద్రం ద్వారా రూ.40 వేలదాకా డ్రా చేస్తోంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని పల్లెల్లోని మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

image


మరోవైపు తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటేలా హస్తకళలు, కళారూపాలు, చేనేతలు, టూరిజం, వంటకాలు పెవిలియన్ లో ముచ్చట గొలుపుతున్నాయి. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, పెంబర్తి కళాఖండాలు, నిర్మల్ బొమ్మలు, డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ పెవిలియన్ కే వన్నె తెచ్చాయి. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట్ చేనేత స్టాల్స్ ఆహుతులను ఆలరిస్తున్నాయి.

ఈ నెల 27వ తేదీ వరకు ఈ ఫేర్ కొనసాగుతుంది. 21న ఒగ్గుడోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ఇక వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలు అమోఘం. ఎగ్జిబిషన్ కు వచ్చిన ప్రతీ ఒక్కరూ బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లడం లేదు.