రాధిక సంకల్పానికి సలాం కొట్టిన ఎవరెస్ట్ శిఖరం

పోలీస్ అధికారిగా బాధ్యతల్లో ఉంటూనే పర్వతారోహణలో కీర్తిపతాక

0


ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎవరికి ఉండదు..?

అందరికీ ఉంటుంది.. కానీ అడ్డంకులను అధిగమించి.. 

కలను సాకారం చేసుసుకునేవారు ఎంత మంది ఉంటారు..?

చాలా.. చాలా పరిమితంగా ఉంటారు..!

మహిళల్లో అయితే ఇంకా ఇంకా పరిమితం...! ఎందుకంటే... వారికి పిల్లలు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లు ఇలా ఎన్నిటితోనో నిరంతరం వారు సమరం చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ అన్ని బాధ్యతలకు న్యాయం చేస్తూ పర్వతాహోరణలో ఉన్నత స్థానానికి చేరి తన కలను నిజం చేసుకుని స్ఫూర్తిగా నిలిచారు ఆదిలాబాద్ ఏఎస్పీ జి.ఆర్. రాధిక.

ఈ నెల 14వ తేదీన ఆమె ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు బేస్ క్యాంప్ నుంచి బయలుదేరారు. మే 20 వ తేదీన ఆమె ఎవరెస్ట్ పై దేశజెండాను సగర్వంగా ఎగరేశారు. అయితే ఆమె ఈ ఘనతను ఆషామాషీగా సాధించలేదు. కఠోరమైన శ్రమ, అంతకు మించి పర్వతారోహణంపై ప్రేమ ఆమెను ఎవరెస్ట్ శిఖరాగ్రానికి తీసుకెళ్లాయి.

పర్వతాలు తలవంచే పట్టుదల

ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జీ.ఆర్.రాధికకు చదువుకునే రోజుల నుంచి మౌంటెనీరింగ్ పై అమితమైన ఆసక్తి. చిన్నతనంలో ఊళ్లోని కొండలు, గుట్టలు ఎక్కడంలో ఉన్న కిక్ ఆమెను నిరంతరం వెంటాడేది. అందుకే ఎలాంటి చదువులు చదివినా... ఏ ఉద్యోగం చేసినా... పర్వాతారోహణను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నారు. ఉద్యోగంలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగినా... పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయినా.. తన ఆసక్తి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. పర్వాతాహోరణకు తగ్గట్లుగా ఫిట్ నెస్ ఎప్పుడూ మెయిన్ టెయిన్ చేసేవారు. ఎవరెస్ట్ అధిహోరించేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు రాధిక.

మొదట మాన‌స స‌రోవ‌రం యాత్రను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. 5100 మీట‌ర్ల ఎత్తున్న ప‌ర్వతాన్ని పూర్తిగా కాలిన‌డ‌క‌తోనే అధిరోహించారు. తర్వాత జ‌మ్మూక‌శ్మీర్ లో మౌంటెనీరింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణ‌లో భాగంగా 6,100మీట‌ర్ల ఎత్తున్న గోబెల్ కాంగ్రీ అనే ప‌ర్వతాన్ని అవ‌లీల‌గా ఎక్కడంతో ఆమెలో ఉత్సాహం రెట్టింప‌యింది. అదే జోష్ తో గ‌త సంవ‌త్సరం ఆగ‌స్టులో 7707 మీట‌ర్ల ఎత్తున్న కున్ ప‌ర్వతాన్ని అధిరోహించారు. ఆ యాత్ర ఎంత క్లిష్టంగా సాగిందంటే... గ్రూపులోని పర్వాతారోహకులంతా తమ వల్ల కాదని మధ్యలోనే విరమించుకున్నారు. కానీ రాధిక మాత్రం పట్టువీడకుండా చివ‌రి వ‌ర‌కు వెళ్లారు. గ‌మ్యాన్ని చేరారు. అదే స్ఫూర్తితో ఇపుడు ఎవ‌రెస్టు శిఖరాన్ని పాదాక్రాంతం చేసుకున్నారు.

నెలల పాటు కఠోరమైన సాధన

ఎవరెస్ట్ ఎక్కే కొద్దీ ఉండే వాతావరణ పరిస్థితులను అలవాటుపడటానికి ఏఎస్పీ రాధిక కఠోర సాధన చేశారు. 8,850 మీట‌ర్ల ఎత్తున్న ఎవ‌రెస్టు అధిరోహాణ‌కు అన్ని విధాలా సిద్ధమ‌య్యారు. శారీర‌క ధృడత్వం కోసం ర‌న్నింగ్ ,జిమ్ ,యోగా త‌దిత‌ర వ్యాయామాలతో సంసిధ్దమ‌య్యారు. ట్రాన్సెండ్ అడ్వెంచ‌ర‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో సాహస యాత్ర కొన‌సాగుతోంది. వాతావరణ పరిస్థితులను అనుగుణంగా వారు ఎవరెస్ట్ ను అధిరోంచారు.

ప్రభుత్వ ప్రొత్సాహం

ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భావిస్తున్న జి.ఆర్.రాధికకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె శిక్షణ, పర్వతారోహణకు ఆర్థిక సాయం అందజేసింది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ సహా పోలీసు సిబ్బంది అంతా రాధిక ఎవరెస్ట్ అధిరోహణ విజయవంతంగా పూర్తవ్వాలని ఆకాంక్షించారు. వారు ఆశించినట్టుగానే రాధిక పోలీసు శాఖ గొప్పతనాన్ని ఎవరెస్టు మీద నిలిపారు. 

పర్వతారోహణలో తెలుగువాళ్ల ట్రెండ్

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో మల్లిమస్తాన్ బాబు మొదటి వరుసలో ఉంటారు. ఆయన ఎక్కని పర్వతం లేదంటే ఆతిశయోక్తి కాదు. తాను తనకిష్టమైన పర్వాతారోహణలోనే ప్రాణత్యాగం చేశారు. ఇక మన మలావత్ పూర్ణ, ఆనంద్ చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని నిరూపించారు. ఇప్పుడు ఈ సంకల్పంతోనే రాధిక కూడా ఎవరెస్ట్ ను అధిరోహించారు. ఆమె సాధించిన విజయం మౌంటెనీరింగ్ లో తెలుగువాళ్ల ప్రతిభను విశ్వ వ్యాప్తం చేసింది.  

As an IT engineering graduate... i am passionate to know about new and innovative ideas and explore them.....

Related Stories

Stories by SOWJANYA RAJ