వీళ్లు కనిపెట్టిన డివైజ్ కారులో ఉంటే యాక్సిడెంట్ అన్నమాటే ఉండదు..!!

0

గేటెడ్ కమ్యూనిటీ అంటే రోడ్లు బాగుంటాయి. పేవ్ మెంట్ విశాలంగా ఉంటుంది. జనం రోడ్ల మీదికి రారు. కాబట్టి ఎలాగైనావాహనం నడపొచ్చు. ఈ ధోరణి వల్ల గేటెమ్ కమ్యూనిటీల్లో ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. విలువైనప్రాణాలు పోతున్నాయి. అలాంటి ప్రమాదాలకు ఒక డివైజ్ సమర్థంగా అడ్డుకట్ట వేస్తోంది.

ట్రాక్యో! కనెక్టెడ్ వెహికిల్ స్టార్టప్ ఇది. అంటే- ఒక వాహనం రోడ్డు మీదుగా వెళ్తుంటే.. దాని గమనాన్ని గుర్తించి, రోడ్డుప్రమాదాలు జరగకుండా నిరోధిస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ ఏరియాలు, టౌన్ షిప్లు, షాపింగ్ కాంప్లెక్సులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఎయిర్ పోర్టుల వంటి జనసమ్మర్ద ప్రాంతాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ఉదాహరణకు ఒక గేటెడ్ కమ్యూనిటీని తీసుకుందాం. ఒక కారు లోపలికి వెళ్లే ముందే సెక్యూరిటీ గార్డు డ్రైవర్ కి ఒక ట్రాకింగ్ డివైజ్ ఇస్తాడు. దాన్ని కారు డ్యాష్ బోర్డు మీద పెట్టుకోవాలి. ఆ డివైజ్ గేటెడ్ కమ్యూనిటీలో అమర్చిన సర్వర్లకు కనెక్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి వాహనం పూర్తిగా డివైజ్ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. కారు ఎంత వేగంతో వెళ్తుంది? ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడుంది? డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నాడా? అసలు డ్రైవర్ ప్రవర్తన ఎలాఉంది? లాంటి వివరాలన్నీ డివైజ్ ట్రాక్ చేస్తుంది. వెహికిల్ సెక్యూరిటీ గార్డు కంప్యూటర్ ముందు కూర్చొని మానిటర్చేస్తుంటాడు.

ఒకవేళ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్తుంటే.. వెంటనే ఒక ఆడియో హెచ్చరిక వస్తుంది. అదే టైంలో గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుతున్న మిగతా వాహనాలకు కూడా అలర్ట్ వెళ్తుంది. దాంతో ఇతర డ్రైవర్లు అప్రమత్తమై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడొచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే.. సెక్యూరిటీ గార్డు ఒకే ఒక్క క్లిక్ తో అంబులెన్స్ కు గానీ లేదా ఇతర ఎమర్జెన్సీ సర్వీసుకు గానీ సందేశం పంపొచ్చు. వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు రోడ్ సైడ్ యూనిట్లు పాదచారులను అప్రమత్తం చేస్తాయి.

 ట్రాక్యో డివైజ్ రియల్ టైం నావిగేషన్ తో పనిచేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలో బండి ఎక్కడ పార్క్ చేయాలో కూడా చెప్తుంది. వాహనం బయటికి వచ్చిన తర్వాత గార్డు ట్రాకింగ్ డివైజ్ ను వెనక్కి తీసుకుంటాడు. ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవర్ దగ్గర జరిమానా వసూలు చేస్తాడు.

2014 ఆగస్టులో ట్రాక్యో ఆలోచన పురుడు పోసుకుంది. 2016 సెప్టెంబర్లో కార్యరూపం దాల్చింది. దేశంలోని అన్ని గేటెడ్కమ్యూనిటీలకు సేవలు అందించడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ ప్రారంభమైంది. ఇందులో ఆరుగురు కోర్ టీం. సీఈవో యశ్అగర్వాల్, సీటీవో కృతికా జైన్, అడ్వైజర్ మెంబర్లు ఆర్కున్ కరబాసొగ్లు, అతిఫ్ ఇనాయత్ ఖాన్- కంపెనీకిమూలస్తంభాలు. గేటెడ్ కమ్యూనిటీల్లో యాక్సిడెంట్ల నివారణ కోసం ట్రాక్యోను ప్రారంభించామంటున్నారు సీఈవో యశ్అగర్వాల్.

ట్రాక్యో కంపెనీకి టీ-హబ్ మంచి సపోర్ట్ ఇచ్చింది. టీ-హబ్ లేకపోతే తమకు ఇన్వెస్టర్లు, కస్టమర్లు దొరికేవారు కాదంటున్నారు కంపెనీ సీఈవో. టీ-హబ్ ను ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆసియాలోనేఅతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్.. త్వరలోనే ప్రపంచంలో నంబర్ వన్ గా నిలుస్తుందన్నారు.

పది లక్షల పెట్టుబడితో మొదలైన ట్రాక్యో కంపెనీ విలువ.. ఇప్పుడు ఆరున్నర కోట్లు! ఇది చిన్నవిషయం కాదు. ఐడియా బాగుంది కాబట్టే సీడ్ క్యాపిటల్ వచ్చింది. జూన్లో ట్రాకింగ్ డివైజెసక తయారు చేసి, ఆగస్టు కల్లా హైదరాబాదీలకు సేవలు అందించడానికి ఫౌండర్లు రెడీ అవుతున్నారు.

Related Stories