మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉందో ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్న ఉబర్ హెల్త్

పేరెంట్స్ హెల్త్ రికార్డులు ఎక్కడినుంచైనా ట్రాక్ చేయచ్చంటున్న ఉబర్ హెల్త్అపాయింట్మెంట్ నుంచి కన్సల్టేషన్ వరకూ...హాస్పిటల్ తీసుకెళ్లిన దగ్గరనుంచి ఇంట్లో దింపే వరకూ..మందులు కొనివ్వడం నుంచి ఆన్‌లైన్‌లో రిపోర్టులుంచే వరకూ...మీ పేరెంట్స్ బాధ్యత మాది అంటున్న ఉబర్ హెల్త్

మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉందో ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్న ఉబర్ హెల్త్

Saturday June 06, 2015,

3 min Read

పెద్ద వయసున్న తల్లిదండ్రులు ఒకచోట... సంపాదన కోసం పిల్లలు మరోచోట. ఈ పరిస్థితి చాలా మందికి ఎదరువుతుంది. అలా దాదాపు 80ఏళ్లకు మించి వయసున్న తల్లిదండ్రులు గల వ్యక్తి నీరజ్ సిన్హా. ఈయన న్యూయార్క్‌లో నివాసముంటుండగా... పేరెంట్స్ మాత్రం కోల్‌కతాలో ఉన్నారు. “ఐదేళ్లుగా మా పేరెంట్స్ ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. ఏదో ఓ అనారోగ్యం వారిని వెంటాడుతోంది. ఈ ఐదేళ్లు నన్ను ఇదే సమస్య వెంటాడుతోంది. నేను వారిని అమెరికా తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను. అయితే వారు అందుకు ఇష్టపడలేదు” అని చెప్పారు నీరజ్.

కొంతకాలం క్రితం ఉబర్ హెల్త్ గురించి తెలుసుకున్నారు నీరజ్. తమ కుటుంబీకులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి గల వారికి ఈ సంస్థ ఆరోగ్య సేవలు అందిస్తుంది. అన్ని రకాలుగానూ వారి హెల్త్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నీరజ్ తన తల్లిదండ్రుల మెడికల్ రికార్డులను ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోగలుగుతున్నారు. అంతేకాదు అవసరమైతే ఉబర్ హెల్త్ ద్వారా సెకండ్ ఒపీనియన్ కూడా తెలుసుకోగలుగుతున్నారు.


image


ఉబర్ హెల్త్... ఇది ఎన్ఐటీ(జలంధర్) పూర్వ విద్యార్ధి కమల్ అగర్వాల్, ఇషాన్ ఝా, అజయ్ పాల్ సింగ్‌ల మానసపుత్రిక. వీరంతా ఆ సంస్థ భాగస్వాములు. అనారోగ్యంగా ఉన్నవారి ఇంటి దగ్గర నుంచే బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, డాక్టర్ల సలహా ప్రకారం సాయం చేస్తారు. ఆయా డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులను, ఫీడ్‌బ్యాక్‌ను ఆన్‌లైన్‌తో పాటు ఫిజికల్‌గా కూడా అందిస్తారు.

కమల్ అగర్వాల్‌ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సొంత సంస్థ ఏర్పాటుకు ముందు ఇంటెల్, మోటరోలా, రాంబస్, ఇన్ఫినియాన్‌లలో కీలక విధులు నిర్వహించారు. ఇషనా గతంలో సీఎస్‌సీలో పని చేయగా... ప్రస్తుతం ఈ సంస్థ కోసం అమెరికా, యూఎస్‌లలో భాగస్మాములు, ఆపరేషన్స్, డెవలప్మెంట్‌లను చూసుకుంటున్నారు. అజయ్ గతంలో డీఆర్‌డీఓ సైంటిస్ట్‌గా విధులు నిర్వహించిన వ్యక్తి. ఈయన ఉబర్‌హెల్త్‌లో మార్కెటింగ్, పార్ట్‌నర్‌షిప్స్‌ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

కమల్ అగర్వాల్

కమల్ అగర్వాల్


పేరెంట్స్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితే ఈ ఆలోచనకు మూలం

“మేమంతా మా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఫేస్ చేశాం. వారి ఆరోగ్యంపై మాకెప్పుడూ చింతే. వయసు మీద పడ్డాక వారికి తమంతట తామే చీటికిమాటికీ హాస్పిటల్‌కో, ఆస్పత్రికో వెళ్లాలంటే చాలా కష్టం. అక్కడ పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం అంతకంటే కష్టం. ఈ సమస్యకి ఓ పరిష్కారం ఆలోచించాం. ప్రతీ విషయంలోనూ సర్వీస్ అందించాలని భావించాం. అపాయింట్‌మెంట్ తీసుకోవడం నుంచి హాస్పిటల్‌కి తీసుకెళ్లి, తిరిగి ఇంటి దగ్గరకు చేర్చేవరకూ సహాయంగా నిలబడాలని అనుకున్నాం. కావలసిన మందులు కొని తెచ్చి ఇంట్లో దించడంతోపాటు... ఆ రిపోర్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని బావించాం. మా కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చూసుకుంటారు” అన్నారు కమల్.


ఇషాన్ ఝా

ఇషాన్ ఝా


వయసు పైబడి, విడిగా ఉంటున్న వారి కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశామంటారు ఈ ముగ్గురూ. అయితే తల్లిదండ్రులతో కలిసే ఉన్నా... రోజంతా బిజిగా ఉండి కనీస సేవలు అందించలేని పరిస్థితి చాలామందికి ఉంది. ఇలాంటి వారు కూడా ఉబర్ హెల్త్ సేవలను వినియోగించుకుంటున్నారు. “చాలామంది తమ కోసం ఇలాంటి సర్వీసులు అందించాలని కోరుతున్నారు. దీంతో ఫ్యామిలీ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అయితే పేరెంట్స్ విభాగానికి ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుంద”ని చెప్పారు అజయ్.

ఈ కంపెనీ ఒక ఏడాదికి ప్రివెంటివ్ కేర్ ప్యాకేజ్ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా ముందుగా చెకప్ చేసి, వారికోసం ఓ ఏడాదికి అవసరమైన ప్రత్యేక ఆరోగ్య ప్రణాళిక తయారు చేస్తారు. అలాగే డాక్టర్ అవసరమనుకుంటే కాల్ చేసి సేవలు కోరవచ్చు. కన్సల్టేషన్, నాన్-ఎమర్జెన్సీ సేవలను.. అదే రోజుకోసం అయినా తీసుకోవచ్చు. దీనికోసం చేయాల్సింది ఏంటంటే ఉబర్ హెల్త్‌కు కాల్ చేయడమో, ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడమో చేయాలి. అంతే మిగతాదంతా మేం చూసుకుంటాం అంటోంది ఉబర్ హెల్త్.

అజయ్ పాల్ సింగ్

అజయ్ పాల్ సింగ్


మార్కెట్లో అవకాశమెంత ?

ఈ తరహా సర్వీసులకు మార్కెట్లో ఏ స్థాయి అవకాశాలున్నాయో ప్రత్యేకమైన డేటా ఏం లేదు. అయితే అనధికారిక అంచనాల ప్రచారం భారత్‌లో ఎల్డర్లీ హెల్త్ కేర్ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లు. మన దేశానికి ఏటా 68బిలియన్ డాలర్లను ఎన్ఆర్ఐలు పంపుతున్నారు. “మేం కేవలం ఎన్నారైల పైనే ఫోకస్ ఉంచినా... 2012నాటికే 2.2 కోట్ల మంది విదేశాల్లో ఉన్నారు. వారిలో చాలావరకూ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. మరోవైపు మిడిల్ క్లాస్ సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం కూడా ఇలాంటి పరిస్థితిని మరింతగా పెంచుతోంది” అంటున్నారు ఇషాన్.

ఆదాయ మార్గాలు ఇవే

ప్రారంభించిన అనతి కాలంలోనే ఈ స్టార్టప్‌కు మంచి ఆదరణ లభించింది. కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ బాగా పెరుగుతోంది. వీరిలో చాలామంది భారత్‌లోనే ఉండి.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నవారే. “మాకు కొంత మంది ఎన్నారై కస్టమర్లు కూడా ఉన్నారు. త్వరలో మా సర్వీసులు విస్తరించనుండడంతో మరింతమంది కస్టమర్లు జతవుతారని భావిస్తున్నాం. అలాగే చాలామంది తమకోసం తామే ఈ సేవలు వినియోగించుకుంటున్నారు”- కమల్

ఇది సర్వీస్ బేస్డ్ మోడల్ కావడంతో... కస్టమర్ల నుంచే ఆదాయం సమీకరించాలి. “ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా హెల్త్ రిపోర్టులు, ప్రొఫైల్స్ చెక్ చేసుకునే సౌకర్యాన్ని ఉచితంగానే అందిస్తున్నాం. అవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంతో ప్రపంచంలో ఎక్కడినుంచైనా వాటిని యాక్సెస్ చేయచ్చు. ఆన్‌లైన్ కన్సల్టేషన్, సెకండ్ ఒపీనియన్ వంటి సర్వీసులూ అందిస్తున్నాం. అంతే కాదు వారు ప్రోగ్రెస్‌ను కూడా మానిటర్ చేసుకోవచ్చం”టున్నారు అజయ్.

కెనడాలో జరిగిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్‌లో పార్టిసిపేట్ చేసిన ఏకైక స్టార్టప్ ఉబర్ హెల్త్.

రాబోయే రోజుల్లో...

త్వరలో మరిన్ని సర్వీసులు అందించడంతో పాటు ఇతర నగరాల్లో విస్తరించేందుకు ఉబర్ హెల్త్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పంజాబ్, నేపాల్‌లకూ సేవలందించే యోచన ఉంది. “ఇతర సర్వీస్ ఆధారిత సంస్థలతో కలిసి మరిన్ని సేవలు అందించబోతున్నాం. అంతర్జాతీయ స్థాయి కంపెనీగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నాం. యూఎస్ సహా అన్ని దేశాల్లోనూ హెల్త్‌కేర్ రంగానికి ఇప్పుడు ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతోంది”అంటున్నారు కమల్ అగర్వాల్.

Website : www.uberhealth.co