ఇండియన్ థ్రెడ్స్.. ఇద్దరు కుర్రాళ్ల కత్తిలాంటి ఐడియా లక్షల బిజినెస్ చేస్తోంది..!  

0

ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరోజు షర్టు కొందామని షాపుకి వెళ్లారు. అక్కడ మంచి మంచి డిజైన్లలో కొన్ని టాప్ బ్రాండ్స్ కనిపించాయి. ఫ్యాబ్రిక్, స్టయిల్, ఫిటింగ్ అన్నీ గొప్పగా ఉన్నాయి. కానీ రేటు చూస్తే అదిరిపోయింది. మరోపక్క చిన్న బ్రాండ్స్. వాటి ధర పెద్దగా లేదు. క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉన్నంత మాత్రాన అంతంత రేటు ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి బట్టలు సామాన్యులకు అందుబాటులో ఎందుకు వుండొద్దు. ఇదే కోణంలో ఆలోచించి ఇండియన్ థ్రెడ్స్ మొదలుపెట్టారు ఇద్దరు మిత్రులు. 22 ఏళ్ల అభిషేక్ రావల్, విషి పోర్వాల్ కి ఎలాంటి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అయినప్పటికీ, చిన్న కామన్ సెన్స్ తో అడుగు ముందుకు వేశారు.

భారీ లాభాలను వదులకుని అమ్మకాలు ఎలా సాగించాలి అనే కోణంలో అనేక మార్గాలు అన్వేషించారు. నేరుగా కస్టమర్ కే అమ్మడం వల్ల మధ్యలో ఉన్న మూడు అంచెల వ్యవస్థను దూరం చేయొచ్చు కదా అని భావించారు. ఆటోమేటిగ్గా వాళ్లకు వెళ్లే మార్జిన్ మిగిలి పోతుంది. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీతో సేల్స్ ప్రారంభించారు.

ఏడాది తిరిగే సరికి అమ్మకాలు ఊపందుకున్నాయి. రౌండ్ ద క్లాక్ పనిచేశారు. ఫ్యాబ్రిక్ దగ్గర్నుంచి డిజైన్, టీమ్ బిల్డప్, లాజిస్టిక్.. ఇలా అన్నీ తామై చూసుకున్నారు. డోర్ టు డోర్ తిరిగారు. వందలాది చిన్న చిన్న వెండర్ల దగ్గరికి వెళ్లారు. మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఫ్యాషన్ మార్కెట్ నానాటికీ ఖరీదుగా మారుతున్నా కొద్దీ కసిగా పనిచేశారు.

అలాగని సవాళ్లు లేవని కాదు. వ్యాపారం నల్లేరు మీద నడకేం కాలేదు. ప్రొడక్షన్ అంతా మార్కెట్లోకి తీసుకుని పోవడానికి ఎంతలేదన్నా 20-25 రోజులు పట్టేది. ఆన్ లైన్ వెబ్ స్టోర్ తో పాటు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లోని 120 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్లలో ఇండియన్ థ్రెడ్స్ షర్ట్స్ పెట్టారు.

2015లో మొదలైన ఇండియన్ థ్రెడ్స్ టీంలో ఆరుగురు సభ్యులున్నారు. అభిషేక్ రావల్, విషి పోర్వాల్ ఇద్దరు ఫౌండర్లు. వాళ్లిద్దరూ కాలేజీ డ్రాపవుట్స్. ఇద్దరు సేల్స్, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటారు. ఒకతను ఫ్యాషన్ డిజైనర్. ఇంకో పర్సన్ టెక్నికల్(వెబ్ స్టోర్, సోషల్ మీడియా) చూసుకుంటాడు.

మొదటి మూడు నెలల్లో కేవలం 60 షర్ట్స్ మాత్రమే సేల్ చేయగలిగారు. క్రమంగా ప్రొడక్షన్ పెరగడంతో అమ్మకాల్లో రాపిడ్ గ్రోథ్ కనిపించింది. ప్రస్తుతం నెలకు ఆరువేల షర్ట్స్ అమ్ముతున్నారు. నెలకోసారి 50 రకాల డిజైన్లు లాంఛ్ చేస్తున్నారు. ఈ ఏడాది 200 శాతం గ్రోథ్ సాధిస్తామని నమ్మకంతో ఉన్నారు. వెబ్ సైట్ రోజుకి 2శాతం కన్వర్షన్ రేటుతో 1500 హిట్స్ సాధిస్తుంది. ఎలైట్ లైఫ్ స్టయల్, ఇంకా ఇతర ఆన్ లైన్ అప్పారల్ పోర్టల్స్ తో టై అప్ పెట్టుకున్నారు.

ప్రస్తుతానికి షర్ట్స్ వరకే పరిమితమైనా, బాటమ్ వేర్ కూడా అందుబాటులోకి తేవాలని సంకల్పంతో ఉన్నారు. దాంతోపాటు ఎథ్నిక్ వేర్, సూట్, బ్లేజర్, యాక్సెసిరీస్ కూడా తేవాలని చూస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇండియా అంతటా సొంత స్టోర్ ఓపెన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశాల్లో కూడా ఇండియన్ బ్రాండ్ సత్తా ఏంటో చూపాలని కసితో ఉన్నారు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Stories

Stories by team ys telugu