ఐదేళ్లుగా రోడ్డుపై మేకులు ఏరుతున్న బెంగళూరు టెకీ.. ఎందుకో తెలుసుకుంటే అభినందిస్తారు..  

0

బెనడిక్ట్ జెబాకుమార్. బెంగళూరులో ఉంటాడు. వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రవృత్తి మాత్రం మేకులు ఏరడం. అదేంటి..? టెకీ అయివుండి చీప్ గా పనికిరాని మేకుల వెంట పడ్డాడేంటి అనే అనుమానం వచ్చింది కదా. వాస్తవానికి అవి పనికిరాని మేకులే. కానీ వాటిని ఏరడం వల్ల రోజుకి కొన్ని వందల మందిని కాపాడగలుగుతున్నాడు. అసలు కథేంటో చదివితే అతన్ని మీరే అభినందిస్తారు.

బెంగళూరు బనశంకరి ఔటర్ రింగురోడ్డు మీదుగా బెనడిక్ట్ గత ఐదేళ్లుగా రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తుంటాడు. అది కూడా సైకిల్ పైనే. పర్యావరణాన్ని కాపాడ్డానికి తనవంతు ప్రయత్నంగా సైకిల్ ఎంచుకున్నాడు. ఒకసారి ఏమైందంటే సైకిల్ టైర్ సడెన్ గా బరస్ట్ అయింది. చూస్తే లక్కీగా దగ్గర్లో పంక్చర్ షాప్ కనిపించింది. రిపేర్ చేయించుకుని ఆఫీసుకి వెళ్లాడు. తెల్లారి కూడా సేమ్ ప్లేస్.. అదే సీన్. మళ్లీ ట్యూబ్ పేలిపోయింది. చూస్తే ఒక పొడవాటి మేకు దిగింది.

అలా వరుసగా ఆరుసార్లు అలా జరిగేసరికి, ఇదేదో యాదృచ్చికంగా జరగడం లేదనే అనుమానం తట్టింది. ఔటర్ మీద ఎవరో కావాలనే మేకులు జల్లుతున్నారని అర్ధమైంది. ఎందుకంటే చెల్లాచెదరుగా పడివున్న మేకులకు అల్లంత దూరాన్నే పంక్చర్ షాపు వుంది. అంటే వీటికీ ఆ షాపుకి ఏదో లింకుందన్నమాట. అతని అనుమానం నిజమే అయింది. షాపువాడే కావాలని మేకులు వేసి టైర్లు పేలిపోవడానికి కారణమవుతున్నాడని అర్ధమైంది. తన బిజినెస్ రన్ కావడం కోసం అతను ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని తెలిసింది.

అందుకే ఒక నిర్ణయానికొచ్చాడు. ఔటర్ మీద డైలీ వేలాది వెహికిల్స్ నడుస్తుంటాయి. తనదంటే సైకిల్. పెద్దగా ప్రాబ్లం లేదు. అదే పెద్దపెద్ద బండ్లయితే ఇంకేమైనా ఉందా? అంత స్పీడులో ఒక్కసారి టైర్ బరస్ట్ అయితే, పట్టుతప్పి కచ్చితంగా బండి పల్టీలు కొడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఒక నిశ్శబ్ద విప్లవంలా, ఆరోజు నుంచి రోడ్డు మీద కనిపించిన మేకునల్లా ఏరడం ప్రారంభించాడు. డైలీ ఆఫీసుకి వెళ్తూ కొన్ని, వస్తూ కొన్ని ఏరేవాడు. ఏరినా కొద్దీ తెల్లారి కనిపించేవి. అయినా విసుగు చెందేలేద. ఇప్పటిదాకా 75 కిలోల మేకుల్ని సేకరించాడు. 

విషయం తెలుసుకున్న బెనడిక్ట్ ఫ్రెండ్ ఒకతను.. చేస్తున్న మంచిపని పదిమందికీ తెలియాలంటే, డాక్యుమెంటరీ తీసి సోషల్ మీడియాలో పెట్టమని సలహా ఇచ్చాడు. అతని సజెషన్ బెనడిక్టుకి నచ్చింది. వెంటనే ఒక షార్ట్ ఫిలిం తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగలేదు. బెంగళూరు సిటీ పోలీసులకు రెగ్యులర్ గా ట్వీట్లు కూడా పెట్టాడు. దాంతో పోలీసుల రంగంలోకి దిగి మేకులకు కారకులైన ఇద్దరు వ్యక్తుల్ని రెడ్ హాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే మేకుల సమస్యకి ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.

మొదట్లో చేత్తో ఏరేవాడు. తండ్రి పడే బాధను చూసిన కొడుకు ఒక మాగ్నెట్ స్టిక్ ఇచ్చాడు. దాంతో పని సులువైంది. ఒక్కటి కూడా వదలకుండా జాగ్రత్తగా సేకరిస్తాడు. మేకు కనిపిస్తే ఆటోమేటిగ్గా స్టిక్ దానిమీదకి పోతుందట. అంత నిశితంగా పరిశీలించే గుణాన్ని అలవాటు చేసుకున్నా అంటాడు బెనడిక్ట్. ఒక్క ఔటర్ మీదనే కాదు బిజీ ఏరియాలో ఎక్కడ నెయిల్ కనిపించినా వదలడు. అలా ఐదేళ్లుగా మేకులపై సైలెంట్ యుద్ధమే ప్రకటించాడు. బెనడిక్ట్ పుణ్యమాని ఔటర్ రింగ్ రోడ్డే కాదు, బెంగళూరు రహదారులపై నెయిల్స్ అన్నమాటే లేదు. అందుకే తన ప్రయాణాన్ని తమిళనాడుకు మార్చుకున్నాడు. అక్కడ కూడా ఇలాంటి మేకులపై సమరశంఖం పూరించాడు.

ఈ రోజుల్లో రోడ్డుకు అడ్డంగా పెద్ద బండరాయి ఉంటేనే నాకెందుకులే అని పక్కనుంచి వెళ్తారు. అలాంటిది బాధ్యతగా రోడ్డుమీద పాడుబడ్డ మేకులు ఏరడం అన్నది గొప్పవిషయం. ఎన్నో వాహనాలను యాక్సిడెంట్ల నుంచి కాపాడిన బెనడిక్ట్ నిజంగా అభినందనీయుడు.

Related Stories

Stories by team ys telugu