రూ. 500, వెయ్యి నోట్లకు చరమగీతం! నల్లధనంపై ఉక్కుపాదం!!

సంచలన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం

0

మొత్తానికి నల్లమార్కుల భరతం పట్టేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన బ్లాక్ మనీ కట్టల పాములను ఒక్కపోటు పొడిచింది. నకిలీ నోట్ల దందాకు చరమగీతం పలికింది. ఉగ్రమూకల బారినుంచి భారత కరెన్సీ నోటుకి శాశ్వత విముక్తి కలిగించింది. రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నామంటూ ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై రూ. 500, రూ. వెయ్యినోట్లు చెల్లవని మోదీ స్పష్టం చేశారు. దేశంలో పోగుపడ్డ నల్లధనాన్ని తొక్కిపట్టేందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జనం దగ్గరున్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్చుకోవడానికి డిసెంబర్‌ 30 వరకు గడువిచ్చారు. ఆలోపు బ్యాంకుల్లోగానీ పోస్టాఫీల్లోగానీ రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవాలని మోదీ తెలిపారు.

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనదేశం ఉన్నత స్థానంలో ఉందని అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడాయని గుర్తు చేశారు. ఇకపై ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసాన్ని ప్రకటించారు. పేదవాళ్లు స్వయం సమృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. అవినీతిని పారదోలేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల అలసత్వం కారణంగా పేదలు ఇంకా పేదలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగనోట్లు అభివృద్ధికి ఆటకంగా మారాయని మోదీ అన్నారు. పక్క దేశం దొంగనోట్లను మన దగ్గర విచ్చల విడిగా చెలామణి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90శాతం వెయ్యి, రూ.500 నోట్లే ఉంటున్నాయన్నారు. ఉగ్రవాదం దేశానికి పెనుసవాలుగా మారిందని అన్నారు.

బ్యాంకు నుంచి క్యాష్ తీసుకునే విషయంలో కొన్ని షరతులు ఉంటాయని మోదీ స్పష్టం చేశారు. బ్యాంకు నుంచి రోజుకు రూ. 10 వేల వరకు మాత్రమే డ్రా చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. అలా వారంలో రూ. 20వేల వరకు డబ్బు తీసుకోవచ్చని తెలిపారు. అయితే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పై ఎలాంటి కండిషన్ లేదని వెల్లడించారు. డీడీలు, చెక్కు రూపంలో చేసే బదిలీలపై ఎలాంటి పరిమితి ఉండదని స్పష్టం చేశారు.

నవంబర్‌ 11వరకు అన్ని పెట్రోల్‌ బంకుల్లోనూ రూ. 500, రూ. వెయ్యి నోట్లు చెల్లుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యి నోట్లు చెల్లుతాయని, నోట్ల చెలామణి విషయంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రైళ్లు, బస్సులు, విమానాల కౌంటర్లు, శ్మశానాలు, ప్రభుత్వ పాలడిపోల్లో వీటి చెలామణి కొనసాగుతుందని చెప్పారు.

నల్లధనాన్ని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. రూ.500, వెయ్యి రూపాయిల నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని రాష్ట్రపతి ప్రణబ్ ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియను బోల్డ్ స్టెప్ అని అభివర్ణించారు. నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రధాని గొప్ప నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని అమిత్ షా అభివర్ణించారు. ఈ నిర్ణయం తీవ్రవాదుల ఆర్ధిక మూలలను పెళ్లగించి వేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

 

Related Stories

Stories by team ys telugu