అందమైన లెగ్గింగ్స్‌ కు కేరాఫ్ లెగ్‌ స్టయిల్.కామ్

అందమైన లెగ్గింగ్స్‌ కు కేరాఫ్ లెగ్‌ స్టయిల్.కామ్

Sunday December 27, 2015,

3 min Read

ఇప్పుడంతా ఆన్‌లైన్ జమానా. ఏదీ కావాలన్నా ఆన్‌ లైన్‌ లోనే కొనుగోలు చేస్తున్నారు. అందుకే స్టార్టప్ కంపెనీలు జోరుమీదున్నాయి. రీటైల్ ఔట్‌ లెట్లు లేకున్నా మిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే దారిలో సంచలనం సృష్టిస్తున్నది లెగ్‌ స్టయిల్ డాట్ కామ్. మహిళల కోసం ప్రత్యేకంగా లెగ్గింగ్స్, లోయర్లను విక్రయిస్తూ సంస్థను ప్రారంభిచింన రెండు నెలల్లోనే లాభాల బాట పట్టింది.

చాలా ఆన్‌ లైన్ పోర్టల్స్ వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను విక్రయిస్తున్నప్పటికీ, ఏ ఒక్కటి కూడా మహిళల కోసం ప్రత్యేకంగా లెగ్గింగ్స్‌/లోయర్లు అమ్మడంలేదు. దీంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు 42 ఏళ్ల అర్చన ఝా. వైఎంసీఏలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన అర్చన బాధ్యత కలిగిన ఓ గృహిణి. ప్రతిరోజు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌ కు పిల్లలను డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం చేస్తుంటారు. అర్చన ఇటీవలే లెగ్‌ స్టయిల్ పేరుతో ఓ ఆన్‌ లైన్ పోర్టల్‌ ను ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన దుస్తులు మాత్రమే ఈ ఈ-పోర్టల్ ద్వారా విక్రయిస్తారు. లెగ్గింగ్స్, డేనిమ్ ప్యాంట్స్, పలాజ్జో ప్యాంట్స్, షార్ట్స్, స్కర్ట్స్, కాప్రీస్ వంటి వాటిని పోర్టల్ ద్వారా మహిళలకు అందిస్తున్నారు.

‘‘నేను మాట్లాడిన ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సాహపరిచారు. ఇలాంటి ఐడియా మిగతా వారికెందుకు రాలేదని మా బ్యాంకర్ అయితే ఆశ్చర్యపడ్డారు. వారి ప్రోత్సాహం నాలో మరింత విశ్వాసాన్ని నింపింది’’ అని అర్చన అన్నారు.

అర్చన ఝా, లెగ్‌స్టయిల్ వ్యవస్థాపకురాలు

అర్చన ఝా, లెగ్‌స్టయిల్ వ్యవస్థాపకురాలు


ఫ్యామిలీ ఫ్యాషన్ గురు..

అర్చన కుటుంబంలో ఆమే ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇంట్లో ఓ ఈవెంట్ సందర్భంగా, తన కుటుంబ సభ్యులకు అర్చన ఫ్యాషన్ సలహాలిచ్చారు. ‘‘ప్రత్యేక సందర్భాల్లో ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలో, మా కుటుంబ సభ్యులకు వివరిస్తుంటాను. శరీరతత్వం, ఎత్తు, కంఫర్ట్ లెవల్స్.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సలహాలిస్తుంటాను. ఎలాంటి డ్రెస్సలు ధరిస్తే, ఆకర్షణీయంగా ఉంటుందో వివరిస్తాను. ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి డ్రెస్సయితే నచ్చుతుంది, ఎలాంటి కలర్ దుస్తులు ధరిస్తే చక్కగా కనిపిస్తారో సలహాలు ఇస్తుంటాను’’ అని అర్చన చెప్పారు. ఫ్యాబ్రిక్స్, కలర్స్, స్టయిల్ అర్చనకు అత్యంత ఇష్టమైన విషయాలుగా మారాయి. దీంతో మార్కెట్లో వస్తున్న ఫ్యాషన్స్, స్టయిల్స్‌, ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుని కుటుంబ సభ్యులకు వివరిస్తుండేవారు. బిజీగా ఉన్న సమయంలో షాపింగ్ మాల్స్‌ కు వెళ్లే సమయం లేకపోవడంతో కొన్నిసార్లు ఆన్‌ లైన్‌లోనే లెగ్గింగ్స్ కొనుగోలు చేసేవారామె. అలాంటి సమయాల్లో లెగ్గింగ్స్‌ మాత్రమే విక్రయించే పోర్టల్స్ లేవని ఆమె గుర్తించారు. ‘‘ఈ రంగంలో అవకాశాలు బాగున్నాయనిపించింది. దీంతో ఈ అంశంపై మరింత కసరత్తు చేశాను. ఈ-కామర్స్ బిజినెస్ గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత బిజినెస్ ఐడియాను వర్కవుట్ చేసేందుకు సంకల్పించాను. మా ఆయన కూడ ఎంతో సహకరించారు. నేను దాచుకున్న డబ్బులకు తోడు పెట్టుబడికి అవసరమైన మరింత డబ్బును మా ఆయనే ఇచ్చారు’’ అని ఆమె వివరించారు.

సంప్రదాయ, సమకాలీన ఆన్‌ లైన్ పోర్టల్‌ ను ప్రారంభించేందుకు అర్చనకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే పట్టింది. ‘‘ముందుగా ఇండియామార్ట్‌ డాట్ కామ్‌ లో రిజిస్టర్ చేసుకున్నాను. ఆ తర్వాత లెగ్గింగ్స్‌ ను సరఫరా చేసేవారితో ఒప్పందం కుదుర్చుకున్నాను. లెగ్గింగ్స్‌ కు సంబంధించిన ఫొటో లను వాట్సప్ ద్వారా పంపాలని కోరాను. అందులో నచ్చిన వాటిని ఆర్డర్ చేశాను. లెగ్గింగ్స్ కొనుగోలు చేసేందుకు గుజరాత్, రాజస్థాన్, లుధియానా మార్కెట్లలలో కూడా పర్యటించాను. ఆ రాష్ట్రాల్లో ఎలాంటి దుస్తులు దొరుకుతున్నాయో పరిశీలించాను. స్థానిక ఉత్పత్తులతోపాటు చైనా, హాంకాంగ్ నుంచి కూడా లెగ్గింగ్స్‌ ను కొనుగోలు చేసి, ఆ మోడల్స్‌ ను పోర్టల్స్‌ లో విక్రయానికి పెట్టాను’’ అని అర్చన వివరించారు.

స్వీట్ మెమొరీస్..

ఉత్పత్తులపై నమ్మకం పెరిగిపోయిన తర్వాత పేమెంట్, డెలివరీ కోసం పేయూ మనీ, షిప్ రాకెట్‌ లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘‘చాలా వరకు మా ఆర్డర్లలో క్యాష్ ఆన్ డెలివరీ ఉండేది. దీంతో సరైన సమయంలో ఉత్పత్తులను డెలివరీ చేయడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు’’ అని అర్చన తెలిపారు. ఆన్‌ లైన్ వ్యాపారం అయితే ప్రారంభించారు కానీ, కస్టమర్లను తన పోర్టల్‌కు మళ్లించేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. ఫేస్‌ బుక్, గూగుల్ వంటి వాటిల్లో యాడ్స్ కోసం చాలా ఖర్చుపెట్టారు. అంతేకాదు చిన్న చిన్న పత్రికల్లో కూడా ప్రకటనలిచ్చారు. ఆన్‌లైన్ పోర్టల్స్‌ లో జోరుమీదున్న అమెజాన్‌ లాంటి సైట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

image


పోర్టల్‌ ను ప్రారంభించి ఎక్కువ కాలం కాకపోయినా, ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి. ‘‘మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తాను కొనుగోలు చేసిన ఓ ప్రాడక్ట్‌ ను తిరిగి ఇచ్చేయాలనుకున్నారు. ఆమెతో నేను మాట్లాడిన తర్వాత మరో రెండు డిజైన్ లెగ్గింగ్స్‌ ను కొనుగోలు చేశారు. కానీ ఆమెకు నచ్చని లెగ్గింగ్‌ ను మాత్రం తిరిగి ఇచ్చేశారు’’ అని తన అనుభవాలను ఆమె వివరించారు.

మంచి వ్యాపారవేత్త..

అర్చనకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే ప్రమోషనల్, మార్కెటింగ్‌ ఆపరేషన్స్ కోసం ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్‌ ను నియమిచుంకున్నారు. ‘‘ఫ్యాషన్లు, అవసరాల గురించి తెలుసుకునేందుకు ఎప్పుడు అవకాశం చిక్కినా, మహిళలు, విద్యార్థినులతో మాట్లాడుతుంటాను. యంగ్ గర్ల్స్ ఎక్కువగా కొత్త తరహా లెగ్గింగ్స్, షార్ట్స్ గురించి మాట్లాడుతుంటే, మహిళలు మాత్రం పలాజో ప్యాంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయాల్లో మా బ్రాండ్స్ గురించి వివరించేందుకు, అమ్మకాలు పెంచేందుకు ఈ అవకాశాలను వినియోగించుకుంటాను’’ అని చెప్పారు. సమయం చిక్కితే విక్రయాలను పెంచేందుకు ఎలాంటి ప్రాడక్ట్స్ పెట్టాలి, ఆన్‌ లైన్ స్టోర్‌ ను ఎలా విస్తరించాలన్న అంశంపైనే ఆమె ఆలోచిస్తుంటారు. వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలోనే విజయాన్ని రుచి చూసిన అర్చన, భవిష్యత్ కార్యాచరణపై మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. రానున్న రోజుల్లో యాక్సెసరీస్, షూస్‌ కూడా పోర్టల్‌ లో పొందుపర్చాలనుకుంటున్నారు. అలాగే రీటైల్ ఔట్‌ లెట్ పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. మొత్తమ్మీద తన లెగ్‌ స్టయిల్‌ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే ఆమె ధ్యేయం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం..