10 క్లాస్ కుర్రాడు కంపెనీ ఫౌండ‌ర్ అయ్యాడు! గూగుల్ చేత శ‌భాష్ అనిపించుకున్నాడు!

10 క్లాస్ కుర్రాడు కంపెనీ ఫౌండ‌ర్ అయ్యాడు! గూగుల్ చేత శ‌భాష్ అనిపించుకున్నాడు!

Saturday January 23, 2016,

4 min Read

అత‌నికి నిండా 18ఏళ్లు కూడా లేవు. కానీ.. ఆలోచ‌న‌లు మాత్రం అత్యున్న‌తంగా ఉంటాయి. ఆలోచ‌న‌ల్లో, ఆత్మ‌విశ్వాసంలో.. అనుకున్న ప‌ని చేసి చూపించాల‌నే తప‌న‌లో అత‌ను చాలా పెద్ద‌వాడు. స్కూలు అయిపోగానే ఇంటికెళ్లి హోంవ‌ర్క్‌చేసి ఆడుకుని ప‌డుకోవ‌డం కాదు.. ఆ మ‌ధ్య‌లో గ్యాప్‌ను కూడా ఎలా వినియోగించుకోవాలో ఆ పిల్లాడికి బాగా తెలుసు. అందుకే.. స్కూలింగ్ కూడా పూర్తి కాకుండానే ఓ కంపెనీకి ఫౌండ‌ర్ అయ్యాడు. త‌న ఆలోచ‌న‌ల్ని ఒక అద్భుత‌మైన యాప్ రూపంలో తీసుకువ‌చ్చి అంద‌రిచేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

పిల్ల‌లు స్కూలుకెళ్లారు. ఇంటికి వ‌చ్చే టైమ్ అవుతోంది. బ‌స్ ఎక్కారో లేదో.. ఎక్క‌డిదాకా వ‌చ్చారో..స్కూల్‌బ‌స్‌లో వెళ్లే ప్ర‌తీ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ఉండే ఆలోచ‌నే ఇది! ఇంటి నుంచి వెళ్లిన పిల్ల‌లు క్షేమంగా తిరిగివ‌చ్చేదాకా భ‌యం. 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న అర్జున్‌కుమార్ పేరెంట్స్‌ది కూడా ఇదే ప‌రిస్థితి. ఒక‌సారి భారీ వ‌ర్షం ప‌డ‌టంతో ఇంటికి లేట్‌గా వెళ్లాల్సి వ‌చ్చింది. తాను ఎక్క‌డున్నానో తెలియ‌జేసే మార్గం లేక‌పోయింది. ఎలా? ఏం చేయాలి? ఈ స‌మ‌స్య‌కు టెక్నాల‌జీతో ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. లొకేట్రా యాప్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు.

image



ఏంటీ లొకేట్రా? ఎలా ప‌నిచేస్తుంది?

మూడు ర‌కాల యాప్‌ల‌తో స్కూల్ బ‌స్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట‌మ్‌ను మేనేజ్ చేసే వ్య‌వ‌స్థ లొకేట్రా. త‌ల్లిదండ్రుల‌కు, స్కూల్ యాజ‌మాన్యానికి, బ‌స్ అటెండెంట్ల‌కు.. ఇలా ముగ్గురికీ మూడు ర‌కాల యాప్‌లు ఉంటాయి. వేర్వేరు డాష్‌బోర్డ్‌లు ఉంటాయి. బ‌స్ ఎక్కేట‌ప్పుడు, దిగే ముందు.. విద్యార్ధులు త‌మ ఐడీ కార్డుల‌ను బ‌స్ అటెండెంట్ స్మార్ట్‌ఫోన్ ద‌గ్గ‌ర స్వైప్ చేయాలి. వెంట‌నే ఆ స‌మాచారం పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు, స్కూలు యాజ‌మాన్యానికి వెళ్లిపోతుంది. బ‌స్ ఎక్కిన ద‌గ్గ‌ర్నుంచి క్ష‌ణ‌క్ష‌ణం ఎక్క‌డున్నార‌నే స‌మాచారం పేరెంట్స్ రియ‌ల్‌టైమ్‌లో తెలుసుకోవ‌చ్చు. బ‌స్‌లు షెడ్యూల్ చేయ‌డం, రీ షెడ్యూల్ చేయ‌డంలాంటివి త‌మ యాప్ ద్వారానే యాజ‌మాన్యం చేసుకుని.. ఆ వివ‌రాల‌ను పేరెంట్స్‌కు చేర‌వేయ‌చ్చు. ఒక‌వేళ బ‌స్ ఆల‌స్య‌మైనా.. ఆ వివ‌రాలూ అంద‌రికీ అందుతాయి. ప్రస్తుతం ఉన్న మాన్యువ‌ల్ అటెండెన్స్ ప‌ద్ధ‌తిని త‌మ యాప్‌తో రీప్లేస్ చేయ‌డంతో పాటు.. అన‌వ‌స‌ర‌మైన భారాన్ని త‌గ్గించాల‌న్న‌దే లొకేట్రా ల‌క్ష్య‌మంటారు అర్జున్‌.

లొకేట్రాలోని మ‌రిన్ని ఫీచ‌ర్స్‌..

  1. మ్యాప్‌లో బ‌స్‌ని చూడ‌టం ద్వారా త‌ల్లిదండ్రులు పిక‌ప్‌, డ్రాప్ ప్లాన్ చేసుకోవ‌డం సులువు అవుతుంది.
  2. బ‌స్ ఎక్కిన‌పుడు, దిగిన‌పుడు ఆటోమేటిక్ అల‌ర్ట్స్‌ ఉంటాయి.
  3. ప్ర‌స్తుతం ఉన్న లొకేష‌న్ నుంచి ఎంత‌సేప‌టికి బ‌స్ ఇంటికి వ‌స్తుందో కూడా లెక్క‌వేసి చూపిస్తుంది.

అయితే, ఈ యాప్ వాడాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్‌ఫోన్ వినియోగించ‌ని.. ఒక‌వేళ ఉన్నా ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేని తల్లిదండ్రుల‌కు కూడా స‌మాచారం వెళ్లే విధంగా దీన్ని ప్లాన్ చేశారు. బ‌స్ అటెండెంట్‌కు మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా అన్ని వివ‌రాలు ఎస్ ఎం ఎస్ వెళ్లే విధంగా యాప్‌ను రూపొందించారు.

image


ఎలా మొద‌లైంది.?

చెన్న‌య్‌లోని సూరాపేట వెల‌మ్మ‌ల్ విద్యాశ్ర‌మ్ స్కూల్‌లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న అర్జున్‌.. లొకేట్రా లాజిక్స్‌కు ఫౌండ‌ర్ ప్రెసిడెంట్‌. మొద‌టినుంచి టెక్నాల‌జీపై ఆస‌క్తి క‌లిగిన అర్జున్.. అన్నీ గ‌మ‌నించేవాడు. త‌న తండ్రి స్మార్ట్‌ఫోన్ కొన్న త‌ర్వాత దానిపై స్ట‌డీ చేశాడు. మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ.. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన యాప్ డెవ‌ల‌ప‌ర్ టూల్‌ని వినియోగించి యాప్స్ త‌యారుచేయ‌డం మొద‌లుపెట్టాడు. 8వ త‌ర‌గ‌తిలో ఉన్నప్పుడే "ఈజ‌డ్- స్కూల్‌బ‌స్ లొకేట‌ర్‌", మ‌హిళ‌లు, పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు "ఐ-సేఫ్‌గార్డ్" అనే యాప్‌లు చేసి అంద‌రి ప్ర‌సంశ‌లు అందుకున్నాడు.

2014లో "కంప్యూట‌ర్ టెక్నాల‌జీలో అసాధార‌ణ‌మైన విజ‌యాలు" సాధించినందుకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చే అవార్డును తీసుకున్నాడు అర్జున్‌. సీఎస్ఐ చెన్న‌య్‌, IEEE కంప్యూట‌ర్ సొసైటీ మ‌ద్రాస్‌, IEEE ప్రొఫెష‌న‌ల్ క‌మ్యూనికేష‌న్ సొసైటీ మ‌ద్రాస్‌వాళ్ల స‌త్కారాలు పొందాడు. "ఈజ‌డ్‌- స్కూల్ బ‌స్ లొకేట‌ర్‌"కు వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్‌తో,, దాని సెకండ్ వెర్ష‌న్‌.. "లొకేట్రా"ను త‌యారుచేశాడు. ఈ యాప్‌కు అత్యుత్త‌మ డిజైన్‌గా "మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ" అవార్డుతో పాటు.. "గూగుల్ ఇండియా కోడ్ టు లెర్న్ కాంటెస్ట్ 2015" అవార్డు ద‌క్కింది.

ప్ర‌స్తుతం ఈ స్టార్ట‌ప్‌ను అర్జున్ ఒక్క‌డే చూసుకుంటున్నాడు. మార్కెటింగ్‌, సేల్స్‌, మిగ‌తా అంశాల్లో త‌ల్లిదండ్రులు స‌హాయ‌ప‌డుతుంటే.. టెక్నాల‌జీ ప‌రంగా తాను వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ యాప్‌కు స‌బ్‌స్ర్కిప్ష‌న్ ప‌ద్ధ‌తిలో ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పాటు చెన్న‌య్‌లోని కొన్ని స్కూల్స్‌లో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రిలీజ్ చేశారు. స్కూల్స్ అడిగిన ప‌ద్ధ‌తిలో క‌స్ట‌మైజ్డ్ అప్లికేష‌న్‌ను డెవ‌ల‌ప్‌చేసి.. బ్రాండింగ్‌తో విడుద‌ల‌చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా చెన్న‌య్‌ని వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేసిన స‌మ‌యంలో "iVolunteer for Chennai" అనే యాప్‌ను కూడా అర్జున్ త‌యారుచేశాడు. వ్య‌క్తిగ‌తంగా స‌హాయం చేస్తున్న‌వాళ్లు ఏజ‌న్సీలతో కాంటాక్ట్‌లో ఉండటానికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. కొంత‌మంది కార్పొరేట్స్‌కి కూడా అర్జున్ యాప్స్ త‌యారుచేశాడు.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు

"చ‌దువుకుంటూ లొకేట్రాకు ప‌నిచేయడం అనుకున్నంత ఈజీ కాదు. కానీ.. ప్ర‌స్తుతానికి టైమ్‌ను జాగ్ర‌త్త‌గా మేనేజ్ చేసుకుంటున్నాను. కాలేజీలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌ద‌వ‌డంతో పాటు ఏదైనా ఐఐటీ, ఎంఐటీలోకి వెళ్లాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాను" అంటాడు అర్జున్‌

ప్ర‌స్తుతం అర్జున్ చ‌దువుతున్న స్కూల్‌లోనూ ఈ యాప్‌ను టెస్ట్ చేస్తున్నారు.మెల్ల‌గా ఇండియాలోని మిగ‌తా ప‌ట్ట‌ణాల్లోకి విస్తరించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌పై మాట్లాడుతూ అర్జున్ తండ్రి ఇలా అన్నారు..

దీన్ని భారీ స్థాయిలో ఎలా అమ‌లుచేయాల‌నేదానిపై ప్ర‌భుత్వ ఏజెన్సీల‌తో మాట్లాడుతున్నాం

సెక్టార్ ఓవ‌ర్‌వ్యూ!

మార్కెట్స్ అండ్ మార్కెట్స్ రిపోర్ట్ ప్ర‌కారం.. 2015లో.. 830కోట్ల అమెరిన్ డాల‌ర్లు ఉన్న ప్ర‌పంచ ర‌వాణా వ్య‌వ‌స్థ మార్కెట్‌.. 2020 నాటికి 2235 కోట్ల అమెరిక‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంది. టెక్నాల‌జీని విరివిగా వినియోగిస్తూ ఉత్త‌ర అమెరికా అన్నిదేశాల‌కంటే ముందు ఉంది. రాబోయే కాలంలో ఆసియా ప‌సిఫిక్ దేశాల్లో ఇది మ‌రింత పెరుగుతుంద‌ని ఆశిస్తున్నారు.

యువ‌ర్‌స్టోరీ విశ్లేష‌ణ‌

స్కూల్ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంలో "లొకేట్రా" ఒక వినూత్న‌మైన ఆలోచ‌న‌. ఒక 10వ తర‌గ‌తి విద్యార్ధి ఈ స్ధాయిలో ఆలోచించ‌డంతో పాటు దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డం అభినంద‌నీయం. అయితే, స్కూల్స్ మేనేజ్‌మెంట్స్‌ని ఈ యాప్ వినియోగానికి క‌న్విన్స్ చేయ‌డం.. నిండా డ‌బ్బులున్న కార్పొరేట్ వ్య‌వ‌స్ధ‌ల‌ను క‌న్విన్స్ చేయ‌గ‌లిగినంత ఈజీ కాదు. ఈ నేప‌ధ్యంలో లొకేట్రా మ‌రిన్ని ఫీచ‌ర్స్‌తో ఎలా ఎలా మార్కెట్‌లోకి వ‌స్తుంద‌నే దానిపైనే కంపెనీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డిఉంటుంది.