టెక్నాలజీని ప్రాంతీయ భాషల్లోకి తెస్తేనే భవిష్యత్తు !

టెక్నాలజీని ప్రాంతీయ భాషల్లోకి తెస్తేనే భవిష్యత్తు !

Saturday October 31, 2015,

3 min Read

భారత్‌లో వంద కోట్ల మంది యూజర్లను దృష్టిలో ఉంచుకుని మీరు ఏదైనా ఓ పెద్ద ప్రాజెక్ట్ కలగంటున్నారా.. ? అయితే దాన్ని ఇంగ్లిష్‌లో నిర్మించాలని అనుకుంటున్నారా ? ఇక దాని గురించి మరిచిపోవచ్చు... అంటూ టెక్ స్పార్క్స్ కార్యక్రమానికి హాజరైన ఎంతో మంది ఔత్సాహికుల ఆశలపై నీళ్లు జల్లారు అస్పద సంస్థ పోర్ట్‌ఫోలియో వైస్ ప్రెసిడెంట్ సాహిల్ కినీ. 

అంతే కాదు ఆయన చెప్పిన లెక్కలు చూస్తే.. ఎవరికైనా మతిపోతుంది. ఇంత మార్కెట్‌ను మనం వదిలేసుకుంటున్నామా.. ? అని అనిపించకమానదు.

image


ఈ లెక్కలు చూడండి

ప్రస్తుతం భారత దేశంలో 10 నుంచి 12 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లు ఉంటారని ఓ అంచనా. మన దేశ జనాభాతో పోలిస్తే.. ఈ సంఖ్య చాలా చిన్నది. సుమారు 10 శాతం ఉండొచ్చు అంతే. సాహిల్ లెక్కల ప్రకారం వెళ్తే.. ఇంగ్లిష్ సరిగ్గాచదివే వాళ్ల సంఖ్య 6-8 కోట్లు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో జనాలు 780 భాషలు మాట్లాడుతున్నారు. వీటిల్లో 86 రకాల లిపి ఉంది. (Source - పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా) వీటిల్లో 29 భాషలను 10 లక్షల మంది వరకూ మాట్లాడతారు. 22 భాషలను అధికార భాషలుగా ప్రభుత్వం గుర్తించింది.

వివిధ భారతీయ భాషలను సులువుగా మాట్లాడగల సాహిల్ చెప్పేదేంటంటే.. బిలియన్ యూజర్లకు మనం చేరాలంటే.. మాతృ భాషలో కంప్యూటింగ్ ఆవశ్యకత ఎంతైనా ఉంది.

''ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినట్టే మనమూ మన భాషలను అధోగతి పట్టిస్తున్నాం''

ఒకప్పుడు 'కుక్కలు, భారతీయులు.. ఇక్కడ నిషిద్ధం' అంటూ కలొనియల్ పోకడ ఉండేది. ఇంగ్లిష్ మాట్లాడలేని 50 కోట్ల మందిని ఇప్పుడు మనం కూడా దూరం చేసుకుంటున్నాం. వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. వాస్తవ పరిస్థితి ఏంటంటే.. ఇంగ్లిష్ రానివాళ్లందరినీ మనం అడ్డుకుంటున్నాం.

ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్ కంటెంట్‌లో 56 శాతం మాత్రమే ఇంగ్లిష్‌లో ఉంటోంది. మరి ఎందుకు డెవలపర్స్ ఆ దిశగా ఆలోచించడం లేదో అర్థం కావడం లేదనేది సాహిల్ ప్రశ్న.

డెవలపర్స్ సాదాసీదాగా కాకుండా అత్యంత కఠినమైన సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని సాహిల్ సూచిస్తారు. అయితే స్థానిక భాషలంటే కేవలం అనువాదాలు మాత్రమే కాదనేది ఆయన వివరణ. నూతనత్వం, వైవిధ్యం, సరళీకరణ అన్నీ కలిస్తేనే ప్రయోజనం అని సూచిస్తారు. అందుకే రెవరీ సంస్థ ప్రత్యేకంగా నిలుస్తోంది.(రెవెరీ అనేది టెక్30 అలుమ్నీ సంస్థ, అస్పదా పోర్ట్‌ఫోలియోలోని ఓ సంస్థ కూడా). ఇప్పుడు రెవెరీ బోర్డులో సాహిల్ కూడా ఈ మధ్యే చేరారు.

స్థానిక భాషల్లో యూజర్లకు నాణ్యమైన అనుభూతి కలిగించాలంటే.. ఫాంట్స్, ఫాంట్ రెండరింగ్, ట్రాన్స్‌లిటరేటివ్ ఇన్‌పుట్, డొమైన్ సంబంధ అనువాదం.. ఇలా అన్నింటినీ తెలివిగా కలగలపాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనం.
image


స్థానిక భాషల్లో కంప్యూటింగ్ చేరకపోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆకట్టుకోలేని అక్షరాల కూర్పు (ఫాంట్స్) పదాల క్రమం (స్పెలింగ్), వ్యాకరణ పరిశీలన (గ్రామర్ చెక్), మాట్లాడగానే వచ్చే టెక్స్ (స్పీచ్ టు టెక్స్ట్) వంటివి ప్రధాన సమస్యలు. వీటితో పాటు ఇంకా చాలానే ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో మనం ప్రాంతీయ భాష మాట్లాడుతున్నా సరే.. ఆంగ్లపదాలు దొర్లుతున్నాయి. భాషలు కలిసిపోతున్నాయి. 'సెర్చ్ అల్గారిథమ్స్' ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేలా మనం టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. హిందీలోని ఓ పదాన్ని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం. 'ప్లే' అనే పదాన్ని చూద్దాం. ఆటలు ఆడడం, మ్యూజిక్ ప్లే చేయడం, డ్రామా.. ఇలా ఈ మూడింటికీ ప్లే అనే పదం ఇంగ్లిష్‌లో సరిపోతుంది. కానీ హిందీలో ఖేల్, బజావో, నాటక్ అని చెబితేనే అర్థమవుతుంది, అర్థవంతంగా ఉంటుంది. ఇంత వైరుధ్యం ఉన్న ఈ భాషను మిషన్లు ట్రాన్స్‌లిటరేషన్ చేసి.. సరైన అర్థాన్ని ఇవ్వగలవా ?

image


భారతీయ భాషలవైపు మనమంతా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. త్వరలో మన దేశంలో రాబోయే అతిపెద్ద 'వేవ్' ఇదే అంటూ ముగించారు సాహిల్.

సాహిల్ చెప్పిన మాటలు, విశ్లేషణలు,లెక్కలు నిజంగా మనందరినీ ఎంతో ఆలోచింపజేశాయి. స్థానిక భాషలు మాట్లాడుతున్న 50 కోట్ల మందిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఆంట్రప్రెన్యూర్స్ ఎంతో పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నట్టే. అయితే ఇది అంత సులువైన విషయం కాకపోయినా.. ప్రయత్నించడం, కొత్తగా ఆలోచించడంలోనే ఉంది మన ప్రత్యేకత. ఏమంటారు.. ?