పెట్టుబడులతో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ఫ్రెష్ మెనూ

పెట్టుబడులతో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ఫ్రెష్ మెనూ

Sunday January 10, 2016,

2 min Read

కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని, అది ఆ ఏడాదంతా గుర్తుండిపోవాలని అనుకుంటారు. బెంగళూరుకు చెందిన ఫ్రెష్ మెనూ విషయంలో అదే జరిగింది. న్యూ రౌండ్ ఫండింగ్ కింద జోడియస్ క్యాపిటల్ నుంచి రూ.110 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. ప్రస్తుత ఇన్వెస్టర్ లైట్ స్పీడ్ వెంచర్స్ తో కలిసి పెట్టుబడులు పెట్టింది జోడియస్ క్యాపిటల్. ఈసారి సమీకరించిన నిధులను టీమ్ బిల్డింగ్, అభివృద్ధి, బ్రాండ్ ను పటిష్టపరిచేందుకు ఉపయోగిస్తామంటున్నారు ఫ్రెష్ మెనూ ఫౌండర్ రష్మీ దాగా.

image


"మేం మా మెనూలో కొత్త ఫుడ్ ఐటెమ్స్ ను, వంటకాలను చేర్చబోతున్నాం. టెక్నాలజీని అందిపుచ్చుకోబోతున్నాం. కొత్త యాప్ ను రూపొందిస్తాం. వెబ్ సైట్ కు మెరుగులు దిద్దుతాం. ప్రస్తుతం మాకు బెంగళూరులో 17 కిచెన్ లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబైపై దృష్టిపెట్టనున్నాం" - రష్మీ.

కొత్తకొత్తగా...

2015లో ప్రారంభమైన ఫ్రెష్ మెనూ హబ్ అండ్ స్పోక్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ను ఫాలో అవుతోంది. ప్రతీ ఏరియాలో సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఉన్నాయి. గతేడాది జనవరి నుంచి నెలనెలా కొత్తగా కిచెన్లు ప్రారంభిస్తూ వస్తోందీ స్టార్టప్. ప్రతీ నెలా 30 నుంచి 40 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది. అయితే 2015 చివర్లో ఈ స్పేస్ లో వృద్ది రేటు తగ్గుముఖం పడుతోందన్న ఊహాగానాలు వస్తున్న సమయంలో ఫ్రెష్ మెనూకు వచ్చిన పెట్టుబడులు చూస్తే ఈ సంవత్సరం ఫుడ్ టెక్ స్టార్టప్స్ కు మంచి రోజులున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఫ్రెష్ మెనూతో పాటు మరో రెండు ఫుడ్ టెక్ కంపెనీలకు ఈ సంవత్సరం డీల్స్ కుదరడం విశేషం. WIMWI ఓ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. బీ9 బెవరేజెస్ కు ఆరు మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండ్స్ సీక్వోయా క్యాపిటల్ నుంచి వచ్చాయి.

ఒడిదుడుకుల ప్రయాణం

గతేడాది ఫుడ్ టెక్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులను గమనిస్తే ఏప్రిల్ లో 74 మిలియన్ డాలర్ల విలువైన ఏడు డీల్స్ కుదిరాయి. ఆగస్టు 2015లో ఐదు డీల్స్ లో 19 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్ లో రెండు డీల్స్ కు పడిపోయాయి. ఏడాది మొదట్నుంచీ చివరి వరకు డీల్స్ తగ్గుతూ వచ్చాయి. 2015 చివర్లో డాజో, స్పూన్ జాయ్ లు ఆపరేషన్స్ నిలిపేశాయి. దీనికి తోడు ఇలాంటి సంస్థల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నారన్న వార్తలు మరింత ఆందోళనపర్చాయి. దీంతో ఫుడ్ టెక్ కంపెనీల భవితవ్యంపై సందేహాలొచ్చాయి.

"వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించనంత వరకు వాళ్లు మీ ఉత్పత్తులు కొనరు. మీ సర్వీసులు వినియోగించుకోరు. బిజినెస్ మోడల్ సరైనది అయితే పెట్టుబడులు వాటంతట అవే వస్తుంటాయి. 2016లో పెట్టుబడులు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనా వేయడం సరికాదు" -నార్వెస్ట్ వెంచర్ పార్ట్ నర్స్ ప్రిన్సిపాల్ సుమర్ జునేజా.