రూరల్ ఐటీ పాలసీ రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం  

0

ఐటీ రంగం కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు తెలంగాణ సర్కారు రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీని రూపొందించింది. డాటా ప్రాసెసింగ్, డాటా ఎంట్రీ, డాటా మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్ వంటివి రూరల్ టెక్నాలజీ సెంటర్ల (ఆర్టీసీ) లక్ష్యంగా నిర్దేశించింది. కస్టమర్ సర్వీస్, వివరాల సేకరణ, టెక్నికల్ సపోర్ట్ వంటి శబ్ద ఆధారిత సేవలు కూడా ఈ కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

తెలంగాణ ఐటీ రంగానికి మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన రాష్ట్ర ఐటీ పాలసీని- గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లే విధంగా రూరల్ టెక్నాలజీ పాలసీ గైడ్ లైన్స్ రూపొందించింది. గత ఏడాది ఏప్రిల్ 5న హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో నూతన ఐటీ విధాన ప్రకటనతోపాటు దానికి అనుబంధంగా మరో నాలుగు పాలసీలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్‌ లకు చేయూతనిచ్చే ఇన్నోవేషన్ పాలసీ, ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించే రూరల్ టెక్నాలజీ పాలసీ, హార్డ్‌ వేర్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీలను ఆరోజు ప్రకటించారు.

ఐటీ రంగం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినప్పుడే సమీకృత అభివృద్ధి సాధ్యపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. టాస్క్ సమన్వయంతో రూరల్ టెక్నాలజీ సెంటర్లలో 10వేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. రాబోయే మూడేళ్లలో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గ్రామాల్లో ఎవరైతే ఐటీ కంపెనీలను ప్రారంభిస్తారో వారికి మొదటి మూడేండ్లలోపు పంచాయతీ పన్నుల మినహాయింపు ఉంటుంది. ఐటీ కంపెనీల స్థాయిని బట్టి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. కనీస ధర, అభివృద్ధి చార్జీలు తీసుకొని ఆ భూములను అప్పగిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్ లో పేర్కొన్నట్లుగా విద్యుత్ చార్జీల్లోనూ రాయితీ ఇవ్వనుంది. 40 లక్షల లోపు పెట్టుబడితో పెట్టే సంస్థలకు యాభైశాతం రాయితీని అందిస్తారు. అంతకుమించిన వాటికి పదిశాతం సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం.

Related Stories

Stories by team ys telugu