స్మార్ట్ గా ప్యాక్ అండ్ మూవ్.. ‘రీలొకేట్ ఎక్స్ పీ’రియన్స్

- ఈజీగా ఇల్లు, ఆఫీస్ ఛేంజ్ చేసే మార్గం- ఆన్ లైన్ లో బుక్ చెయ్.. సాఫీగా మూవ్ చెయ్..- ప్యాకింగ్ అండ్ మూవింగ్ రంగంలో రాణిస్తున్న బ్రదర్స్- రీలొకేట్ ఎక్స్ పీ (Relocate XP) ద్వారా ఆన్ లైన్ లోనే సేవలు

స్మార్ట్ గా  ప్యాక్ అండ్ మూవ్.. ‘రీలొకేట్ ఎక్స్ పీ’రియన్స్

Wednesday June 17, 2015,

3 min Read

ఇళ్లు మారడమన్నా, ఆఫీసును మార్చడమైనా ... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడమంటే ఎంతో విసుగుపుట్టించే ప్రహసనం. పైగా భారమైన పని కూడా. వున్న చోటు నుంచి వేరే చోటుకు మారడమంటే చాలా వస్తువుల్ని తీసుకెళ్లాల్సుంటుంది. వాటి అవసరాన్ని బట్టి మళ్లీ కొత్త చోట స్థానాన్ని నిర్దేశించాల్సుంటుంది. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా యజమానుల దగ్గర్నుంచి మాటొచ్చేస్తుంది. ఇది చాలా సవాళ్లతో కూడుకున్న పనే. కానీ ఈ కష్టమైన పనినే ఎంతో ఇష్టంగా ఆదాయం వచ్చేలా చేయడం మొదలు పెట్టారు సందీప్ ప్రకాశ్, సౌరభ్ ఆనంద్ అనే ఇద్దరు అన్నదమ్ములు. అదే రీ-లొకేట్ ఎక్స్ పీ (RELOCATE XP) కంపెనీ.

రీలొకేట్ యాడ్

రీలొకేట్ యాడ్


సందీప్ ప్రకాశ్, సౌరభ్ ఆనంద్ అన్నదమ్ములిద్దరూ కాలేజీ చదువుల్ని పూర్తి చేసి ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచేయడం మొదలు పెట్టారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో వీరి దృష్టి ప్యాకర్స్ అండ్ మూవర్స్ రంగంపై పడింది. 

‘‘రీలొకేషన్ మార్కెట్ స్థితిగతులు, ప్రమాణాలపై చాలా లోతుగా పరిశీలించి ఆలోచించేవాళ్లం. 2011 తర్వాత ఇక వెనకడుగు వేయకుండా ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేసి రీలొకేషన్ రంగంలోకి దూకేశామిద్దరం’’ అంటూ తమ వ్యాపార ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు రీలొకేట్ ఎక్స్ పీ వ్యవస్థాపకుల్లో ఒకరు సౌరభ్.

రీలొకేట్ ఎక్స్ పీ (RelocateXP) అనేది ఆన్ లైన్ పోర్టల్. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎవరైనా సరే... ఇందులో వారికి కావాల్సిన విధంగా రీలొకేషన్ కోసం ఆర్డర్లను బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు కూడా రెండు ముక్కల్లో తమ ఇంటి సామాగ్రికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. అంతే... ప్యాకర్స్ అండ్ మూవర్స్ తో బేరసారాలాడి వస్తువుల్ని వున్న చోటు నుంచి కావాల్సిన ప్రాంతానికి భద్రంగా తరలించే బాధ్యత రీలొకేట్ ఎక్స్ పీ(RelocateXP) నే తీసుకుంటుంది. వినియోగదారులు తమ వస్తువులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా వెళ్తున్నాయనేది కూడా ఆన్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల్లో ఎలాగైతే ఉద్యోగులు, హెచ్ఆర్ లేక అడ్మినిస్ట్రేషన్ మధ్య సింగిల్ విండో పద్ధతి వుంటుందో... ఇందులో కూడా అలాంటి సౌకర్యమే వుందంటున్నారు కంపెనీ నిర్వాహకులు.

‘‘ఇప్పటివరకు వెయ్యికి పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. కస్టమర్లు కూడా రీ లొకేట్ ఎక్స్ పీ సేవలపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీ లొకేట్ ఎక్స్ పీ ద్వారా తమ వస్తువులు చాలా భద్రంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించగలిగామని వినియోగదారులు అనుభవపూర్వంగా చెబుతున్నారు’’ అంటూ సంస్థ సాధించిన విజయాలను తెలిపారు సౌరభ్. ప్యాకేజింగ్ అండ్ మూవింగ్ రంగంలో సాధకబాధకాలను గుర్తించగలగాలి. టెక్నాలజీని వినియోగించడం, రీ ఇంజినీరింగ్ ప్రాసెస్ ద్వారా కస్టమర్లతో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. పారదర్శకతను పెంచుకోవడం, నాణ్యమైన సేవల్ని కస్టమర్లకు సంతృప్తికరంగా అందించడమనేది ఈ రంగంలో ప్రధానమైన అంశం.

ప్యాకింగ్ అండ్ మూవింగ్ రంగంపై మరిన్ని అనుభవాలను చెప్పుకొచ్చారు ఇద్దరు సోదరులు సందీప్ ప్రకాశ్, సౌరభ్ ఆనంద్. ఇందులో సవాళ్లతో కూడిన వ్యవహారమే ఎక్కువగా వుటుందంటున్నారు.

  • ఆన్ లైన్ ద్వారా ప్రైస్ కొటేషన్ ను నిర్ణయించడమనేది నిర్వహకులకు సవాల్ లాంటిది. ఎందుకంటే రీలొకేషన్ రంగంలో ఇది ప్రధానమైన విషయం కూడా. ప్రస్తుతమున్న ప్రదేశం, గమ్యస్థానాల మధ్య వుండే దూరం, వస్తువుల పరిమాణం, సంఖ్య, ట్రాన్స్ పోర్టేషన్, పార్కింగ్ నిబంధనలు, సేవల్లో నాణ్యత ఇలా ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా అవగాహన వుండి తీరాలి. రోజురోజుకీ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కస్టమర్లకు ఇచ్చే ప్రైస్ కొటేషన్ పై ప్రభావం చూపుతాయి. దాన్నిబట్టే ఆన్ లైన్ లో ఎంత మొత్తం చెల్లించాలనేది వినియోగదారుడికి స్పష్టంగా చెప్పాల్సుంటుంది.
  • ఓసారి వినియోగదారుడి నుంచి ప్యాకింగ్ అండ్ మూవింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత .. వారి అవసరాలకు తగిన నాణ్యమైన సేవల్ని అందించే ప్యాకర్స్ అండ్ మూవర్స్ ను ఎంచుకోవడం పెద్ద సమస్య. రీలొకేట్ ఎక్స్ పీ (Relocate XP) 25 కఠినమైన నియమనిబంధనలు, ప్రమాణాలను అనుసరించి ప్యాకింగ్ అండ్ మూవింగ్ కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. అంతే కాకుండా ఆయా కంపెనీల గత చరిత్రను , ట్రాక్ రికార్డ్ ను పరిగణనలోకి తీసుకుని ఆర్డర్లను ఇస్తుంది.
  • చాలామంది జనం ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లోనే ఇల్లు, ఆఫీసుల్ని మార్చేస్తుంటారు. దీని ద్వారా సమయం, డబ్బు, వస్తు నష్టం కూడా కలగొచ్చు. అదే ఆన్ లైన్ ద్వారా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ను ఎన్నుకోవడమనేది సమయం, డబ్బు రెండూ కలిసొచ్చే అంశం. వినూత్న రీతిలో, వస్తువులను సురక్షితంగా అనుకున్న ప్రాంతానికి తరలించేందుకు ఇదే మంచి మార్గం. ఈ విషయంపై ఇప్పటికే చాలా మందిలో అవగాహన కలిగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటోంది రీలొకేట్ ఎక్స్ పీ సంస్థ.

రీలొకేట్ ఎక్స్ పీ (RelocateXP) నొయిడా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోంది. ముంబై, బెంగళూర్, పూణె, హైదరాబాద్ , అహ్మదాబాద్ లలో 25 మంది సిబ్బందితో సేవలను విస్తరించింది. వచ్చే ప్రతి రీలొకేషన్ ఆర్డర్ పై స్థిరమైన కమీషన్ పద్ధతి ద్వారా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కు ఆదాయాన్ని సమకూర్చుతోంది. ప్రస్తుతం రీలొకేట్ ఎక్స్ పీ (RelocateXP) బలమైన పునాదులతో స్థాపించబడి చాలా వేగంగా తన సర్వీసులను అందిస్తోంది. ‘‘ దేశంలో ఎక్కడి నుంచైనా కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ లేదా.. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా అత్యవసరమైన రీలొకేషన్ సేవలను అందించే ఏకైక సంస్థగా రీలొకేట్ ఎక్స్ పీ ఎదగాలి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనగానే మా కంపెనీ పేరే ముందు గుర్తుకు రావాలి. ఇదే మా అభిలాష ’’ అంటూ తమ భవిష్యత్ ప్రణాళికల్ని వివరించారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు సౌరభ్.