నిర్భాగ్యులు తొడుక్కోడానికి బట్టలు ప్రసాదించే దయగల గోడలు  

1

అన్ని గోడలు దృశ్యాన్ని కనిపించకుండా చేస్తాయ్..!

కాదు ఆ గోడలు దృశ్యాన్ని కళ్లకు కడతాయ్..!!

అన్ని గోడలు మనుషుల్ని నిర్దయగా అడ్డుకుంటాయ్..!

కాదు ఆ గోడలు గుండె లోలోతుల్ని తడుముతాయ్..!!

అన్ని గోడలు మనుషుల మధ్య మాటల్ని వినించకుండా చేస్తాయి!

కాదు ఆ గోడలు మనుషుల మధ్య మానవత్వాన్ని తట్టిలేపుతాయ్..!!

వాల్ ఆఫ్ కైండ్‌ నెస్! దయగల గోడలు! బట్టలు ప్రసాందించే మానవత్వపు గోడలు. పేదవాళ్లకోసం, ఒంటినిండా కప్పుకోను బట్టలేని వారికోసం, అనాథలు, అభాగ్యుల కోసం ఏర్పాటు చేసిన గోడలు.

సరిపోవడం లేదు.. అవసరం లేదు.. ఎవరికైనా ఇచ్చేద్దాం.. ఇంట్లో వేస్టుగా పడివుంటోంది.. లాంటి బట్టలన్నీ ఇక్కడికి చేరిపోతాయి. ఒక్క బట్టలనే కాదు.. అభాగ్యులకు అవసరమొస్తుంది అనే ప్రతీదీ ఇక్కడ హాంగ్ చేసి పోతారు. పుస్తకాలు, బొమ్మలు, చెప్పులు ఇలా.. ఎవరికి ఏది దానం చేయాలనిపిస్తే అది పెట్టి వెళ్తారు.

జైపూర్, అలహాబాద్, డెహ్రాడూన్ వంటి అనేక నగరాల్లో నెక్కీకీ దివార్ పేరుతో చేసే ఈ సేవాభావానికి మంచి రెస్పాండ్ వస్తోంది. గోడలకు అందమైన పెయింట్స్ వేసి, మనసుని హత్తుకునేలా.. “మీకు అసరం లేకుంటే ఇచ్చేయండి.. కావాలంటే హాపీగా తీసుకోండి” అనే కొటేషన్స్ రాస్తారు.

పబ్లిక్ ప్లేసుల్లో, జనసంచారం ఉన్నచోట, కమ్యూనిటీ సెంటర్ల దగ్గర వాల్ ఆఫ్ కైండ్ నెస్ పెడతారు. దానికి కొన్ని హాంగర్లుంటాయి. దాతలు తమకు ఉపయోగపడని బట్టలు అక్కడ తగిలించి వెళతారు. అవి ఎవరికి అవసరం ఉన్నా నిరభ్యంతరంగా తీసకెళ్లొచ్చు. టవల్ దగ్గర్నుంచి ప్యాంటు, షర్టు, జాకెట్, బ్లాంకెట్.. ఇలా ఏదైనా సరే గోడకు హాంగ్ చేసి వెళ్తారు.

నేను రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషిస్తాను. నా సంపాదన అంతంత మాత్రమే. కూతురు, భార్య పాతబట్టలతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఒకాయన ఈ గోడ గురించి చెప్తే వచ్చి చూశాను. ఎంత సంతోషమేసిందంటే.. ఎప్పుడూ తొడగని బట్టలను మా పాప తొడుగుతోంది. మంచి మంచి చీరల్ని చూసి నా భార్య ఎంతో మురిసిపోయింది- ఒక రిక్షాపుల్లర్ గుండెలోతుల్లోంచి వచ్చిన స్పందన ఇది.

ఇరాన్ లో మొదలైన ఈ సేవాతత్పరత మెల్లిగా దేశమంతా పాకింది. పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా మంచి ఫలితాన్నిచ్చింది. రోడ్డుపక్కన నివసించే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ స్ఫూర్తితోనే భోపాల్ లో మహేష్ అగర్వాల్ అనే మనసున్నాయన నెక్కీ కీ దివార్ పేరుతో ఈ సాయం చేస్తున్నాడు. కావల్సిన బట్టలు దొరికినప్పుడు వాళ్ల కళ్లలో ఆనందాన్ని చూసి మహేశ్ పొంగిపోతున్నాడు. ఊరూ, పేరూ లేని దాతలకు ఆయన మనసులో నిత్యం కృతజ్ఞతలు తెలుపుకుంటునే ఉంటాడు. వాళ్లే లేకపోతే ఈ కాన్సెప్టుకే అర్ధమే లేదంటాడాయన. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాల్లో ఇలాటి గోడల్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు.

దీనికోసం అడ్మినిస్ట్రేషన్, రిజిస్టర్ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు. అందంగా పెయింట్ చేసిన చిన్న గోడ, దానికి కొన్ని హాంగర్లు ఉంటే చాలు. దానం ఇచ్చేవాళ్లు ఇస్తారు. అవసరం ఉండి తీసుకునేవాళ్లు తీసుకుంటారు. వస్తువులు, బట్టలు వస్తునే ఉంటాయి.. పోతునే ఉంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.

ఇంకో మంచి పని ఏంటంటే.. గోడల మీద పిచ్చిరాతలు, సినిమా పోస్టర్లు, మూత్ర విసర్జనలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. రద్దీ ఏరియాలోని ఓ గోడకు మంచి పెయింట్ వేసి హాంగర్లు తగిలిస్తే చాలు.. అక్కడ మానవత్వం అనే దైవం సాక్షాత్కరిస్తుంది. అది నిత్యం పరిమళిస్తునే ఉంటుంది. 

Related Stories