బైక్ మీద 18 నెలల్లో 22 దేశాలు చుట్టి వచ్చారు!!

0

ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏం తెలుస్తుంది? బయటికి వెళ్తేనే బాహ్య ప్రపంచం ఏంటో అర్థమవుతుంది. ఈ సమస్తభూమండలమంతా ఎడతెగని దుఃఖం అలుముకుంది. మనషులెవరూ ప్రశాంతంగా లేరు. మనసుల నిండా ప్రతికూలఆలోచనలు పేరుకుపోయాయి. దీనిని మార్చి సరికొత్త సానుకూల ప్రపంచాన్ని ఆవిష్కరించాలి. లోకమంతా ఒకవసుదైక కుటుంబంలా మారాలి. ఈ సందేశాన్ని నేల నలుచెరగులా చాటేందుకు బైక్ మీద బయల్దేరారు ఇద్దరుకుర్రాళ్లు.

బెన్ రీడ్ హావెల్స్, ప్రశాంత్. ఈతరం కుర్రాళ్లు. యునైటెడ్ వరల్డ్ కాలేజ్ లో బెన్ వలంటీర్గా పనిచేస్తున్నాడు.పనిమీద 2015లో పుణె వచ్చాడు. బీహార్కు చెందిన ప్రశాంత్ ఇంజనీరింగ్ కోసం పుణెకు చేరాడు. ఇద్దరికీ అక్కడేపరిచయం. ఒకేరకమైన మనస్తత్వాలు కావడంతో తొందరగా కనెక్ట్ అయ్యారు. ప్రపంచం నలుమూలలకు వెళ్లాలని,రకరకాల మనుషులను కలవాలని, వాళ్లను బాహ్య ప్రపంచంతో కనెక్ట్ చేయాలని ఎప్పడూ ఆలోచిస్తుండేవారు. అలాఅప్రయత్నంగా ఇద్దరి మనసులో బైక్ టూర్ కి బీజం పడింది. ప్రశాంత్ ఇప్పటికే ఓసారి రూరల్ ఇండియాను బైక్ మీదచుట్టేసి వచ్చాడు. బెన్కి పెద్దగా బైకులంటే ఇష్టం లేదు. కానీ ప్రపంచ యాత్ర చేసితీరాలి. ఆ కసితోనే పుణె టూ స్కాట్లాండ్ యాత్రకు సిద్ధమయ్యారు.

18 నెలల్లో 22 దేశాలు చుట్టి రావడమంటే మాటలు కాదు. అనుకున్నంత సులభమూ కాదు. ఒక్కోసారి ఇది అయ్యేపనేనా అని ఇద్దరూ డీలా పడేవారు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్ అండగా నిలిచారు. వారిలో స్ఫూర్తి నింపారు.ఐడియా అమలు చేయడానికి ఏడాది సమయం పట్టింది. వరల్డ్ మ్యాప్ ముందేసుకొని రూట్ ప్లాన్ తయారుచేసుకున్నారు. పెద్దగా ఆర్భాటాలకు పోకుండా ఉన్న వాటితోనే సింపుల్గా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు.ఇద్దరూ మ్యూజిక్ షోలు చేసి కొంత డబ్బు సంపాదించారు. కానీ యాత్ర పూర్తి కావడానికి రూ.70 నుంచి రూ.80లక్షల దాకా ఖర్చవుతుంది. సంకల్పం ముందు మనీ పెద్ద మ్యాటర్ కాదనుకున్నారు. రకరకాల ప్రాంతాలనుసందర్శించి, అక్కడి ప్రజల సంస్కృతులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి. యాత్రలో భాగంగా కళాకారులు,వ్యక్తులు, వివిధ సంస్థలను కలవాలి. ఆగిన ప్రతి చోటా అవసరాన్ని బట్టి వారం నుంచి నెల రోజులుండాలి. అక్కడేచిన్నపాటి కమ్యూనిటీ సెంటర్ కట్టుకోవాలి. దాని ద్వారా తమ సందేశాన్ని వ్యాప్తి చేయాలి. మొత్తంగా ఇదీ టూర్ ప్లాన్. 

2016 డిసెంబర్లో బెన్, ప్రశాంత్ బైక్ జర్నీ మొదలు పెట్టారు. తొలి యాత్ర పూణే నుంచి పుష్కర్ వరకు సాగింది.పుష్కర్- పూర్తిగా ఎడారి ప్రాంతం. లక్ష రూపాయలతో అక్కడొక కమ్యూనిటీ సెంటర్ కట్టడానికి ప్లాన్ చేశారు. వీళ్లకునివేదిత అనే అమ్మాయి సాయం చేసింది. స్థానిక ప్రజలు కూడా తలో చేయి వేశారు. సమష్టి కృషితో ఎకో ఫ్రెండ్లీ కమ్యూనిటీ సెంటర్ తయారైంది. పైకప్పు కోసం కర్రలు, గోడలకు ఆవు పేడ వినియోగించారు. బిందు సేద్యం ద్వారాఎడారిలో మొక్కలు నాటారు. కమ్యూనిటీ సెంటర్ లో ఒకరి ఆలోచనలను ఒకరు షేర్ చేసుకున్నారు. అందరూప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. రూరల్, అర్బన్ ఇండియా మధ్య అంతరాన్ని తొలగించడానికీ అక్కడే తొలి బీజంపడింది.

బైక్ జర్నీలో ఇద్దరి తదుపరి మజిలీ బీహార్. రెండు నెలల్లో అక్కడో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కట్టాలనిభావిస్తున్నారు. ఇందుకోసం స్థానిక పాఠశాలలు, ప్రజల సాయం తీసుకుంటారు. ఈ ఏడాది చివరికి నేపాల్చేరుకోవాలన్నది టూర్ ప్లాన్. అక్కడ మాయా యూనివర్స్ అకాడమీతో కొన్ని రోజులు కలిసి పనిచేస్తారు. రోజుకు 70నుంచి 80 కిలోమీటర్లు సాగుతున్న వీరి ప్రపంచ యాత్ర.. 2018 మధ్యలో స్కాట్లాండ్ చేరుకునే అవకాశముంది.

Related Stories

Stories by team ys telugu