కెలొరీలు లెక్కలేసి మరీ టిఫిన్లు పంపే బెంగళూరు సంస్థ

ఆరోగ్యకరమైన ఆహార అన్వేషణలో పుట్టిన కొత్త ఆలోచనకెలొరీ కాన్షియస్‌గా టిఫిన్లు పంపే సంస్థన్యూట్రిషన్‌తో పాటు ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని మెనూబెంగళూరు సహా మరిన్ని నగరాలకు విస్తరించే యోచన

కెలొరీలు లెక్కలేసి మరీ టిఫిన్లు పంపే బెంగళూరు సంస్థ

Sunday April 19, 2015,

4 min Read

ఉరుకులు... పరుగులు... బిజీబిజీ జీవితాలు. ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎక్కడ తింటున్నారో తెలియకుండా జానెడు పొట్ట నింపేసుకుంటున్నారు జనం. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు. వచ్చే రోగాల్లో సగానికి పైగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటాయట. పరిశోధనలు తేల్చిన చేదు నిజాలివి. గడప దాటి బయటకెళ్తే... జేబు నిండా డబ్బులున్నా రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం దొరకడం గొప్పే. ఏ నగరం చూసినా ఈ తిప్పలు కామనే. రుచిగా ఉందని ఏదిపడితే అతి తినేస్తే సమస్త రోగాల్ని కొనితెచ్చిపెట్టుకున్నట్టే. ఇలాంటి పరిస్థితుల్లో జనానికి పోషకాలుండే మంచి భోజనాన్ని అందించలేమా? వారి ఆరోగ్యాన్ని కాపాడలేమా? సరిగ్గా ఇదే డౌట్ వచ్చింది తపన్ కుమార్‌కు. ఉరుకుల పరుగుల జీవితాల్లో భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారికి శుచికరమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని కమ్మగా వండి వడ్డించాలన్న తపన్ కుమార్ తపనలోంచి పుట్టిందే ఐ-టిఫిన్.

image


ఐ-టిఫిన్ రిబ్బన్ కటింగ్‌కు ముందు...

మహానగరాల్లో సరైన భోజనం దొరక్క ఇబ్బందులు పడేవాళ్లను కళ్లారా చూస్తుంటాం. అలాంటి పరిస్థితిని అనుభవించే ఉంటాం. ఇందులో నో డౌట్. ఇలాంటి అనుభవమే ఓసారి బెంగళూరులో తపన్ కుమార్ దాస్‌కు ఎదురైంది. తానొక్కడిదే కాదు... బెంగళూరులో చాలామందిది ఇదే సమస్య. ఎవరికి వారు ఆ పూటకు ఏదో తింటూ గడిపేస్తున్నారని గుర్తించాడు తపన్. బెంగళూరులో హెల్తీ ఫుడ్ దొరక్క జనం పడుతున్న ఇబ్బందులు తపన్ గుండెను కలచివేసింది. న్యూట్రీషినల్ ఫుడ్ అందించే హోటళ్లు అసలు బెంగళూరులో లేవన్న విషయం అర్థమైంది. జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం అవసరమేంటో జనానికి చెప్పాలనుకున్నాడు. ఏదిపడితే అది తిని రోగాలు తెచ్చుకోకుండా... ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సంకల్పించాడు. మంచి ఆహారపు అలవాట్ల విషయంలో చైతన్యం తీసుకురావాలనుకున్నాడు. అప్పుడే వచ్చింది హెల్తీ టిఫిన్ సర్వీస్‌ను ప్రారంభించాలన్న ఆలోచన .

తపన్ కుమార్ దాస్, ఐటిఫిన్ వ్యవస్థాపకుడు

తపన్ కుమార్ దాస్, ఐటిఫిన్ వ్యవస్థాపకుడు


"ఐ టిఫిన్ ప్రారంభించడానికి కారణమేంటంటే... రుచికరమైన, పోషకాలు అందించే భోజనాన్ని జనానికి అందించాలన్న తపనే. అంతేకాదు... లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎలా వస్తున్నాయో అవగాహన కల్పించడం. మంచి ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో చెప్పడమే మా లక్ష్యం" అంటాడు తపన్. ఆ తపనే ఈ కంపెనీ పుట్టుకకు కారణం.

రిబ్బన్ కట్ చేసిన తర్వాత...

2013లో ఐ-టిఫిన్ పేరుతో సంస్థ ప్రారంభమైంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ టిఫిన్ సర్వీస్ కంపెనీ ఇది. ఒక్క ఫోన్ కొడితే చాలు... ఇంటికి కావాలంటే ఇంటికి, ఆఫీసుకైతే ఆఫీసుకి... ఎక్కడికైనా సరే నిమిషాల్లో రుచికరమైన హైక్వాలిటీ హెల్తీ ఫుడ్ అందిస్తుంది ఈ సంస్థ. ఆరోగ్యకరమైన ఆహారం అంటే అలా ఇలా కాదు. కేలరీలు లెక్కేసి, అన్నీ పక్కాగా మిక్స్ చేసి , ఎవరికెంత కావాలో అంతే సప్లై చెయ్యడం ఐ-టిఫిన్ స్పెషాలిటీ. ఇంత హడావుడి జీవితంలో ఏదో నాలుగు ముద్దలు తినేస్తే సరిపోతుంది కదా. ఈ కేలరీల లెక్కలు అవసరమా అని అనుకున్నారు మొదట్లో కస్టమర్లు. కానీ అలాంటి కస్టమర్లను కూడా ఆకట్టుకోగలిగింది ఐ-టిఫిన్. కస్టమర్ల ప్రిఫరెన్సులకు తగ్గట్టుగా భోజనాన్ని సప్లై చెయ్యడం వీరి సక్సెస్ సీక్రెట్. మొదట్లో కస్టమర్లను సంపాదించుకోవడం కష్టమైంది. పెట్టుబడికీ ఇబ్బందులే. కానీ అన్ని కష్టాలను దాటుకొని సక్సెస్‌ఫుల్ గా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది ఐ టిఫిన్. "మొదట్లో కస్టమర్లను ఆకట్టుకోవడం, క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చెయ్యడం కత్తిమీద సాములా ఉండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యకరమైన ఆహారం ఎంత అవసరమో ప్రజలు గుర్తించారు. ఆరోగ్యంపై వాళ్లలో అవగాహన పెరుగుతూ వచ్చింది. అలా ఐ-టిఫిన్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ కస్టమర్లు పెరిగారు. వారికి మంచి భోజనాన్ని అందించడం మాకు సులువైంది. మొదట్నుంచే సరికొత్తగా ప్రత్యేక మెనూ తయారు చేసి భోజనప్రియులను ఆకట్టుకున్నాం" ఐ-టిఫిన్ సక్సెస్ గురించి ఇలా గొప్పగా చెబుతున్నాడు తపన్.

తపన్ ఫ్యూచర్ ప్లాన్..?

ఐ-టిఫిన్ ప్రారంభించిన తొలి ఏడాదిలోనే ఊహించని రికార్డును సొంతం చేసుకోవడం గొప్ప విషయం. తొలి సంవత్సరంలోనే లక్షకు పైగా మీల్స్ డెలివరీ చెయ్యడం రికార్డ్. సైంటిఫిక్‌గా తయారుచేసే పోషకాహారమే ఐ-టిఫిన్ సక్సెస్ సీక్రెట్.

"మా కంపెనీకు ఐదువేల మంది లాయల్ కస్టమర్లు ఉన్నారు. ప్రతీ కస్టమర్ ఏడాదిలో అరవై రోజులు మా భోజనాన్ని రుచిచూస్తారు. 2014 ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల రూపాయల రెవెన్యూ రాబట్టగలిగాం. ఇండియాలోని ప్రతీ నగరానికి విస్తరించాలని ఐటిఫిన్ ప్రణాళికలు రచిస్తున్నాం. సుమారు 60-70 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలనుకుంటున్నాం" ఇదీ తపన్ ఫ్యూచర్ ప్లాన్.

న్యూక్లియర్ ఫ్యామిలీల సంఖ్య పెరుగుతుండటం, బిజీ జీవితాలు కూడా ఈ బిజినెస్ పెరగడానికి మరో కారణం. ఒక్క ఫోన్ కొడితే, ఒక్క క్లిక్ కొడితే కమ్మని భోజనం ఇంటి ముందుకు వస్తుందంటే ఇంకేం కావాలి. అందుకే హెల్త్ ఫుడ్ సెగ్మెంట్ ఇండియాలో బాగా అభివృద్ధి చెందడం ఖాయం.

మంచ్ బాక్స్

మంచ్ బాక్స్


ఇలాంటి బిజినెస్‌లకు ఎలాంటి అవకాశాలున్నాయి ?

కొన్నేళ్లుగా ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతోంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రీషియస్ ఫుడ్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుంటున్నారు. ఇండియాలో లైఫ్ స్టైల్ జబ్బులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి జబ్బులకు గల కారణాలు తెలుసుకొని ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలు. అందుకే ఐ-టిఫిన్ లాంటి సంస్థలు క్లిక్కవుతున్నాయి. అదృష్టం ఏంటంటే... ఇప్పటివరకు ఈ బిజినెస్ లోకి ఎక్కువమంది అడుగుపెట్టలేదు. గత ఏడాదిగా ఇలాంటి స్టార్టప్‌లు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మార్కెట్‌లో ఇలాంటి కంపెనీలకు స్పేస్ చాలా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెల్త్ అండ్ వెల్ నెస్ ఫుడ్ మార్కెట్ 55 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. హెల్తీ, న్యూట్రీషియస్ ప్యాకేజ్ ఫుడ్ తయారు చేసే కంపెనీలు ప్రారంభించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 

"ఆన్ లైన్ అయినా ఆఫ్ లైన్ అయినా హెల్త్ ఫుడ్ సెగ్మెంట్‌లో పాజిటివ్ గ్రోత్ కనిపిస్తోంది. జనానికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. హెల్తీ లైఫ్ స్టైల్ ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలుసుకుంటున్నారు. ఇలాంటి కంపెనీలకు మార్కెట్ లో మంచి స్పేస్ ఉంది" అంటారు తపన్.

ఎంత సంపాదిస్తే ఏం లాభం. సేవాగుణం ఉండాలంటారు. ఐ-టిఫిన్ లో అలాంటి సేవాగుణమే కనిపిస్తుంది. డబ్బులు తీసుకొని ఏదిపడితే అది వడ్డించే హోటళ్లు పది అడుగులకొకటి కనిపిస్తుంటాయి. ఐ-టిఫిన్ అలాంటిది కాదు. ఇక్కడ కూడా డబ్బులు తీసుకొనే వడ్డిస్తున్నా... జనం అవసరాలను తెలుసుకొని, వారి ఆరోగ్యాన్ని కాపాడే పౌష్టికాహారాన్ని వడ్డించడం వీరి ప్రత్యేకత. అందుకే అన్నదాత సుఖీభవ.