సామాజిక సేవ చేస్తున్నారా? అయితే మాకు చెప్పండి.. మీకు చేయూతనిస్తాం..

సామాజిక సేవ చేస్తున్నారా? అయితే మాకు చెప్పండి.. మీకు చేయూతనిస్తాం..

Friday February 26, 2016,

3 min Read

పెట్టుబడి.. రాబడి.. లాభమెంత.. నష్టమెంత..? చిన్నపాటి స్టార్టప్ అయినా, బడాస్థాయి కంపెనీ అయినా పైన చెప్పిన సూత్రాల ప్రకారమే నడుచుకుంటాయి. కాదనలేని సత్యం. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు మాత్రమే లాభాపేక్ష లేకుండా, వ్యవస్థ శిథిలావస్థకు చేరకముందే శస్త్రచికిత్స చేయాలని సంకల్పిస్తారు. లాభం కోసం వ్యాపారం చేయడం కంటే.. దాన్ని సామాజికమార్పు కోసం దాన్ని వినియోగించడం.. ఇండియాలాంటి దేశాలకు అవసరమని రతన్ టాటా చాలా సందర్భాల్లో, చాలా వేదికలపై అంటుంటారు. అలాంటి సంస్థల్లో ఒకటి అన్ లిమిటెడ్ హైదరాబాద్.

ఒక్కమాటలో చెప్పాలంటే సామాజికమార్పు కోసం తపించేవారికి, సోషల్ ఆంట్రప్రెన్యూర్లకు ఇదొక ఇంక్యుబేటర్ లాంటిది. చుట్టూ ఉన్న సమాజంలో ఒక మార్పు తీసుకుని రావాలని ఎవరైతే కోరుకుంటారో వారికి అన్ని రకాలుగా సాయం చేసే వ్యవస్థ. దీర్ఘకాలికంగా ఏ సమస్య అయితే పరిష్కారం కాదో.. దానికోసం పోరాడే వ్యక్తులకు, సంస్థలకు చేయూతనిస్తుందీ అన్ లిమిటెడ్ హైదరాబాద్. ఫైండ్.. ఫండ్.. సపోర్ట్ అనే మూడు సిద్ధాంతాల మీద పనిచేస్తుందీ సంస్థ. సీడ్ ఫండింగ్ ఇస్తుంది. కావల్సిన శిక్షణ ఇస్తుంది. బిజినెస్ స్కిల్స్ నేర్పిస్తుంది.

ఎందుకోసం స్థాపించారు?

సమాజంలో ఎన్నో పరిష్కారం కాని సమస్యలున్నాయి. అవన్నీ దీర్ఘకాలిక రోగాలుగా మారిపోయాయి. వాటిద్వరా జాతి ఎదుగుదల స్తంభించిపోతుంది. ఆ దారుణాన్ని ఆపాలి. ఖాళీని పూరించాలి. అదంతా ఒక్కరోజులో అయ్యేది కాదు. దానికి ఐడియాలజీ ఉండాలి. క్రియేటివ్ థాట్ జెనరేట్ కావాలి. స్వచ్ఛందంగా సోషల్ ఆంట్రప్రెన్యూర్స్ ముందుకు రావాలి. రిస్క్ అంతటా ఉంటుంది. దీనికి మినహాయింపేం కాదు. ఎంచుకున్న దారంతా ముళ్లబాటే కావొచ్చు. ఒక్కో ముల్లు ఏరుకుంటూ పోతే రేపు పూలమొక్కలు నాటుకుంటాయి. రేపటి రోజున వేల, లక్షల, కోట్ల మందికి అది హాయిగా నడిచే పూలదారవుతుంది.

వ్యవస్థలో కావల్సినంత దుఖం ఉంది. అది చెప్పడానికి షెహనాయ్ ఎందుకు శ్రుతి చేయడాలు ఎందుకు? అంటే, వ్యవస్థ పతనమైందని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి గుండెలు బాదుకునే బదులు, మార్పు తీసుకురావడానికి మనమే ఎందుకు నడుం బిగించొద్దు. ఆ వజ్రసంకల్పంతోనే అన్ లిమిటెడ్ హైదరాబాద్ లాంఛ్ ప్యాడ్ మీదికొచ్చింది. సమాజంలో ఒక అర్ధవంతమైన చర్చను లేవదీసింది. సోషల్ వెంచర్ లీడర్లతో, కార్పొరేట్ దిగ్గజాలతో, గవర్నమెంటు సెక్టారుతో ఆత్మీయ సంబంధాలు నెరిపింది. ఈ రిలేషన్షిప్ తోనే సోషల్ వెంచర్లకు ఆర్ధికంగా సాయం చేయగలిగింది. వారి నెట్వర్క్ పెంచగలిగింది. నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాన్ని రంగరించింది. సామాజిక బాధ్యత కోసం పుట్టుకొచ్చిన స్టార్టప్ లకు ఫండింగ్ వెతికి పెట్టే బాధ్యతని భుజాన వేసుకుని నడుస్తోందీ అన్ లిమిటెడ్ హైదరాబాద్.

ఇప్పటి దాకా 45లక్షలు 

ఇప్పటి వరకు రూ. 45 లక్షలు జమచేశారు. వాటిని సీఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి సేకరించారు. కొన్ని సంస్థలకు ఫండింగ్ రూపంలో అందించారు. సాధారణంగా సోషల్ స్టార్టప్స్ ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే తెరమరుగైపోతాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. పెద్దపెద్ద సంస్థలనుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ ని వీటికి అందేలా చూస్తున్నారు. చాలా సంస్థలు ఫండ్స్ కోసం ఎదురు చూస్తుంటాయి. అయితే, వాటి మనుగడ చూసి మాత్రమే ఫండింగ్ చేస్తారు. అంతేగానీ వచ్చిన ప్రతి సంస్థకూ ఇన్వస్ట్ చేస్తూ పోతే తమ లక్ష్యం నెరవేరదంటారు.

లాభాపేక్ష లేకపోవడం సోషల్ స్టార్టప్స్ మోటో కావొచ్చు. అంతమాత్రంచేత రాబడి లేకపోతే భవిష్యత్ లో సాయం అందించడం కష్టం. అందుకే ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ సస్టెయినబిలిటీ ఒక్క రోజులో సాధ్యపడేది కాదు. ఫండింగ్ కు సెలెక్ట్ కావాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. రౌండ్స్ క్లియర్ అయితేగానీ డబ్బు చేతికి రాదు.

undefined

undefined


సక్సెస్ స్టోరీస్

అన్ లిమిటెడ్ సంస్థతో కలసి సక్సెస్ అయిన రెండు సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటి రైడ్ ఇట్. రైడ్ షేరింగ్ డొమైన్ లో దుమ్ము రేపుతున్న ఈ సంస్థ అన్ లిమిటెడ్ హైదరాబాద్ తో కలసి పనిచేసింది. వీరికి ఇటీవలే ఫండింగ్ వచ్చింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సెల్ఫ్ సస్టేయినబుల్ మోడల్లో రన్ అవుతున్న ఈ సంస్థను హైదరాబాద్ ఇన్ఫోసిన్ ఉద్యోగులు ప్రారంభించారు.

RideIt మొత్తం స్టోరీ కోసం క్లిక్ చేయండి

ఇక రెండోది రుబారూ అనే మరో సంస్థ. అన్ లిమిటెడ్ హైదరాబాద్ మద్దతుతోనే అది వెలుగులోకొచ్చింది. అన్ లిమిటెడ్ సేవా కార్యక్రమాల్లో తన దైన శైలిలో ముందుకు పోతోందీ సంస్థ. ఇవే కాకుండా ఎన్నో సోషల్ స్టార్టప్స్ అన్ లిమిటెడ్ హైదరాబాద్ మద్దతుతో రాణిస్తున్నాయి.

Rubaroo కథ కోసం క్లిక్ చేయండి

అన్ లిమిటెడ్ టీం

ఇక టీం విషయానికొస్తే ముందుగా చెప్పాల్సింది ఫౌండర్ రాజ్ గురించి. పక్కా హైదరాబాదీ అయిన జనగామ రాజ్ ముంబైలో ఎంబీయే పూర్తి చేశారు. తర్వాత కొన్ని ఎన్జీవో సంస్థలతో పనిచేశారు. సైకిల్ చలాసవ్ అనే మరో స్టార్టప్ కు ఫౌండర్ గా వ్యవహారిస్తున్నారు. అన్ లిమిటెడ్ హైదరాబాద్ ని మూడేళ్లుగా రన్ చేస్తున్నారు. ఇక శివాని మదిరాజ్ ఈ స్టార్టప్ కి మరో కీలక సభ్యురాలు. ఆపరేషన్స్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. బయోటెక్ లో డిగ్రీ చదివిన ఆమె, గతంలో హెల్త్ కేర్ స్టార్టప్ కోసం పనిచేశారు. వీరితో పాటు మరో పది మంది ఫ్రీ లాన్సర్స్ వర్క్ చేస్తున్నారు.

సవాళ్లు, లక్ష్యాలు

సోషల్ స్టార్టప్ ని గుర్తించడం పెద్ద సవాలంటారు రాజ్. ఇటీవల అన్ లిమిటెడ్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తే 455 వచ్చాయట. అయితే అందులో అనుకూలంగా అనిపించినవి పట్టుమని పది కూడా లేవట. స్టార్టప్ లేకపోతే ఫండ్స్ తీసుకు రావడం కూడా సవాలే. ఇలా రెండువైపుల నుంచి ఎప్పటికప్పుడు సమస్యలు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటారాయన. కొత్త ఆలోచనలతో వచ్చే వారికి రెవెన్యూ మోడల్ చూపించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొంటామని చెప్తున్నారు. అంతిమ లక్ష్యం కూడా అదే అని ముగించారు రాజ్.

image