నాశనం చేసుకుంటారా ? విప్లవానికి నాంది పలుకుతారా.. ? ఛాయిస్ మీదే

నాశనం చేసుకుంటారా ? విప్లవానికి నాంది పలుకుతారా.. ? ఛాయిస్ మీదే

Wednesday October 07, 2015,

5 min Read

గెస్ట్ రచయిత - అశుతోష్ వ్యాసం


' ఓ చర్చ్ నిండుగా ఉండే సాధువుల కంటే.. ఓ డ్రమ్ నిండా ఉన్న వైన్ ఎక్కువ ఉపయోగపడుతుంది' - ఇదో ఇటాలియన్ సామెత. ఆల్కహాల్ తాగడంపై ఇలాంటి సామెతలు, పిట్టకథలు చాలానే ఉంటాయి. అయినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా మద్యం సేవించడం మానేయరు. 1990 కాలంలో రిపోర్టర్‌గా ట్రైనింగ్ పొందుతున్నపుడు నేను శ్రీనగర్ వెళ్లాను. తీవ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్న టైం అది. అల్లర్లతో కశ్మీర్ అంతా అల్లకల్లోలంగా ఉంది. అసలు భారత్‌లో ఈ ప్రాంతం కలిసి ఉండడం సాధ్యమేనా అనే స్థాయిలో పరిస్థితులున్నాయి అప్పట్లో. దాల్‌ లేక్ సమీపంలో సెంటార్ హోటల్‌కి వెళ్లాను. ఆ ఉదయం చలితో పాటు భయం కూడా ఆ హోటల్ మేనేజర్‌ని వణికిస్తోంది. అతనిని చూస్తే.. మరో నిమిషంలో ఆ భయానికి కళ్లు తిరిగిపడిపోతాడేమో అన్నట్లుగా ఉంది. ఏం జరిగిందని అడిగాను ?

"ఓ మిలిటెంట్ ఇంతకుముందే వచ్చి, ఓ బాటిల్ ఆల్కహాల్ డిమాండ్ చేశాడు. పర్యాటకుడిగా మారువేషం వేసుకుని వచ్చి.. మద్యం కోసం ఒత్తిడి చేశాడు. ఎంతసేపు అడిగినా అసలు మద్యం లేదని ఖరాఖండీగా చెప్పాను. చివరకు అతను జేబులోంచి గన్ తీసి.. నేరుగా ఛాతివైపు గురిపెట్టాడు. 'ఇవాళ నువ్వు బతికిపోయావ్ ఒకవేళ నువ్వు ఆల్కహాల్ బాటిల్ ఇచ్చి ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడివి అన్నాడు'అని చెప్పాడు హోటల్ మేనేజర్.

image


Pic courtesy - Andrew Beierle


వెంటనే ఆ హోటల్ నుంచి చెకవుట్ చేసేశాను. మరింత ప్రాచుర్యం పొందిన హోటల్‌కి మారిపోయాను. తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోవడం ఇష్టం లేకే ఇలా చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే.. అప్పటిది చిన్నపిల్లల ఆలోచనలా అనిపిస్తుంది. ఈసారి నేను మారిన హోటల్ బాగా సాంప్రదాయాలు పాటించేది. అయితే.. నగరం నడిబొడ్డున ఉండడంతోనే దీన్ని ఎంచుకున్నాను. బయట పనులు పూర్తి చేసుకుని.. కాస్త చీకటిపడ్డాక రూమ్ చేరుకున్నాను. ఆ సమయంలో డోర్ తలుపు తట్టిన చప్పుడైంది. రిసెప్షన్ నుంచి వచ్చిన ఓ యువకుడు కనిపించాడు. చాలా మర్యాదగా మద్యం కావాలా సార్ అని అడిగాడు. నాకు ఆ సమయంలో వెన్నులోంచి వణుకొచ్చింది. నన్ను ఇరికించడానికిగాను, నాపై దాడి చేయడానికి ఇదో వ్యూహంలా అనిపించింది. నాకేం వద్దని చెబ్తూ తలుపు మూసేశాను. కాసేపటి తర్వాత మరోసారి తలుపు తట్టారు. సీనియర్ పాత్రికేయులు ఒకరు వచ్చారు. ఆయన మందు తాగేందుకు కంపెనీ కోసం వెతుకుతున్నారు ఆ సమయంలో. నువ్వు తాగుతావా ? అని అడిగిన ఆయన.. నా జవాబు కోసం ఎదురుచూడకుండా.. రిసెప్షన్‌కి కాల్ చేసి.. రూమ్ సర్వీస్‌ని పిలిచారు. నా ఆదుర్దాని మరింత పెంచుతూ.. ఓ బాటిల్ ఆల్కహాల్ సర్వ్ చేశారు మా రూమ్‌కి. ఏదో కీడు జరగబోతోందనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది. అయితే ఆ పెద్దాయన నాకు ధైర్యం చెప్పారు. "టెర్రరిస్టులు కశ్మీరీలకు లిక్కర్ అమ్మకాలపై నిషేధించిన విషయం వాస్తవమే అయినా.. ఇక్కడ మద్యం చక్కగా దొరుకుతుంది. ఎవరూ నిన్ను ఏం అనరు, భయపడాల్సిన పనిలేదని " చెప్పారాయన.

ఎప్పుడెళ్లినా మందు కామన్

ఈ సంఘటన జరిగాక.. నేను చాలాసార్లు కశ్మీర్ వెళ్లాను.. కావాల్సినపుడల్లా మద్యం తెప్పించుకుని తాగాను. ఒక్కసారి కూడా ఏ సమస్యా ఎదురు కాలేదు. ఇక్కడ ప్రతీ బ్రాండ్ లభిస్తుంది. ఏది కావాలన్నా తెచ్చి ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది. మద్య నిషేధం అమలయ్యే రాష్ట్రమైన గుజరాత్ కూడా వెళ్లాను. పూర్తిగా రాష్ట్రమంతటా మద్య నిషేధం ఉన్నా.. ఎక్కడెక్కడ ఆల్కహాల్ దొరుకుతుందో ఏ వ్యక్తిని అడిగినా చెప్పేస్తాడు. ఈ ప్రాంతాన్ని తరచుగా విజిట్ చేసే జర్నరిస్టులయితే.. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విధానాలకు సమాంతరంగా అభివృద్ధి చెందిన వ్యవస్థను గురించి, మద్యం అమ్మకాల గురించి కథలు కథలుగా చెబ్తారు. మోడీ అమెరికా టూర్ సమయంలో ఢిల్లీలో ఓ డిబేట్ జరిగింది. ఆల్కహాల్ సేవించేందుకు వయో పరిమితిని 25 నుంచి 18కి తగ్గించాలా వద్దా అనేదే ఆ డిబేట్. 25 ఏళ్ల వయసు లోపు వ్యక్తులు మద్యం తాగకూడదని.. ఓ కొత్త విషయం తెలిసింది నాకప్పుడే. 18 ఏళ్ల వయసు నిండిన వారికి దేశ భవిష్యత్తును నిర్ణయించే అర్హత వస్తుంది కానీ.. ఓ గుక్కెడు మద్యాన్ని గొంతులో పోసుకునే హక్కులేని దేశం మనది.

గుడ్ బోయ్ ఎలా డ్రింక్ స్టార్ట్ చేశాడంటే ?

యువకుడిగా ఉన్న సమయంలో మద్యపానం సమాజానికి పట్టిన చీడ అనుకునే పరిస్థితుల్లో పెరిగాను నేను. నా తండ్రి నలుగురితో కలిసి అప్పుడప్పుడూ మద్యం తీసుకునేవారు. చాలామందికి ఈ విషయం తెలీదు. అలా తెలీకుండా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకునేవారు. ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే మద్యం ముట్టుకునేవారాయన. కానీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చినపుడు విభిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక్కడ మద్యం తాగడం పెద్ద నేరం, పాపం కాదు. మేధావులుగా అందరూ పరిగణించే విద్యార్ధులు, కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఓపెన్‌గానే లిక్కర్ తాగేవారు. యువతులు కూడా తమ తాగుడు అలవాటుని దాచిపెట్టాలని అనుకునేవారు కాదు. ప్రతీ సందర్భానికీ నలుగురూ కలిసి డ్రింక్ చేయడం అలవాటే ఇక్కడ. దీంతో నా మనసు కూడా మద్యం వైపు మళ్లసాగింది. కానీ నేను అప్పటికి గుడ్ బోయ్‌నే.

సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించేందుకు ఓ పట్టాన మనసు అంగీకరించేది కాదు. ఆ సమయంలో సాంప్రదాయమా ? ఆధునికమా.. ? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం వచ్చినట్లుగా అనిపించింది. రెండు విభిన్న వాతావరణాల్లోంచి.. నాకు నచ్చిన ఛాయిస్ ఎంచుకున్నాను. అయితే.. నా తండ్రి డబ్బులతో మాత్రం మద్యం ముట్టకూడదనే నిబంధన నాకు నేనే విధించుకున్నాను. నా సంపాదన అందుకున్న మొదటి ₹300 చెక్‌తో... ఓ ఫ్రెండ్‌తో కలిసి డ్రింక్ చేసి ఎంజాయ్ చేశాను. అయితే నా చెవుల్లో ఎలాంటి మధురమైన సంగీతం వినిపించలేదపుడు. " ఆల్కహాల్... అమ్మాయి ప్రేమ లాంటిది. మొదటి ముద్దు మ్యాజిక్‌లా ఉంటుంది. రెండో ముద్దు దగ్గర చేస్తుంది. మూడో ముద్దు నుంచి సాధారణంగానే ఉంటుంది. ఆ తర్వాత పూర్తి నగ్నంగా తయారైనట్లే " అని రేమండ్ కాండ్లర్ తరచుగా అనే మాటలు గుర్తొచ్చినా.. ఎందుకలా చెప్పాడో అర్ధం కాలేదు.

మొదటి మందు అనుభవం తర్వాత

నేను మొదటి సారి మద్యం సేవించడమే సాధారణం అనిపించింది. తాగేశాక చక్కగా నిద్రపోయాను. తెల్లవారాక కూడా మామూలుగా ఫ్రెష్‌గా, ఫిట్‌గానే ఉన్నాను. ఇలా మందు కొట్టినందుకు నాకేం సిగ్గు, తప్పు అనిపించలేదు. మరి దీన్నో పాపంగా మతం ఎందుకు చెప్పిందో నాకు అర్ధం కాలేదు. ఇంత చిన్న విషయంపై సమాజం ఎందుకంతగా దృష్టిపెడుతుందో.. నీతులు వల్లిస్తోందో అని ప్రశ్నించాలని అనిపించింది. కాస్త ఓ చుక్కేసుకుంటే.. శరీరంలోపల కాస్త అలజడి రేగి.. వేరే స్వేచ్ఛా ప్రపంచానికి వెళ్లిన భావన కలిగిస్తుంది. అది కూడా కాసేపే. నాకు ఆ సమయంలో ఓ పాత వాడుక వాక్యం గుర్తొచ్చింది.

" నన్ను మసీదులో కూర్చుని మందు తాగనివ్వండి. లేదా... ఖుదా లేని ప్రాంతాన్ని చూపించండి'' ఎక్కడ లేడో నాకు ఆ ప్రాంతం ఎక్కడుందో చెప్పండి".

సిగ్గు నుంచి సిలికాన్ వరకూ..

ఇప్పుడు నేను స్వేచ్ఛగా తాగుతాను. కుటుంబంతో పాటు, స్నేహితులతో కలిసి కూడా ఎలాంటి సంశయం లేకుండా, సిగ్గు పడకుండా లిక్కర్ తాగుతాను. మద్యపానం చేసే వయసును 25 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం సబబేనా అనే అంశంపై... టీవీ ఛానళ్లలో వచ్చే డిబేట్స్‌ను చూస్తుంటాను. సమాజం మరింత క్రూరంగా మారిపోతుందని, నేరాలు పెరుగుపోతాయంటూ.. నీతులు మాట్లాడే వాళ్లను చూస్తే నాకు జాలి వేస్తుంది. మద్యం కొనడానికి, తాగడానికి ఢిల్లీ కుర్రకారుకి వయసుతో పనిలేదు. నవతరం యువత చాలా వేగంగా ఉంది. వారు తెలివైన వాళ్లే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. వాళ్లు లిక్కర్‌ని ఇష్టపడుతున్నారు. ఎలాంటి బార్‌లు వారికి అవసరం లేదు.

వీళ్లని చూస్తే నాకొకటి అనిపిస్తుంది. ఒకవేళ సిలికాన్ వ్యాలీ ఢిల్లీలో ఉంటే... యాపిల్ రివల్యూషన్‌ని సృష్టించిన వాళ్లంతా ఈ పాటికి జైల్లో మగ్గుతూ ఉండేవారు. ఈ సాంకేతిక విప్లవాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచాన్ని దోచేసేలా క్రూరమైన ప్రణాళికలు రచించేవారు. " ఓ తోటి స్నేహితులారా.. మీకు చెప్పేదొకటే. ఎవరైనా వ్యక్తి ఎక్కువగా తాగేసి కంట్రోల్ తప్పినపుడే సమస్య వస్తుంది. అలాంటి వాడిని ఎవరూ పట్టించుకోరు కూడా. తగినంత, వైద్యుల సూచన మేరకు తాగితే.. మద్యం ఓ ఔషధంలా పనిచేస్తుంది. మనిషిని ఆ మద్యం తాగేడం మొదలు పెట్టినపుడే నరకం ప్రారంభమవుతుంది. పంజాబ్‌లో ఓ తరం మొత్తం మద్యం కారణంగా నాశనమైతే... సిలికాన్ వ్యాలీలో ఓ విప్లవానికి నాంది పలికింది. దేని వైపు ఉండాలో ఛాయిస్ మీదే".

- అశుతోష్

image


(ఈ ఆర్టికల్ పూర్తిగా రచయిత సొంత అభిప్రాయం. పార్టీతో ఎటువంటి సంబంధం లేదు)

గెస్ట్ రచయిత పరిచయం -

అశుతోష్.. మాజీ టీవీ జర్నలిస్ట్. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు ఆప్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.