చిన్నవ్యాపారుల షాపుల్లో చౌక స్వైపింగ్ మెషీన్ల ఏర్పాటుతో విజయం సాధించిన 'ఎం స్వైప్'

మొబైల్ ఆధారిత పీఓఎస్ టెర్మినల్స్తక్కువ ఖర్చే కావడంతో చిన్న వ్యాపారులకు ఉపయోగంఎంస్వైప్‌కు మారుతున్న కార్పొరేట్ కంపెనీలుఫీచర్ ఫోన్లకూ అమర్చుకోగలిగే పేమెంట్ డివైజ్

చిన్నవ్యాపారుల షాపుల్లో చౌక స్వైపింగ్ మెషీన్ల ఏర్పాటుతో విజయం సాధించిన 'ఎం స్వైప్'

Thursday July 09, 2015,

3 min Read

షాపింగ్ చేశాక జేబులు డబ్బులు లేకపోవడం లాంటి సమస్య ఎదురైందా ? కార్డ్ ద్వారా పేమెంట్ చేసేందుకు షాపు ఓనర్ అంగీకరిస్తే సరే... మరి చేతిలో డబ్బు లేకుండా, దగ్గర్లో ఏటీఎం కనపడకుండా, షాపులో స్వైపింగ్ మెషీన్ లేకుండా ఉంటే... పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. దీనికి పరిష్కారం అందిస్తోంది ఓ సంస్థ. అదే ఎంస్వైప్.

image


మొబైల్ ఆధారిత పీఓఎస్ టెర్మినల్

పాయింట్ ఆఫ్ సేల్ టెర్మనల్స్... ఇవి వచ్చాక పలు వస్తువులు, సేవల కోసం మాల్స్, పేమెంట్స్ వంటి విషయాల్లో కొంత వెసులుబాటు లభించింది. అయితే మన దేశంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చాలా ఎక్కువ. వీరు ఇలాంటి పీఓఎస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అంత సుముఖంగా లేరు. ప్రారంభంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి రావడం, ఇంటర్నెట్ ఖర్చులు, నిర్వహణా భారం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. దీనికో చక్కని పరిష్కారం చూపుతున్నారు మనీష్ పటేల్. ఈయన జనవరి 2009లో ముంబైలో వైన్ & బీర్ రిటైల్ స్టోర్స్ ప్రారంభించారు. వీటిలో కార్డ్ పేమెంట్స్ అంగీకరించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించగలిగారు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గ్రహించిన మనీష్... ఈ తరహా పీఓఎస్ టెర్మినల్స్‌ను తక్కువ ఖర్చులో అందుబాటులోకి తేవాలన్న ఆలోచన చేశారు. దీనికి కార్యరూపమే ఎంస్వైప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రారంభమైన స్టార్టప్.

మొదటి మొబైల్ కాన్సెప్ట్ ఎంస్వైప్

మనదేశంలో మొదటి మొబైల్ ఆధారిత పీఓఎస్ టెర్మినల్‌ను లాంఛ్ చేసిన ఘనత ఎంస్వైప్‌దే. కార్డ్ రీడర్ రూపంలో 2012లో దీన్ని ప్రారంభించారు. ఏ మొబైల్ ఫోన్‌ ఆడియో ఇన్‌పుట్ జాక్‌కి అయినా ఈ కార్డ్ రీడర్‌ను అమర్చవచ్చు. ఎంస్వైప్ అందించే మొబైల్ స్వైపర్‌ ఉపయోగించి.. సాధారణ ఫీచర్ ఫోన్‌తో కూడా వ్యాపారులు పేమెంట్లను పొందచ్చు. దీన్ని మూడు సింపుల్ స్టెప్స్‌తో యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. కంపెనీ అందించే కార్డ్ రీడర్ వంటి డివైజ్‌ను ఆడియో ఇన్‌పుట్ జాక్‌కి అమర్చడం, స్వైప్ మెషీన్‌లో అప్లికేషన్‌ని, స్వైప్‌ని లాంఛ్ చేయడం.. అంతే యాక్టివేట్ అయిపోయినట్లే. ఈ మొత్తం డివైజ్‌ను, సాఫ్ట్‌వేర్‌ను ఎంస్వైప్ సంస్థే రూపొందించింది. పలు ఓఎస్‌ల ఆధారంగా పని చేసే మొబైల్స్, పేమెంట్ గేట్‌వే, ఎన్‌క్రిప్ట్ చేసిన కార్డ్ రీడర్... ఇందులో భాగాలు.

image


“చిన్న, మధ్య తరహా వ్యాపారులకు, ఇప్పుడున్న పీఓఎస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసుకోలేని వాళ్లకు... మా ఎంస్వైప్ చక్కని పరిష్కారం. మన దేశంలో మొబైల్ పేమెంట్స్ ఊపందుకోడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసిస్తున్నాం. దేశవ్యాప్తంగా 200నగరాల్లోని వ్యాపారులకు సరసమైన ధరలకే పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోంది ఎంస్వైప్. ఇన్సూరెన్స్ ఏజంట్స్, హోం డెలివరీ వంటివారితో.. భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం”అని చెప్పారు మనీష్.

సెలూన్ నుంచి ఏసీ మెకానిక్ వరకూ అందరికీ ఉపయోగమే

మన దేశంలో ఇప్పటికే 6 వేలకుపైగా వ్యాపారులకు, శ్రీలంలో వెయ్యిమందికి ఎంస్వైప్ అందించే మొబైల్ స్వైపర్స్‌ను అందించారు. ఈ సర్వీసును ఉపయోగించుకున్న మొదటి కస్టమర్లలో... ముంబైలో సెలూన్ నిర్వాహకుడు ఒకరు. చాలామంది కస్టమర్లు తమ ఇంటి దగ్గరే సర్వీస్ కావాలని అడుగుతుండడం, చాలా సమయాల్లో చేతిలో క్యాష్ లేక ఇబ్బందిపడ్డం గమనించడంతో... ఎంస్వైప్‌‌ను ఎంచుకున్నారు సెలూన్ నిర్వాహకులు.

“ఇలాంటి చిన్న బాకీలను వసూలు చేసుకునేందుకు వారు చాలా ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమస్యను సంపూర్తిగా పరిష్కరించేదే ఎంస్వైప్” అంటున్నారు మనీష్.

కార్పొరేట్లు కూడా

వీరి కస్టమర్లలో మెకానిక్‌లు కూడా ఉంటున్నారు. “ఎప్పుడూ ఆఫీసులకు, ఇళ్లకు వెళ్లి రిపేర్లు చేసే ఏసీ మెకానిక్ ఒకరు దీన్ని కొనుగోలు చేశారు. పేమెంట్స్ పొందే విధానం ఇంత తేలికగా ఉండడం తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పారు ఆ సర్వీస్ మ్యాన్”అన్నారు మనీష్. ఇలాంటి చిన్నవ్యాపారులకే ఇది పరిమితం కాలేదు. బడా కార్పొరేట్ కంపెనీలు కూడా ఎంస్వైప్ వైపు మొగ్గు చూపాయి. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, యురేకా ఫోర్బ్స్‌లు కూడా ఇప్పటికే ఎంస్వైప్‌ను ఉపయోగిస్తున్నాయి.

ఈ డివైజ్‌ను ఉపయోగించడం చాలా తేలిక. దాదాపు అన్ని రకాల మొబైల్స్‌‍తోనూ ఇది పని చేస్తుంది. ఒక లావాదేవీని పూర్తి చేయడానికి.. వ్యాపారులు అమౌంట్ ఎంతో నింపి, కస్టమర్ కార్డును స్వైప్ చేయాలి. తర్వాత కార్డ్ హోల్డర్ మొబైల్ నెంబర్‌, ఈమెయిల్ అడ్రస్‍‌‌లను ఎంటర్ చేయాలి. స్వైపర్ స్క్రీన్‌పై కస్టమర్ సంతకాన్ని తీసుకోవాలి. ఆయా వ్యక్తులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ రూపంలో అందుతుంది. ట్రాన్సాక్షన్ విలువకు సరిపడే మొత్తం... వ్యాపారి ఖాతాలో జమవుతుంది.

ఎంస్వైప్ నుంచి వైజ్‌ప్యాడ్ వరకూ

డిసెంబర్ 2013లో ఈఎంవీ చిప్ ఆధారిత మొబైల్ పీఓఎస్‌ 'వైజ్‌ప్యాడ్'ను లాంఛ్ చేసింది ఎంస్వైప్. ఇది బ్లూటూత్ ఆధారంగా నడిచే పరికరం. దీనికి మొబైల్‌తో నేరుగా కనెక్షన్ అక్కర్లేదు. క్రెడిట్, డెబిట్ కార్డులను.. రిజర్వ్ బ్యాంక్ భద్రతా ప్రమాణాల ప్రకారమే యాక్సెప్ట్ చేస్తుంది వైజ్‌ప్యాడ్. అంతే వేగంగానూ పనిచేయడం దీని ప్రత్యేకత. సాంప్రదాయ పీఓఎస్ టెర్మినల్స్ ఖరీదు, నిర్వహణతో పోల్చితే... దీనికయ్యే మొత్తం చాలా తక్కువ. నగదు లావాదేవీలకు బదులుగా వైజ్‌ప్యాడ్‍‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఏదైనా సెటిల్ కాని ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే సదుపాయం వ్యాపారులకు ఉంది. చివరి 30 రోజులకు సంబధించిన లావాదేవీలను పరిశీలించుకోవచ్చు.