వీర సిందూరం కావాలి స్వర్ణ సిందూరం..!!

1

కోర్టులో పాదరసంలా కదులుతూ..

వేటాడేముందు పులి జింకను చూసినట్టు రాకెట్ వైపు తీక్షణంగా చూస్తూ...

పాయింట్ వచ్చినప్పుడల్లా ఒక సింహానాదం చేస్తూ...

రెండు సెట్లలోనూ ప్రత్యర్ధికి చుక్కలు చూపిస్తూ..

రియో ఒలింపిక్స్ లో పసిడి పతకానికి అడుగుదూరంలో నిలబడింది తెలుగుతేజం సిందు.

సిందూ.. సిందూ..

ఇండియా.. ఇండియా..

మొదటి సెట్లో మొదటి పాయింట్ నుంచి మొదలైన నామస్మరణ..

చివరగా జయహో ఇండియా అనే వరకు వెళ్లింది.

ఏకాగ్రత సడల్లేదు. పట్టువిడవలేదు. గురి తప్పలేదు. పొరబడలేదు. తడబడలేదు. వెనుకడుగు వేయలేదు. కనురెప్పల మీద మువ్వన్నెల పతాకం అలా అలవోకగా ఎగురుతుండగానే.. సిందు వీరసిందూరమై భారతావని నుదుటిపై మెరిసింది. వందకోట్ల మంది భారతీయుల గుండెలు ఆ క్షణాన గర్వంతో ఉప్పొంగాయి. ఆటగాళ్ల కళ్లు చెమర్చాయి.

రియోలో ఒక్కో పతకం చేజారి పోతుంటే.. ఒక్కో ఆటగాడు వెనక్కి వస్తుంటే.. గ్రూపు దశలోనే చతికిలబడుతుంటే.. ఒక్కో విమర్శ ఈటెలా గుండెలో దిగబడుతుంటే.. ఆ బాధేంటో.. ఆ వేదనేంటో.. ఒక్క ఆటగాడికే తెలుసు. అలాంటి నిరాశా మేఘాలు కమ్ముకున్న తరుణంలో సర్రున బాణంలా దూసుకు వచ్చి పసిడి ముంగిట వాలి ఆశలు రేపింది వీర సిందూరం. ఎర్రెర్రగా ఉదయించిన ఆ గెలుపు తిలకాన్ని ముఖమంతా పులముకునేలా చేసింది తెలుగుతేజం.

బ్యాడ్మింటన్ లో అయినా వస్తే బావుండు అనే నిట్టూర్పును నిజం చేయడమంటే మాటలు కాదు. వేటకొడవళ్లలాంటి ఏడుగురు బరిలోకి దిగి చివరకి ఒక్కరు మిగలితే ఏ భారతీయుడి హృద‌యమైనా భారమెందుకు కాదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వంద కోట్ల మంది గుండెల బరువు దించింది సిందు. సైనా నెహ్వాల్ ఉసూరుమనిపించింది. శ్రీకాంత్ పోరాడి ఓడిపోయాడు. అయినా సిందు రూపంలో ఒక ఆశ కొడిగట్టిన దీపంలా మిణుకుమిణుకుమంది. ఎప్పుడైతే ఆ దీపం సెమీస్ లో ప్రత్యర్ధిని మట్టికరిపించిందో.. ఆ క్షణమే దీపం కాగడాలా మండింది. ఆకలి మీదున్న పులి వేటాడితే ఎలా వుంటుందో కోర్టులో చూపించింది. సిందు ఆడిన తీరు పులి జింకను వేటాడినట్టే అనిపించింది. కాదు.. అంతకు మించి కనిపించింది. ప్రత్యర్ధి కురిపించిన దుర్బేధ్యమైన షాట్లను అలవోకగా తుత్తునియలు చేసింది. మొదటి సెట్ నుంచే పట్టుబిగించి జపాన్ షట్లర్ ను మూడు చెరువుల నీళ్లు తాగించింది.

హోరాహోరి సాగిన పోరాటంలో సిందు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఎక్కడా తడబడలేదు. ప్రత్యర్ధిని అంచనా వేయడంలో ఎక్కడా మిస్టేక్ చేయలేదు. వచ్చిన ఏ అవకాశాన్నీ జారవిడవలేదు. ఆది నుంచీ అదే ఆధిపత్యం. చివరి దాకా అదే స్వైరవిహారం. నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగింది. బరిలోకి దిగడంతోనే ప్రత్యర్ధి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడంలో సఫలమైంది. 21-19తో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న సిందు.. రెండో సెట్లో జపాన్ షట్లర్ ను మెతుకు మింగనీయలేదు. 21-10 తేడాతో రెండో సెట్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫైనల్లో స్థానాన్ని, ఇటు రియోలో పతకాన్ని ఖరారు చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే సిందు కోర్టులో శివతాండవమే చేసింది. కమాన్ సిందు.. జయహో భారత్.. అనే నినాదాలు సిందు భైరవి రాగంలా వినిపించాయి.

ఫైనల్‌ పోరులో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారినాతో ఢీ కొట్టడానికి దేశం తరుపున సమాయత్తమైన మన సిందు.. స్వర్ణసిందూరం కావాలని కోట్లాది మంది అభిమానుల తరుపున యువర్ స్టోరీ మనసారా కోరుకుంటోంది.

ఆల్ ద బెస్ట్ సిందూ... 

Related Stories

Stories by team ys telugu