జాతీయవాదం ముసుగులో ఏం చేసినా అడగొద్దా..?

0

ఈ దేశంలో ఫలానాది తప్పు, ఫలానా పని రైటు అని నిర్ణయించేది ఎవరు? ఒకరి భావప్రకటనా స్వేచ్ఛను మరొకరు హరించే హక్కు ఉందా? భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారిని ఎవరు శిక్షించాలి? ఇవి నా ప్రశ్నలు కావు. రాంజాస్ కాలేజీ వివాదంతో దేశమంతా అడుగుతున్న సందేహలు. రాంజాస్ కాలేజీలో వివాదం తలుచుకుంటేనే భయమేస్తోంది. ఒకే ఒక్క సంఘటన మన దేశం, మన సమాజం భవిష్యత్తును అంపశయ్య మీదికి తెచ్చింది. నిజానికి ఆ సెమినార్‌ ను సెమినార్ లా నిర్వహించుకోనిస్తే సరిపోయేది. ఈ గొడవే ఉండేది కాదు. కానీ కొందరికి అది నచ్చలేదు. జాతి వ్యతిరేక శక్తులతో మిలాఖత్ అయినట్టుగా ఆరోపణలున్న వ్యక్తిని సెమినార్ కు ఎలా పిలుస్తారని విద్యార్థులు గళమెత్తారు. ఆందోళన చేశారు. ఆ క్రమంలో హింస జరగింది. అయితే సెమినార్ కు ఆహ్వానం పొందిన ఆ వ్యక్తి మీద కేసు ఇంకా తెగలేదు. కోర్టులో ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. కానీ అంతకన్నా ముందే కొందరు అతడిని దోషిగా తేల్చేశారు. ఇది ఎంతవరకు కరెక్టు?

రాంజాస్ కాలేజీలో వివాదానికి కారణమైన ఆ సెమినార్ అసలు జరగనేలేదు. కానీ కొందరి ఊహలు, లేనిపోని అపోహలతో జరగరాని నష్టం జరిగిపోయింది. ఒక దేశద్రోహి ఆ సమావేశంలో పాల్గొంటే.. ఏదైనా జరగొచ్చన్న అనుమానంతో విధ్వంసం సృష్టించారు. ఇది ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడని ముందుగానే ఊహించి ఉరి తీసినట్టుగా ఉంది! ఊహలు, అనుమానాల ఆధారంగా ఒక నేరం జరుగుతుందంటే చట్టం ఒప్పుకోదు. దాని ఆధారంగా ఎవరినీ నేరస్తులుగా పరిగణించదు. ఎవరినైనా సరే దోషిగా నిలబెట్టాలంటే ముందు నేరం అనేది జరగాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. జాతీయవాదం పేరు చెప్పి లేనిపోని అనుమానాతో ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారు.

రాంజాస్ కాలేజీ వివాదం ఈ దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాంటివి కొనసాగితే దేశంలో ఇంకెవరూ గొంతెత్తి మాట్లడలేరు. ఎవరూ స్వేచ్ఛగా తమ భావాలను చెప్పుకోలేరు. కళ ఎన్నటికీ సృజనాత్మక రూపంలోకి మారదు. ఇక ఏ సినిమా తెరకెక్కదు. విజ్ఞానం నలుగురికీ పంచడం అనేది అసాధ్యం. ఇన్నోవేషన్ ఒక కలగానే మిగిలిపోతుంది. విద్యార్థులకు కొత్త ఆలోచనలు చేసే అవకాశం దొరకదు. కాలక్రమంలో భావ ప్రకటనా స్వేచ్ఛ వ్యర్థమైపోతుంది. ఎందుకూ కొరగాని అర్థం లేని హక్కు కింద మారిపోతుంది. ఆ తర్వాత జాతి యావత్తూ మూగబోతుంది.

పౌరుల ప్రాథమిక హక్కులకు ఎవరూ భంగం కలిగించకూడదని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా అదే నియమం వర్తిస్తుంది. రాజ్యాంగానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరు చెప్పుకొని ఎవరూ దూషణలకు దిగడానికి వీల్లేదు. మాట్లాడే హక్కుంది కదా అని సమాజాన్ని చీల్చడం, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సమాజం మీద విషం చిమ్మడం చేయకూడదు. అలాంటి పనులు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. కానీ రాంజాస్ కాలేజీలో అలాంటివేమీ జరగలేదు కదా? మరెందుకు ఒక వ్యక్తిని దోషిగా వేలెత్తి చూపిస్తున్నారు? రాంజాస్ కాలేజీ ఎపిసోడ్ ఇందిరా గాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోంది.

ఎవరు పడితే వాళ్లు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘన జరిగిందని నిర్ణయిస్తారా? దానికి రాజ్యాంగం అని ఒకటుంది. నేరం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ముందుగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. తర్వాత కోర్టు కేసును విచారిస్తుంది. కొన్నిసార్లు ఫిర్యాదు రాకపోయినా కోర్టే స్వయంగా కేసును టేకప్ చేస్తుంది. కానీ రాంజాస్ ఎపిసోడ్ లో కొందరు వ్యక్తులు తమనితాము చట్టంగా భావించారు. తామే ఫిర్యాదుదారులమని, తామే పోలీసులమని ఫీలయ్యారు. ఇంకో అడుగు ముందుకేసి కోర్టు పాత్రను కూడా పోషించారు. ఏబీవీపీ విద్యార్థులు క్యాంపస్ లో వాతావరణానికి భంగం కలిగించారు. సెమినార్ పెట్టిన వాళ్లకు బుద్ధి చెప్తామని హింసకు దిగారు. ఇది ముమ్మాటికీ చట్టాన్ని ఉల్లంఘించడమే. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని అనుకున్నప్పుడు అందుకు పోలీసులున్నారు. సెమినార్ ను వాళ్లే అడ్డుకుంటారు. కానీ ఇక్కడ విద్యార్థులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ పోలీసులది ప్రేక్షక పాత్ర అయింది. రాజ్యాంగానికి విఘాతం కలిగించే ఇలాంటి దుశ్చర్యలు చాలా ప్రమాదకరం. ఏ రాజ్యాంగం గురించి అయితే ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారో.. అదే రాజ్యాంగాన్ని వాళ్లే ఉల్లంఘించి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు.

ఏడాది కిందట జేఎన్‌యూలో కూడా సంఘ విద్రోహ శక్తులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధించిన వీడియో టేపులు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దీనికి సంబంధించి అప్పట్లో కన్నయ్య కుమార్ తోపాటు కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే కన్నయ్య కుమార్ పై దాడి కూడా జరిగింది. కానీ జేఎన్‌యూలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన ఆ ఎనిమిది మంది కశ్మీరీ యువకులను మాత్రం ఇప్పటికీ గుర్తించలేదు. అరెస్ట్ చేయలేదు. ఇప్పుమేడో పోలీసులు కన్నయ్య కుమార్ అసలు దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని అంటున్నారు. అంటే ఇక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. కోర్టును కాదని కొందరు వ్యక్తులు, మీడియాలోని వాళ్ల స్నేహితులు కలిసి తామే కోర్టు, జడ్జి, జ్యూరీ అని భావించారు. అవతలి వారికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తీర్పులు ఇచ్చుకున్నారు. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో పోలీసులు, కోర్టులతో అసలు అవసరమే ఉండదు. ఎవరి తీర్పులు వాళ్లే ఇచ్చుకుంటారు. దేశంలో జంగిల్ రాజ్ వస్తుంది.

జాతీయవాదం ముసుగులో చేసే ప్రతి దాడిని సమర్థించుకోవడం, బహిరంగ బెదిరింపులకు దిగడం.. గర్హనీయం కాదు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వ వ్యవస్థలు శిలావిగ్రహాల్లా మిన్నకుండిపోవడం శోచనీయం. ఇండియాది పరిణతి చెందిన రాజ్యాంగమని ప్రపంచమంతా కీర్తిస్తున్న ఈ పరిస్థితుల్లో.. ఇక్కడేమో హింస, అసహనం పెరిగితే మళ్లీ వందల ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాం. డెమోక్రసీ అనేది ఒక్క మెజారిటీలకే కాదు. అది మైనారిటీ ప్రజల హక్కులు, సిద్ధాంతాలను కూడా కాపాడాలి. ఈ దేశం బలహీన వర్గాల ప్రజలది కూడా. కాబట్టి వాళ్ల హక్కులకు కూడా రక్షణ కల్పించాలి. లేదంటే దేశ సమగ్రతే ప్రశ్నార్థకం అవుతుంది. రాంజాస్ కాలేజీ వివాదంతో.. మైనారిటీ హక్కుల రక్షణలో దేశం బలహీనమైందా అన్న సందేహం తలెత్తుతోంది. కానీ నేను దాన్ని ఒప్పుకోను. ఇండియా బలహీన దేశం కాదు. కాకపోతే కొందరు బలవంతులతో ఢీ కొడుతోంది. అది ఈ దేశానికి అస్సలు మంచిది కాదు. ఈ దేశంలో పౌరులకు రాజ్యాంగమే అత్యున్నతం కావాలి. రాజ్యాంగాన్ని హరించే హేయమైన చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలి. అప్పుడే మన అఖండ భారత దేశం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది.