అన్నకు రక్ష రాఖీ.. చెల్లికి రక్ష మరుగుదొడ్డి.. యూపీలో వినూత్న కార్యక్రమం

తెలంగాణలోనూ అన్నకు రాఖీ కట్టి హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని ఎంపీ కవిత క్యాంపెయిన్

0

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. తోబుట్టువుల ప్రేమ కలకాలం నిలవాలని సోదరుడి చేతికి సోదరి రాఖీ కడుతుంది. హార్ధిక సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అవుతున్న ఈ రోజుల్లో రక్షాబంధన్ కుటుంబ విలువలన్నీ, ప్రేమైక అనుభూతుల్నీ మూటగడుతుంది.

అన్న చేతికి చెల్లి రాఖీ కట్టడం.. ఆమెకు ఏదో ఒక విలువైన బహుమతి ఇవ్వడం.. కొంతకాలంగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఇలాంటి సంప్రదాయంలో కొత్త ఒరవడి సృష్టించారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ ప్రజలు. ఈసారి రక్షాబంధన్ ని వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ కాన్సెప్టు పేరు అనోఖి అమేథి కా అనోఖా భాయ్. అంటే రాఖీ కట్టిన చెల్లికి మరుగుదొడ్డిని బహుమతిగా ఇవ్వడం.

ఇన్నేళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇంకా ఆడపడుచులు తెల్లారకముందే బహిర్భూమికి వెళ్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశమని గర్వంగా చెప్పుకునే ఈ దేశంలో ఒక స్త్రీ పాపభీతితో కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి దాపురించడం నిజంగా సిగ్గుచేటు. అందుకే మరుగుదొడ్డి అనే నిశ్శబ్ద విప్లవం ఊరూరా దండోరా మోగిస్తోంది. ఇప్పుడిప్పుడే టాయిలెట్ ఆవశ్యకత ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. టాయిలెట్ పేరుతో వచ్చిన సినిమా కూడా దేశంలోని ఆడవారి వేదనకు అద్దం పట్టింది. ఆ నేపథ్యంలోనే చెల్లికి కానుకగా రక్షాబంధన్ రోజు టాయిలెట్ బహుమతిగా ఇవ్వాలని యూపీ ప్రజలు సంకల్పించారు.

డిస్ట్రిక్ట్ శానిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సుమారు 900 మంది తన సొంత డబ్బులతో మరుగుదొడ్లు కట్టివ్వడానికి ముందుకు వచ్చారు. అందులో పాల్గొన్న వారిలో ముగ్గురికి రూ. 50వేల నగదు బహుమతిని, ఒక మొబైల్ కానుకగా ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. ఈ దెబ్బతో అక్టోబర్ 2018కల్లా యూపీ మొత్తం బహిర్భూమి రహిత ప్రాంతంగా మారిపోతుందనడంలో సందేహం లేదు.

సిక్కిం, కేరళతో సహా ఐదు రాష్ట్రాలు ఇప్పటికే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. ఆ జాబితాలో యూపీ కూడా రాబోతోంది. 75 జిల్లాల్లో 15.5 మిలియన్ల టాయిలెట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యం చేసేందుకు యోగి సర్కారు నడుం బిగించింది. సకాలంలో టాయిలెట్లు నిర్మించుకున్న వారికి నజరానా కూడా ప్రకటించారు. అది కాకుండా కేంద్రం కూడా తనవంతుగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి రూ. 4వేల బహుమానంగా ఇవ్వబోతోంది.

యూపీలో రక్షాబంధన్ ఇలా ప్లాన్ చేస్తే, తెలంగాణలో కూడా మరో వినూత్న రీతిలో జరుపుకోవాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అన్నకు రాఖీ కట్టిన చెల్లి అదే చేత్తో హెల్మెట్ కూడా ఇవ్వాలని క్యాంపెయన్ మొదలుపెట్టారు. ఎందుకంటే దేశంలో రోజుకి కనీసం నాలుగు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కారణం తలకి హెల్మెట్ లేకపోవడమే. అందుకే అన్నకు రక్ష రాఖీ.. అన్న తలకు రక్ష హెల్మెట్.. అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ కి మంచి స్పందన వస్తోంది. కేంద్ర మంత్రులు మొదలుకొని, స్టార్ క్రికెటర్ల దాకా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోదరుడి క్షేమాన్ని కోరి హెల్మెట్ బహుమతిగా ఇచ్చే కొత్త సంప్రదాయానికి మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నారు. 

Related Stories

Stories by team ys telugu