కుగ్రామం నుంచి వచ్చినా ఆలోచనలకు కొదవ లేదు

చిన్న గ్రామం నుంచి పెద్ద లక్ష్యాల వైపు...స్ఫూర్తిగా నిలుస్తున్న అనితా సెంథిల్ విజయగాథ...

కుగ్రామం నుంచి వచ్చినా ఆలోచనలకు కొదవ లేదు

Monday October 24, 2016,

3 min Read

మారుమూల పల్లెల్లోంచి వచ్చేవారి ఆలోచనలు, ఆశయాలు ఆ పల్లెల్లాగే చిన్నగా ఉంటాయంటారు. కానీ అనితా సెంథిల్ అలా కాదు. పుట్టిన ఊరు చిన్నదే అయినా... కలలూ, లక్ష్యాలన్నీ పెద్దపెద్దవే. లక్ష్యసాధనలో ఓ మహిళగా ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోలేదు. ఆమె లక్ష్యానికి సంసార జీవితం ప్రతిబంధకం కాలేదు. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న ఆమె జీవితం అందరికీ ఓ పాఠమే. ఇంతకీ ఎవరా అనితా సెంథిల్ ? ఏం సాధించారు ? తెలుసుకుందాం...

చిన్న గ్రామం నుంచే తొలి అడుగులు

కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఆమెది ఓ చిన్న గ్రామం. అక్కడి దిగువ మధ్యతరగతి చెందిన దంపతుల కుమార్తె అనితా సెంథిల్. సాధారణంగా పల్లెటూరి అమ్మాయిలంటే... ఇంటి ఖర్చుల లెక్కలు రాసుకునేంత చదువుంటే చాలన్న అపోహ ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి... ఇదే వారి జీవితం. కానీ అనితా సెంథిల్ జీవితం అలా కాదు. తరచి చూస్తే చాలా కనిపిస్తుంది. ఆమె ఆశయాలకు తల్లిదండ్రులు ఏనాడూ అడ్డు చెప్పలేదు. నచ్చిన కెరీర్ ఎంచుకోవాలని ప్రోత్సహించారు. పూర్తి సహకారం అందించారు. పాలక్కడ్‌లో స్కూల్ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత డిగ్రీ, పీజీ కోసం కొయంబత్తూర్ వెళ్లారు అనిత. గ్రాడ్యుయేషన్ తర్వాత 2008లో చెన్నైలో బీపీఓ సెక్టార్‌లో అడుగుపెట్టారు. ఇక్కడ లభించిన జ్ఞానం, అవగాహన ఆమెకు జీవితంలో కీలకంగా మారింది. కన్నతల్లి లాంటి సొంతూరిని, ఆ ఊళ్లో ఉండే తల్లిదండ్రుల్ని విడిచి దూరంగా ఉండటమంటే పెద్ద సవాలే. ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. కుటుంబానికి దూరంగా నెలలు నెలలు ఉండటం చాలా కష్టం. అనిత కూడా అంతే. తల్లిదండ్రుల్ని విడిచి ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. 

2009లో ఉద్యోగాన్ని వదిలి పెట్టి సొంతూరికి తిరిగివెళ్లారు. అక్కడే ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఓ జాబ్‌లో చేరారు. కానీ ఆ ఉద్యోగం అంత సంతృప్తినివ్వలేదు. అప్పుడే ఆన్ లైన్ కెరీర్ వైపు అడుగులు వేశారు.

అనిత సెంధిల్

అనిత సెంధిల్


ఫ్రీలాన్స్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా విద్యారంగంలో అడుగుపెట్టారు. అందులోనూ సవాళ్లే. కానీ ఎదుర్కొనే కష్టాలు, సమస్యలు మనిషిని మరింత రాటుదేలుస్తాయి. తన విషయంలో అదే జరిగింది. కెరీర్‌లో ముందుకెళ్తున్నకొద్దీ ఆమె ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. 2012లో Coursegig.com ని ప్రారంభించారు. ప్రొఫెషనల్ స్టడీ మెటీరియల్ అందించే వెబ్‌సైట్ ఇది. మెటీరియల్ మాత్రమే కాదు... ఆన్‌లైన్ ట్యూటర్స్‌ని కూడా అందించిన ఘనత ఈ వెబ్‌సైట్ ది. ఆ తర్వాత 2014లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ చదువు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించేందుకు కావాల్సిన నైపుణ్యం లభించింది.

"నా ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. ఆ సంఘర్షణ నుంచి, ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నా. ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ వ్యాపార మెళకువలను నేర్చుకున్నా. మార్కెట్ ను అధ్యయనం చేయడం ఎంతగానో ఉపయోగపడింది. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను..? నా కాంపిటీటర్స్ ఎవరు ? ఎలా ముందుకెళ్లాలి? లాంటి చాలా ప్రశ్నలకు నాకు సమాధానం దొరికింది" అంటారు అనితా.

లక్ష్యాలు సాధించడంలో పురుషులతో పోలిస్తే మహిళలకు ఆటంకాలు ఎక్కువ. స్త్రీలకు పెళ్లి, పిల్లలు, సంసారం లాంటి ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ ఇవేవీ తన కలలకు, అభిరుచికి, వెంచర్‌కు ఏమాత్రం అడ్డంకి కాలేదని గర్వంగా చెబుతారు అనిత. "కుటుంబంతో నిత్యం తీరికలేకుండా ఉంటామని నా స్నేహితులు చెబుతుంటారు. ఏమీ చేయడానికి సమయం దొరకట్లేదంటారు. కానీ బ్యాలెన్స్ పాటిస్తే ఏదైనా మేనేజ్ చేయొచ్చు. ఇప్పటికీ నా తర్వాతి అడుగు ఏంటీ అని నేను నిత్యం ఆలోచిస్తూనే ఉంటాను. కొత్త లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలని ప్రణాళిక రూపొందిస్తుంటాను. ఇదంతా నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఎంతో శక్తినిస్తుంది. ఆశావాద దృక్పథంతో ఉండేందుకు తోడ్పడుతుంది" అని గర్వంగా చెబుతారు. 

ఆ ధైర్యంతోనే ఈ ఏడాది ప్రారంభంలో అనిత అతిపెద్ద ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. కొచ్చిన్‌లో కీవేస్ ఎడ్యు సర్వీసెస్‌కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం coursegig.com, academicpaperhub.com రెండు వెబ్ సైట్లను కీవేస్ ఎడ్యు సర్వీసెస్ గొడుగు కిందకు తీసుకొచ్చారు. కొన్నాళ్ల తర్వాత పేపర్స్ తయారుచేయడంపై దృష్టిపెట్టనున్నారు. తన టీమ్ గురించి చాలా గొప్పగా చెబుతారు అనిత.

"నాకు చాలా మంచి టీమ్ ఉంది. వాళ్లు నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలిచారు. ముగ్గురు ఉద్యోగులు నాకు నిత్యం సహకరిస్తుంటారు. ఇక మిగతా వాళ్లంతా ఫ్రీలాన్సర్స్. వీళ్లతోనే నేను అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నా" అంటారు అనితా.
image


ఇంటర్నెట్, టెక్నాలజీ ద్వారా విద్యార్థులు వారి లక్ష్యాలు చేరుకోవడానికి సాయపడుతున్నారు. విద్యార్థులను విద్యావంతుల్ని చేయడానికి, వారి విద్యాప్రమాణాలు పెరగడానికి, భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఆన్ లైన్ సపోర్ట్ ఇవ్వడమే మా అంతిమ లక్ష్యం.

కలాం స్ఫూర్తితో ముందడుగు

ఒక పారిశ్రామికవేత్తగా తన సర్కిల్ ను పెంచుకోవడానికి, వేర్వేరు వర్గాలతో కలిసిపోయేందుకు అనితా ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. ఎంతోమంది పరిచయం ఆమె కెరీర్ కు మరిన్ని బాటలు వేస్తోంది. చాలామంది ఆమె లక్ష్యాలు చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. 'ఇతరులు వారి లక్ష్యాలను చేరుకోవడానికి సాయం చేయడం ద్వారానే నా లక్ష్యాన్ని నేను చేరుకోగలను' అంటూ గొప్ప ఫిలాసఫీని చెబుతారు అనితా. అన్నిరకాలుగా ఫిట్‌గా ఉండేందుకు నిత్యం యోగా, ధ్యానం చేస్తారు. "నేను కేవలం మంచి విషయాలపైనే దృష్టి పెడతాను. నేను చేసే ప్రతీ పనిలో సంతృప్తి చెందుతాను" అంటూ సక్సెస్ సీక్రెట్ గురించి చెబుతారు అనితా. స్ఫూర్తి పొందడమే కాదు... ఎవరికైనా స్ఫూర్తిగా నిలవాలన్నది అనితా సెంథిల్ ఆశయం. అలాంటివాళ్లు వాళ్ల ఊళ్లో చాలా అరుదు. అనుకున్న లక్ష్యాలు సాధించిన మహిళలు ఆ ఊళ్లో తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిని దాటి ముందుకు దూసుకెళ్తోంది అనితా. ఇప్పుడు పలక్కడ్ గ్రామ మహిళలకు ఆదర్శంగా నిలిచారు అనితా.

"ఒక మహిళగా నేను ఏమీ సాధించలేనని ఎప్పుడూ అనుకోలేదు. కలలు కనండి, వాటిని ప్రేమించండి, వాటికోసం బాగా కష్టపడండి, లక్ష్యం మీ సొంతం అవుతుంది" అని గర్వంగా చెబుతారామె.

అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ తనకు స్ఫూర్తిగా నిలిచిందంటారు అనితా. అనిత విజయంలో స్నేహితుల ప్రోత్సాహం కూడా ఉంది.