బిల్డింగ్ మెటీరియల్‌కు వన్ స్టాప్ సొల్యూషన్ ! 4 నెలల్లో రూ.5 కోట్ల అమ్మకాలు !

ఇంటి నిర్మాణ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన- బిల్డింగ్ మెటీరియల్స్ దొరికే వన్ స్టాప్ షాప్-

బిల్డింగ్ మెటీరియల్‌కు వన్ స్టాప్ సొల్యూషన్ ! 4 నెలల్లో రూ.5 కోట్ల అమ్మకాలు !

Thursday December 31, 2015,

5 min Read

ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. నిజమే... ఇళ్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఎంతో శ్రమ పడాలి. అభిరుచికి తగ్గట్లు అందమైన ఇళ్లు కట్టుకోవాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరిక తీర్చుకునేందుకు పడాల్సిన శ్రమను గుర్తుచేసుకుని చాలా మంది వెనకడుగు వేస్తారు. ఇష్టం లేకపోయినా రెడీమేడ్ ఇళ్లు, అపార్లమెంట్లతోనే సరిపెట్టుకుంటారు. 

నిజానికి ఇళ్లు కట్టడం అంటే మాటలు కాదు. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్ నుంచి ఇంటి ఇంటీరియర్ వరకు అవసరమైన అన్ని వస్తువులు సమకూర్చుకోవడం పెద్ద తలనొప్పే. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. దొొరికినా అది నాణ్యమైనదేనా అని ఎన్నో అనుమానాలు. రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన 43ఏళ్ల వినీత్ సింగ్ కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారు. కలల సౌధం కట్టుకునేందుకు నాణ్యమైన బిల్డింగ్ మెటీరియల్ కోసం ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

image


బాధలు అన్నీ ఇన్నీ కావు 

ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. మనిషి అవసరాలు తీర్చే వేల కొద్ది వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. అయితే బిల్డింగ్ మెటీరియల్స్ కు సంబంధించి ఉపయోగకరమైన, కచ్చితమైన సమాచారం ఇచ్చే వెబ్ సైట్ కానీ పోర్టల్ గానీ ఒక్కటీ వినీత్ సింగ్ కు కనబడలేదు. దీంతో వినీత్, ఆయన కుటుంబ సభ్యులు గంటలకొద్దీ టైం వేస్ట్ చేసుకుని మేగజైన్లు తిరగేసి అవసరమైన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నారు. ఎంతో శ్రమ పడి కోరుకున్నట్లు ఇంటిని కట్టుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తైన కొన్ని నెలల తర్వాత వినీత్ సింగ్, దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ ఎండీ పునీత్ దాల్మియాను కలిశారు. ఆ సమయంలో పునీత్ తన ఇంటిని రెనోవేట్ చేేయిస్తున్నారు. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కు అవసరమైన మెటీరియల్ తయారు చేసే పెద్ద సంస్థను నడిపే ఆయన కూడా ఇళ్లు కట్టే సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలనే ఎదుర్కొన్నట్లు వినీత్ తెలుసుకున్నారు.

దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న పునీత్ దాల్మియా లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారంటే ఇళ్లు కట్టుకోవాలనుకునే సామాన్యుల పరిస్థితి ఏంటా అన్న ప్రశ్న వినీత్ ను తొలిచివేసింది. అప్పుడు వచ్చిన ఆలోచనే ఓ స్టార్టప్ కు బీజం వేసింది. అలా పుట్టిందే బిల్డ్ జర్.

ఇంతకీ ఏంటీ బిల్డ్ జర్ ?

బిల్డ్ జర్. హోం కన్ స్ట్రక్షన్, హోం రనోవేషన్ ప్రాబ్లమ్స్ కు పరిష్కారం చూపే ఆన్ లైన్ మార్కెట్. ఇంటి యజమానులు, బిల్డర్స్, ఆర్కిటెక్టులు, డిజైనర్లకు ఇంటి నిర్మాణం, రెనోవేషన్ కు అవసరమైన మెటీరియల్ సప్లై చేసే ఆన్ లైన్ వెబ్ సైట్.

బిల్డ్ జర్ లో అన్ని రకాలైన కన్ స్ట్రక్షన్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. సిమెంట్, స్టీల్, ఇటుక, ఇసుక, బాత్రూం ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్స్, టైల్స్, పెయింట్, గ్రనేట్ రాళ్లు, వాటర్ టాంక్స్ ఇలా ఒక్కటేమిటి ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది.

“ఇంటి నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల్ని తీర్చేందుకు మేం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించాం. ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఇంటి డిజైన్ల నుంచి మెటీరియల్స్, లెేబర్ వరకు అన్ని సర్వీసులు అందిస్తున్నాం.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది వన్ స్టాప్ షాప్.”-వినీత్

‘బిల్డ్ యువర్ హోం విత్ బిల్డ్ జర్’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ వినూత్నమైన విధానం వినియోగదారులకు ఫ్రొఫెషనల్తో మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు అతి తక్కువ సమయంలోనే ఒక్కోసారి కొన్ని గంటల్లోనే కోరుకున్న ఇంటిని కట్టుకునే అవకాశం కల్పిస్తోంది.

బలం, బలగం

వినీత్, అతని స్నేహితుడైన స్వప్నిల్ త్రిపాఠి కలిసి బిల్డ్ జర్ ను ఏర్పాటు చేశారు. గత పదిహేనేళ్లుగా వినీల్, స్వప్నిల్ కు పరిచయం ఉంది. కన్జ్యూమర్ ఇంటర్నెట్ ఇండస్ట్రీలో వారిద్దరికీ ఉన్న అపారమైన పరిచయాలతో టీంను బిల్డప్ చేసుకున్నారు.. క్లారిటీ కన్సెల్టెన్సీ సాయంతో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వివేక్ సిన్హాను, సోర్సింగ్, ఆపరేషన్స్ డైరెక్టర్ గా రోమిల్ కౌల్, టంక్రీ సొల్యూషన్స్ డైరెక్టర్ దర్శన్ గుండ్వారా, సప్లై చెయిన్ డైరెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవాను తమ టీంలో చేర్చుకున్నారు.

“సంజయ్ చక్రవర్తి, అమిత్ గులాటీ ఈ కామర్స్ అసోసియేట్ డైరక్టర్లుగా, ఆశ్లేష్ యాదవ్, అవినాష్ సింగ్, టెక్ అండ్ డిజైన్ హెడ్ గా ఉన్నారు. సంస్థలోని ఒక్కరి వినూత్న ఆలోచనతో బిల్ట్ జర్ 150 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా మారింది. 99ఏకర్స్ లాంటి కంపెనీలో పనిచేసిన స్వప్నిల్ అనుభవం కంపెనీ విలువను పెంచింది.” -వినీత్

కొత్త ఉత్పత్తులు

సమాచార అసమానతల్ని తొలగించేందుకు బిల్డ్ జర్ టీం బెజ్టిమేట్ ను రూపొందించింది. బడ్జెట్ కు అనుగుణంగా కన్ స్ట్రక్షన్ కాస్ట్, క్వాలిటీ, సమయాన్ని లెక్క గట్టే కాల్క్యులేటర్, స్టోర్ లా ఇది పనిచేస్తుంది. 

“నిర్మాణ దశలకు అనుగుణంగా యూజ్ - కేస్ - బేస్డ్ కాంబోలను రూపొందించాం. దీంతో మెటిరీయల్ సప్లయ్ , డెలివరీ గురించి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు” -వినీత్

బిల్ట్ జర్ ను ప్రారంభించేందుకు వినీత్ అండ్ టీం మార్కెట్ సైజ్, కసమర్లు ఏ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న నెస్టోపియా, సెంట్రల్ మార్ట్ ఈ కామర్స్ బిజినెస్ లోకి వచ్చి ధరల్లో అనూహ్యమైన మార్పులు వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలతో సతమతమయ్యారు. మరోవైపు కస్టమర్లకు మెటీరియల్ అరువుపై అందిచాల్సి ఉంటుంది. కొందరు డబ్బు చెల్లించేందుకు మెండికేస్తే పరిస్థితి ఏంటన్న విషయాన్ని ఆలోచించి ముందుగానే డబ్బులు తీసుకుని మెటీరియల్ సప్లై చేసే పద్దతిని అమలుచేశారు.

పెరిగిన ఆదాయం

బిల్ట్ జర్ ను ప్రారంభించిన మొదటి రోజు నుంచే కస్టమర్లు రాక మొదలైంది. జులైలో 8లక్షల విలువైన ఆర్డర్ ను పూర్తి చేశారు. ఇక అప్పటి నుంచి బిల్ట్ జర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్క నవంబర్ నెలలోనే కంపెనీ కోటీ 10లక్షల విలువైన మెటీరియల్ ను విక్రయించింది. బిల్ట్ జర్ ప్ర్రారంభించినప్పటి నుంచి జరిగిన మొత్తం అమ్మకాల్లో ఇది 1/3వ వంతు.

నెలకు సగటున 2 కోట్ల రూపాయల చొప్పున మొదటి నాలుగు నెలల్లోనే 5 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిపామని బిల్ట్ జర్ టీం గర్వంగా చెబుతోంది. మొత్తం అమ్మకాల్లో సగటున మూడు శాతం వరకు లాభం వస్తోందంటున్నారు వినీత్. కంపెనీ కార్యకలాపాలు పెరిగే కొద్దీ లాభం కూడా పెరుగుతుందని ధీమాతో చెబుతున్నారు. బిల్ట్ జర్ లావాదేవీలన్నీ వంద శాతం అడ్వాన్స్ పేమెంట్ విధానంలోనే జరుగుతాయి.

“మాకు 275 మంది ప్రత్యేక కస్టమర్లు ఉన్నారు. వారు సగటున 7 సార్లు మాతో లావాదేవీలు జరుపుతారు. మా సగటు ఆర్డర్ వాల్యూ 55 వేల రూపాయలు. మాకు లాజిస్టిక్ ఖర్చులంటూ ఏం లేవు. మేం మార్కెట్ ప్లేస్ మోడల్ ను ఫాలో అవుతాం”- వినీత్

బిల్ట్ జర్ లో స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్స్, ప్లంబింగ్, ఫ్లోరింగ్, పెయింట్స్, బాత్రూం, కిచెన్, వార్డ్ రోబ్ లాంటి 18 విభాగాలను చెందిన వస్తువులను విక్రయిస్తుంది. పర్యావరణ అనుకూలమైన సోలార్ వాటర్ హీటర్స్, ఇటుకలకు ప్రత్యామ్నాయంగా వాడే ఏఏసీ బ్లాక్స్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది.

బిల్ట్ జర్ ప్రారంభించినప్పుడు ఢిల్లీ / ఎన్ సీఆర్ పరిధిలో బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్లు 30మంది ఉంటే ఇప్పుడా సంఖ్య 250కి చేరింది. బిల్ట్ జర్ లో 100కు పైగా దేశ, విదేశీ బ్రాండ్లకు చెందిన వస్తువులు లభిస్తాయి.

“ఇంటి నిర్మాణానికి సంబంధించి కస్టమర్లు డిజైన్ ఎంపిక, మెటీరియల్స్, లేబర్, సైట్ పర్యవేక్షణకు చదరపు అడుగు లెక్కన ధర నిర్ణయించి ప్యాకేజీలు అందిస్తున్నాం” -వినీత్

బిల్డ్ జర్ టీం డిజైన్, ఇంజనీరింగ్, కన్ స్ట్రక్షన్ సర్వీసులను ఒక్క చోట అందించడమే కాదు.. అవన్నీ ప్రామాణికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. బిల్డ్ జర్ లో ఉన్న ప్రతి సర్వీస్ ప్రొవైడర్ కూడా క్వాలిటీ మెటీరియల్ అందించేలా ప్రోత్సహిస్తుంది.

భవిష్యత్ ప్రణాళికలు

బిల్డ్ జర్ ఏర్పాటుకు అవసరమైన నిధులను పునీత్ దాల్మియా అందించారు. అయితే వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల కోసం బిల్డ్ జర్ టీం ప్రణాళికలు రూపొందిస్తోంది.

“సంప్రదాయ రంగాల్లో కస్టమర్లు, సప్లయర్లకు ఓ కొత్త పద్దతి అలవాటు చేయడం సవాల్ లాంటిది. కానీ కాలక్రమంలో మేం ఈ మార్పు తీసుకురాగలిగాం. వినియోగదారుల నమ్మకం సాధించి ఆన్ లైన్ లో బిల్డింగ్ మెటీరియల్ కొనుగోలు చేసేలా మార్పు తీసుకురాగలిగాం. ఈ విధానంలో కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువుల్ని ఒక్క క్లిక్ లో కొనుగోలు చేయడమే కాదు.. తమకు అనువైన సమయంలో డెలివరీ తీసుకునే వెసలుబాటు ఉంటుంది.”- వినీత్

ప్రస్తుతం ఢిల్లీ- ఎన్ సీఆర్ లో సేవలందిస్తున్న బిల్డ్ జర్ సేవల్ని 12 నుంచి 15 శాతం విస్తరించాలని భావిస్తోంది. వచ్చే మూడేళ్లలో టైర్ టూ సిటీల్లో అడుగుపెట్టాలని అనుకుంటోంది.

మార్కెట్ అవకాశాలు

2013 పీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం దేశ ఆర్థిక వృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారత జీడీపీలో నిర్మాణ రంగ వాటా 8శాతంగా ఉంది. 2013 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ రంగం 13.9శాతం వృద్ధి నమోదుచేసింది. ఇండియన్ మార్కెట్ లో ప్రిీమియం రియల్ ఎస్టేట్ 7 నుంచి 8శాతంగా ఉంది. అందులో 55 శాతం వాటా ముంబై, ఢిల్లీ నగరాలదే.

కాలంతో పరుగులు పెడుతున్న మనిషి తన కలల సౌధం నిర్మించుకునేందుకు బిల్డ్ జర్ ఎంతో సహాయపడుతోంది. భవిష్యత్తులో బిల్డ్ జర్ సేవలు మరింత విస్తృతం అయితే ఎలాంటి శ్రమ లేకుండానే అందమైన ఇంటిని అతి తక్కువ కాలంలో నిర్మించుకోవడం ఏ మాత్రం కష్టం కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.