కార్పొరేట్ ఉద్యోగం వదిలి వెడ్డింగ్ ఫోటోగ్రఫీతో అంతర్జాతీయ స్థాయికి అన్షుమ్

కార్పొరేట్ ఉద్యోగం వదిలి పెళ్లి ఫోటోల వైపు అడుగులుఇప్పటివరకూ 30వేల ఫోటోలు తీసిన అన్షుమ్ చిన్న కెమెరాతో పెద్ద పెద్ద అద్భుతాలుకార్పొరేట్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆఫర్లు

కార్పొరేట్ ఉద్యోగం వదిలి వెడ్డింగ్ ఫోటోగ్రఫీతో అంతర్జాతీయ స్థాయికి అన్షుమ్

Wednesday June 17, 2015,

4 min Read

ఏడేళ్ళపాటు అతనో కార్పొరేట్ బానిస. కానీ ఖాళీ సమయంలో హాబీ మాత్రం వదులుకోలేదు. క్లిక్కులమీద క్లిక్కులు. తనకిష్టమైన పనిలో దిగటం కోసం ఏడేళ్ళు ఆగిన అన్షుమ్ మండోర్... మొత్తానికి ఉద్యోగం వదిలేసి తన పేరుమీదనే ఎ.ఎమ్. ఫొటోగ్రఫీ మొదలుపెట్టాడు. కొత్త కెరీర్‌లో తనకు తానే బాస్. చాలా కష్టాలు దాటిన తరువాతే వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ఫొటోగ్రఫీలో అనేక విభాగాలలో నైపుణ్యం ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతలు మాత్రం వెడ్డింగ్ ఫొటోగ్రఫీలోనే.

అన్షుమ్ మండోరా

అన్షుమ్ మండోరా


అన్షుమ్ మొదటిసారిగా చేత పట్టిన డిజిటల్ కెమెరా సోనీ మావికా. దాని రిజల్యూషన్ 1.3 మెగా పిక్సెల్స్. ఈ రోజు అందుబాటులో ఉన్న కెమెరాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఆశ్చర్యమేంటంటే, అంత చిన్న కెమెరాతోనూ అద్భుతాలు సృష్టించేవాడు. కొంతమందికి ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగిన తరువాత నిర్దిష్టమైన కెమెరామీద కూడా ఆసక్తి పెరుగుతుంది. కానీ అన్షుమ్‌ని ముందుకు నడిపింది మాత్రం కెమెరానే. కొద్దిపాటి బేసిక్స్, విపరీతమైన ఆసక్తి వెంటరాగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టి బంధించటం మొదలుపెట్టాడు. కొద్దికాలానికే ఆ కెమెరా అతనిలో ఒక భాగమైపోయింది. ఉద్యోగం నుంచి తప్పుకునేసరికి దాదాపు 30 వేల ఫొటోలు తీశాడు.

ఫొటోగ్రఫీలో ఆసక్తి పెరిగేటప్పటికే కార్పొరేట్ ఉద్యోగంలో మూడేళ్ళు గడిచిపోయాయి. పూణేలో మార్కెటింగ్‌లో పిజి డిప్లొమా కూడా పూర్తిచేశాడు. అప్పుడే ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెరిగింది. అయినా, దాన్నొక వృత్తిగా ఎంచుకోవటమంటే సాహసమే. తన మార్వాడీ కుటుంబంలో ఇంత భిన్నమైన ప్రత్యామ్నాయం ఎంచుకోవటం మరింత సాహసమంటారు. మరో మూడేళ్ళు కార్పొరేట్ ఉద్యోగంతో బాటే ఖాళీ సమయం ఫొటోగ్రఫీకి అంకితమైంది. క్యాంపస్ నుంచి నేరుగా కార్పొరేట్ మార్కెటింగ్ రంగంలో అడుగుపెట్టిన అన్షుమ్ వృత్తినీ, ఆసక్తినీ బాలెన్స్ చేసుకోవటం కష్టమయ్యేది. అయితే, ఆఫీస్ ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రం తన ఫొటొగ్రఫీ నైపుణ్యానికి పనిదొరికేది. మొత్తానికి రెండిటికీ న్యాయం చేయటం కష్టమని అర్థం కాగానే 2010 లో మార్కెటింగ్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు.

అన్షుమ్ తీసిన వెడ్డింగ్ ఫోటో

అన్షుమ్ తీసిన వెడ్డింగ్ ఫోటో


ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఫొటోగ్రఫీలో అన్షుమ్ ఏకలవ్యుడు. సొంతంగా నేర్చుకున్నదే ఎక్కువ . బుక్స్, ఇంటర్నెట్ ఎంతగానో సాయపడ్దాయి. పూర్తికాలం ఫొటోగ్రఫీలో స్థిరపడాలనుకునేసరికి చాలామంది ఫొటోగ్రాఫర్లతో పరిచయాలు పెరిగాయి. అవసరమైనప్పుడు వాళ్ళిచ్చే సూచనలూ, సలహాలూ మరెన్నో విషయాలు నేర్పాయని వినయంగా చెబ్తారు. చేసే పని మరింత మెరుగ్గా ఉండాలని ఫొటోగ్రఫీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ, అమలు చేస్తూ వచ్చాడు. ఈ రంగంలో వస్తున్న సరికొత్త క్రియేటివ్ ట్రెండ్స్‌నీ పట్టుకుంటూ వచ్చాడు. బాగా పేరుమోసిన వాళ్ళ పద్ధతులు పరిశీలిస్తూ, తనదైన ముద్ర వేయటానికి మరింత మెరుగ్గా ప్రయత్నించేవాడు. మనుషుల్ని, వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఒడిసి పట్టుకోవటమంటే అన్షుమ్‌కి బాగా ఇష్టం. అవి వాళ్ళూ ఇష్టపడేలా ఉంటాయంటాడు. వాళ్ళను మరింత అందంగా తీర్చిదిద్దటంలో ఆనందం వెతుక్కుంటారు అన్షుమ్.

“మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనలో లోపాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇతరులు చూసేటప్పుడు మాత్రం మొత్తంగా చూస్తారు. చాలామంది నన్నడుగుతుంటారు. సన్నగా కనబడేట్టు ఫొటో తీయమని, కళ్ళకింద ఉబ్బులు తగ్గించమని, తెల్లగా ఉండేట్టు తీయమని. కానీ నాకసలు వాళ్లలో ఆ లోపాలే కనబడవు. వాళ్ళక్కూడా తెలియకుండానే నేను తీసిన ఫొటో చూసి వావ్ అని ఆశ్చర్యపోయినవాళ్ళే అందరూ.” అంటాడు అన్షుమ్. 

దీన్ని ఒక ఉపాధిగా మార్చుకోవచ్చునని అనుకోగానే కమర్షియల్ అసైన్‌మెంట్స్ తీసుకున్నాడు. అప్పటిదాకా సరదాగా చేస్తున్న పనికి డబ్బు తీసుకోవటమంటే అంత సులభం కాదు. కానీ ఒక మిత్రుడే సాయం చేశాడు. అప్పటినుంచి ఇక ఆర్డర్ల వరద మొదలైంది.

image


ఫొటోగ్రఫీ కెరీర్ గురించి ఆలోచించుకుని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయంటాడు. ఈ కెరీర్‌ని కాస్త ముందే మొదలుపెట్టి ఉంటే బాగుండేదని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. అప్పుడైతే ఇంత పోటీ ఉండేది కాదు గాబట్టి సులభంగా ముందుకెళ్ళటం సాధ్యమై ఉండేదని వివరిస్తారు. నాలుగేళ్ళుగా చాలా వేగంగా దూసుకు వచ్చిన అన్షుమ్, ఇప్పుడు వచ్చే వాళ్ళు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి చాలా కష్టమంటున్నాడు.

వేలాది మంది కొత్తవాళ్ళను కలుసుకోవటం ఎంతో సంతృప్తినిచ్చిందని, 9 నుంచి 5 దాకా పనిచేసే ఉద్యోగం నుంచి తనకు తానే బాస్‌గా ఉంటూ నిర్ణయాలు తీసుకునే అవకాశం, పనివేళల్లో మార్పులకు అవకాశం చాలా అనువుగా ఉందన్నది అన్షుమ్ అభిప్రాయం. ఆ విధంగా వృత్తిలో ఆయనకు చాలా ఆనందం మిగులుతోంది. సమకాలీనంగా ఉండటం ఆయనకిష్టం. అందుకే సరికొత్త ధోరణులకు పెద్దపీట వేస్తారు. 

ఇప్పుడు అతని దృష్టంతా కంటెంపరరీ వెడ్డింగ్ ఫొటోగ్రపీ మీదనే. కానీ పెళ్ళిళ్ళు అనేవి భారతదేశంలో సీజనల్‌గా జరుగుతాయి. అందుకే సీజన్ లేనప్పుడే ఇతర ప్రాజెక్టులు ఒప్పుకుంటాడు. ఏటా ఎంతలేదన్నా 800 నుంచి 1200 మంది సంప్రదిస్తారు. ఎక్కువగా వెడ్డింగ్ ప్రాజెక్టులే. కానీ క్రియేటివ్ గా పనిచేసే రంగంలో ఏ స్టార్టప్ కంపెనీ అయినా ఇలాంటి సంఖ్యాబలం మీద ఆధారపడకూడదు. నాణ్యత, స్థిరత్వం అనేవి మాత్రమే ముఖ్యమని నమ్ముతాడు కాబట్టే ఏటా 60 నుంచి 90 ప్రాజెక్టులే ఒప్పుకుంటాడు. అంటే నెలకు సగటున 5 నుంచి 7 గురు క్లయింట్స్ అన్నమాట.

image


ఎ ఎం ఫొటోగ్రఫీ ప్రస్తుతం పూణె కేంద్రంగా పనిచేస్తోంది. మార్కెటింగ్ ఆఫీస్ ముంబయిలో ఉంది. ముగ్గురు ఫుల్‌టైం ఉద్యోగులున్నారు. వాళ్ళు ప్రధానంగా ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్, వెబ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ లాంటివి చూసుకుంటారు. వీళ్ళు కాకుండా మరో 9 మంది పార్ట్‌టైం ఉద్యోగులున్నారు. వాళ్లంతా ఫొటోగ్రాఫర్లూ, ఫిల్మ్ మేకర్లూ. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్నమార్కెట్లకూ విస్తరించాలన్నది 2015 లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కడ సంప్రదాయబద్ధమైన, చాలా విలాసవంతమైన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని తేలటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అలాంటి చోట్ల భిన్నమైన ఆచారాలూ, సంస్కృతులూ కనబడతాయి కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉంటుందంటాడు అన్షుమ్. ముందు ముందు విదేశాల్లో భారతీయ వివాహాలనూ దృష్టిలో పెట్టుకొని తన బ్రాండ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు.

“నా వెడ్డింగ్ ఫొటోగ్రఫీ మీద టోనీ హాఫర్, శామ్ హర్డ్, బ్రెనిజెర్ లాంటి పాశ్చాత్య ఫొటోగ్రాఫర్ల ప్రభావం ఉంది. వాళ్ళ ఫొటోల నుంచి స్ఫూర్తి పొందాలన్నది నా లక్ష్యం. ఫొటోగ్రఫీ రంగంలో దేవుడి లాంటి స్థాయి పొందిన చేజ్ జార్విస్, జో మెక్ నల్లీ పనుల్నీ బాగా పరిశీలిస్తుంటా. భారత్‌లో అయితే, ప్రవీణ్ తలాన్, తరుణ్ ఖివాల్, అతుల్ కస్బేకర్ ఆదర్శం. పెద్దవాళ్ళ సంగతలా ఉంచితే, చుట్టూ ఉన్న మామూలు ప్రజలనుంచి చాలా స్ఫూర్తి పొందుతా. వాళ్ళంతా నా జీవితంలో భాగం. వాళ్ళకిష్టమైన పనిచేయటానికి అన్ని బంధాలూ తెంచుకునే వాళ్ళంటే వల్లమాలిన అభిమానం” అంటాడు

image


కమర్షియల్ సినిమాలో ప్రవేశించే ఆలోచన లేకపోయినా, ఈ మధ్యనే వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ డాక్యుమెంటరీలు తీయటం మొదలుపెట్టారు. నిజానికి కమర్షియల్ ఫొటోగ్రఫీ మొదలుపెట్టటానికి ముందే ఫొటోగ్రఫీ నేర్పటం ఆరంభించాడు కాబట్టి వర్క్ షాపుల ద్వారా కొత్త టాలెంట్ ని వెతుకుతూనే ఉంటాడు. కానీ ఇప్పుడున్న పని వత్తిడిలో ఎక్కువ సమయం బోధనకు కేటాయించలేకపోతున్నానంటాడు అన్షుమ్. అందుకే వీలైనప్పుడు మాత్రమే వర్క్ షాప్స్ పెట్టటం కంటే ఒక పర్మనెంట్ వ్యవస్థలా ఫొటోగ్రఫీ స్కూల్ స్థాపించాలన్న ఆలోచనకూడా ఉంది అన్షుమ్ కి.