పదేళ్ల పిల్లాడి ఆలోచనే ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోంది

పదేళ్ల వయస్సులోనే సామాజిక సేవ...ఆ వయస్సు నుంచి ఎన్.జి.ఓ. ఆలోచన...హెచ్.ఐ.వి. రోగుల పాలిట వరం HIVE...

పదేళ్ల పిల్లాడి ఆలోచనే ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోంది

Sunday April 12, 2015,

5 min Read

దాదాపు పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఓ పార్క్ లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో వారు మరో బాలుడ్ని చూశారు. ఆ పిల్లవాడు కూడా సుమారు వీళ్ల వయసువాడే. కానీ ఒళ్లంతా మురికి పట్టి ఉంది. సరైన బట్టలు లేవు. ఉన్న కొద్దిపాటి బట్టలూ కూడా చిరిగిపోయాయి. తిండి తిని ఎన్నిరోజులైందో అన్నట్లు దీనస్థితిలో ఉన్నాడు. ఆ బాలుడ్ని చూడగానే ఆడుకుంటున్న ఈ పిల్లలిద్దరికీ జాలేసింది. బాధ కలిగింది. ఆ జాలి, బాధలో నుంచి ఓ ఆలోచన పుట్టింది. ఆ పిల్లవాడికి ఎలాగైనా ఏదైనా సహాయం చేయాలనుకున్నారు. వెంటనే తమ వద్దనున్న కొద్దిపాటి డబ్బుని బయటకు తీశారు. ఆ పిల్లాడిని దగ్గరలోని ఓ హోటల్ కి తీసుకెళ్లి ఆహారం తినిపించారు. ఫుట్ బాల్ ఆడుకుంటున్న ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు నితయ్ దాస్ ముఖర్జీ. పైన చెప్పిన ఆ సంఘటనే ఆయనకు భవిష్యత్తులో ఓ ఎన్జీఓ స్థాపనకు బీజం వేసింది. అదే హైవ్ (హెచ్ఐవీఈ) ఇండియా. అలా ప్రారంభమైన ఆ ఎన్జీఓ… కోల్ కతాలో ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరిగినా పిల్లల, బాధితుల సంరక్షణకు ముందుంటుంది.

డా. రాకేష్ అగర్వాల్ (ఫుట్ బాల్ ఆడుకుంటున్న రెండో పిల్లవాడు, మరణించారు), నితయ్ దాస్ ల కలలకు ప్రతిరూపం... హైవ్ ఇండియా. 15 మంది సభ్యుల బృందంతో కలసి కోల్ కతాలోని 79 పోలీస్ స్టేషన్లు, ఇతర కార్యాలయాలు, ఎన్జీఓలు, నగర, రాష్ట్ర పోలీసు వ్యవస్థ, బాల నేరస్థుల పోలీసు స్టేషన్లు, విపత్తు నిర్వహణ బృందం, విమెన్ గ్రీవెన్స్ సెల్, బాలల సంరక్షణ కమిటీ, అగ్నిమాపక శాఖ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ హైవ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన హైవ్ కార్యకలాపాలు, లక్ష్యాలు, విజయాలు వంటి వివరాలను యువర్ స్టోరీ పాఠకులకు అందించడానికి మేం నితయ్ దాస్ ని కలిశాం. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... మీకోసం...

నితయ్ దాస్ ముఖర్జీ

నితయ్ దాస్ ముఖర్జీ


" మా నాన్న ఓ సామాజిక కార్యకర్త. నాకు సమాజంపై ప్రేమ కలగడానికి, సమాజం కోసం, పిల్లలకోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన రావడానికి మూలం మా నాన్న నడిచిన బాటే. ఆయనను ఆదర్శంగా తీసుకునే ఇదంతా చేయగలుగుతున్నాను. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహుల సూక్తులు నాకు నా పనిలో ఎంతో స్ఫూర్తినిస్తాయి. 'యువతా మేలుకో, లక్ష్యాన్ని సాధించేవరకూ నీ పయనం ఆపొద్దు'... అనే వివేకానందుడి మాటలు నా మదిలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.

నేనేమీ మొదటి నుంచీ ఈ రకమైన కార్యక్రమాల్లో లేను. డిగ్రీ పూర్తి చేసేవరకూ నేనూ మామూలు వ్యక్తిగానే ఉన్నాను. ఎక్కడైనా, ఏదైనా, ఎవరికైనా సహాయం కావాలంటే స్వచ్ఛందంగా చేసేవాడిని... అంతే. 1989-90 మధ్యకాలంలో ఓ చిన్న సంస్థను ప్రారంభించాను. అప్పుడు మాకు ఒక పాత ఆంబులెన్స్ ఉండేది. దాంతోనే ఎలాగోలా కష్టపడి రోడ్లపై ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నించేవాణ్ని.

ఆ సమయంలోనే నాకు డాక్టర్ సమీర్ చౌదరితో పరిచయమైంది. డాక్టర్ సమీర్ సిని (CINI - చైల్డ్ ఇన్ నీడ్ ఇండియా) సంస్థ వ్యవస్థాపకులు. నేను చేస్తున్న పనులను తెలుసుకున్న సమీర్ నన్ను ఎంతగానో అభినందించారు, ప్రోత్సహించారు. వారి సహాయంతో చిన్న క్లినిక్ ప్రారంభించాను. ఆ క్లినిక్ కార్యకలాపాలు చూసుకోవడంతోనే రోజంతా గడిచిపోయేది. కొద్దిరోజులు బాగానే గడిచాయి. తర్వాత సిని నుంచి మాకు సహకారం ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా మా సేవా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. దాదాపు సంవత్సరన్నర పాటు ఇదే పరిస్థితి. మళ్లీ ఎలాగైనా హైవ్ ఇండియాను ప్రారంభించాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. ఐర్లాండ్ లోని హోప్ ఫౌండేషన్ సహకారంతో 1999లో ఆ పని చేయగలిగాం. నాకు ఎప్పుడూ ఒకటే లక్ష్యం. అది హైవ్ ద్వారా ఎంత ఎక్కువ మంది పిల్లలను రెస్క్యూ చేయగలమో అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు చేయూతనందించడానికి కృషి చేయడమే.

రాత్రి పూట రెస్క్యూ

రాత్రి పూట రెస్క్యూ


హైవ్ ప్రధాన లక్ష్యాలు, సిద్ధాంతాలు

ఓసారి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మేం మా బృందంతో కలసి దాదాపు 500 కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగాం, వైద్యసహాయం అందించాం, పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలిగాం. తర్వాత కూడా వారానికి ఓ రోజు ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించాం.

  • పిల్లల రక్షణ – ఇది మా కార్యకలాపాల్లో ప్రముఖమైన అంశం. దీనికే మేం అధిక ప్రాధాన్యమిస్తున్నాం. దీనికోసం పోలీసులతో గానీ, మరే ఇతర వ్యవస్థతో గానీ మాకెలాంటి రాతపూర్వక అవగాహనా లేదు. కానీ మేం వారితో, వారు మాతో సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూ, సమన్వయంతో పనిచేస్తున్నాం.
  • మనుషుల (మహిళల) అక్రమ రవాణా... దీన్ని అరికట్టడానికి మేం చేయని ప్రయత్నమంటూ లేదు. దీన్ని నివారించాలంటే ముందుగా ప్రజల్లో అవగాహన, చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో శ్రమించాం. ఆ పయనంలో ఎందరో మహిళలను, పిల్లలను రక్షించగలిగాం. ఇవి ఎంతో ఆత్మసంతృప్తిని కలిగించే అంశాలు.
  • అత్యవసర సహాయం (ఎమర్జెన్సీ రెస్క్యూ)... హైవ్ ఇండియా కర్తవ్యాల్లో ఇదే ప్రధానమైన అంశం. రోజులో 24 గంటలూ అంటే నిరంతరం మా బృందం అత్యవసర పరిస్థితుల్లో తగిన సహాయం అందించడానికి సదా సంసిద్ధంగా ఉంటుంది. వివిధ రకాల ఏజెన్సీల సమన్వయంతో మేం ఈ విధులని అత్యంత చాకచక్యంతో, ఓర్పుతో నిర్వహించగలుగుతున్నాం. రోడ్లపై పిచ్చి పట్టినట్లు తిరిగే మానసిక వికలాంగులని కూడా పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆదుకోగలుగుతున్నాం. రాత్రి వేళల్లో మహిళల రక్షణకోసం త్వరలో ఓ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేయబోతున్నాం. ఇది కోల్ కతా పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనేది మా నమ్మకం.

ఇవన్నీ చేయాలంటే ఎన్నో నిధులు కావాలి. ఇది ఎవరో ఒక వ్యక్తితో సాధ్యమయ్యేది కాదు. హోప్ ఫౌండేషన్... మాకు అందే ఆర్థిక సాయంలో ప్రధాన భాగం ఇక్కడి నుంచే వస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఎందరో పౌరులు కూడా వ్యక్తిగతంగా ఎన్నో విరాళాలు అందిస్తున్నారు. అయితే, మంచి పనులు చేయాలనుకునే అందరిలాగే మేం కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సామాజిక కార్యకలాపాల్లో విజయం సాధించాలంటే ముందుగా అక్కడి స్థానికుల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలి. అది లేకపోతే మనం ఏం చేసినా నిరుపయోగమే. వారి తోడ్పాటు లేకపోతే ఏమీ చేయలేం. మేం చేసిన పనులు, మా బృందం సత్ప్రవర్తన కారణంగా ... ఈ నమ్మకాన్ని సాధించడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. 

  • మరో సవాల్... కోల్ కతా లాంటి ఓ పెద్ద నగరంలో మా కార్యకలాపాల నిర్వహణ. అంత పెద్ద నగరంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఓ ఎత్తయితే... అక్కడికి చేరుకోవడం మరో ప్రహసనం. ఈ సవాల్ ను అధిగమించడంలో మాకు ఎన్నో సంస్థలు సహాయపడుతున్నాయి. సుమారు రెండు, మూడేళ్ల కష్టం ఫలితం... ఈరోజు మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. మొదట్లో మాకు సాయం చేయడానికి ఎవరూ ముందుకువచ్చేవారు కాదు. క్రమంగా అందరూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులతో సమన్వయం విషయంలో బాగా ఇబ్బందులు ఎదురయ్యేవి. మేం తీసుకొచ్చిన బాధితులకు చికిత్స అందించడానికి వారి నుంచి ఎప్పుడూ నిరాకరణే. డాక్టర్లను ఒప్పించడానికి చాలా కష్టపడేవాళ్లం. కొద్ది రోజులు వారితో ఉండి ఆస్పత్రుల్లో చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాం. ఆ విధంగా వారి నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నించాం. ఒక్కోసారి వారిని ఒప్పించడానికి రోజంతా అక్కడే గడిపిన సందర్భాలున్నాయి.

మేం కాపాడిన వారిలో ఎక్కువ మంది మిస్సింగ్ కేసులు నమోదైన వారే. కిడ్నాపులు, ఇంటినుంచి పారిపోయినవారు, తప్పిపోయినవారు, మానసిక స్థితి బాగోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నవారు... ఇలాంటి వారే వీరిలో అధికంగా ఉంటారు. ఇలాంటి వారికి సంబంధించి మా దగ్గరున్న సమాచారాన్ని పోలీసు శాఖతో పంచుకుని, వారితో కలిసి మేం పనిచేస్తున్నాం.

ఐదేళ్ల క్రితం దుర్గాపూజ సమయంలో కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పారిపోయిన ఓ బాలికను మేం కాపాడాం. కానీ పోలీసులంతా దుర్గా పూజా మండపాల రక్షణ, శాంతి భద్రతల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. దాంతో ఆ బాలికను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఈ సంఘటన మాకో గుణపాఠాన్ని నేర్పింది. మాకు మేమే కొంతమంది వాలంటీర్లను నియమించుకున్నాం. ఎవరైనా పిల్లలు దొరికినప్పుడు వెంటనే అవసరమైన ప్రథమ చికిత్స చేయడం, సిద్ధంగా ఉంచుకున్న బట్టలు, దుప్పట్లు, కొన్ని బొమ్మలు వంటివి ఇవ్వడం... ఈ వాలంటీర్ల బాధ్యత. ఈ వాలంటీర్లంతా పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు.

సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారెవరికైనా నేను చెప్పేది ఒకటే... సామాజిక సేవ అంటే ఏదో పేరు కోసం చేసేది కాదు. అదో బాధ్యత. అందులో లభించే తృప్తి మరెక్కడా దొరకదు. అంకితభావం, ఓర్పుతో పనిచేస్తేనే ఆ ఆనందాన్ని మనం అనుభవించగలం. వ్యక్తిగా ఇందులో మనం విజయం సాధించలేం. మన చుట్టూ ఉన్నవారిని కలుపుకునిపోవాలి. ప్రభుత్వాధికారులు, పోలీసులు... ఇలా అందరినీ భాగస్వాములను చేయాలి.
హైవ్ కార్యక్రమాలకు

హైవ్ కార్యక్రమాలకు


చూశాం కదా... హైవ్ కృషి. మరి మీరేమంటారు? రండి... మీకు తోచిన, చేయగలిగిన రీతిలో సహాయం చేయండి. ఎందరో అభాగ్యులు చేయందించేవారికోసం ఎదురుచూస్తున్నారు. కమాన్.