బాహుబలికే బాబులాంటి వాడు..!! ఐదు దశాబ్దాలపాటు కుస్తీ సామ్రాజ్యాన్నిఏలిన కండల వీరుడి స్ఫూర్తి గాథ !!

0

ఇప్పుడంటే సిక్స్ ప్యాక్.. ఎయిట్ ప్యాక్‌ వచ్చింది గానీ వందేళ్ల క్రితమే- కొండలు పిండిచేసే ఓ కండరగండడు కుస్తీ పోటీల్లో ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి బాబులాంటి వాడు- మల్లయుద్ధంలో తిరుగులేని జగజ్జేతగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు. ఐదు దశాబ్దాలపాటు లిజెండరీ ఛాంపియన్‌. అందరూ గ్రేట్ గామా అంటారు. గామా పహిల్వాన్ అని కూడా పిలుచుకుంటారు. అసలు పేరు గులాం మహమద్.

గామా పహిల్వాన్. యాభై ఏళ్లకు పైగా కుస్తీ సామ్రాజ్యాన్ని ఏలిన కండలవీరుడు. ఒకరో ఇద్దరో కాదు. యావత్ ప్రపంచం ఒప్పుకుంటుందీ మాట. బ్రూస్‌ లీ ఎప్పుడూ చెప్తుంటాడు గామా పహిల్వానే నాకు స్ఫూర్తి అని. 1878లో అమృత్‌ సర్‌ లో జన్మించిన గామా 1910లోనే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ అందుకున్న మేటి బలశాలి. జీవితంలో అతనికి ఓటమి అన్నదే తెలియంటే అతిశయోక్తి కాదు.

ఈకాలం వెయిట్‌ లిఫ్టర్లు ఎలా వుంటారంటే.. ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి, ముక్కీమూలిగీ వంద కిలోలు ఎత్తి- అదే పెద్దగొప్ప అని విర్రవీగుతుంటారు. కానీ గామా పహిల్వాన్ అలాకాదు. 22 ఏళ్ల వయసులోనే ఏ ప్రాక్టీసూ లేకుండా ఏకంగా 1200 కిలోల బరువున్న రాయిని అవలీలగా ఎత్తి అవతల పడేశాడు. ఆ దృశ్యం చూసిన వారందరి ఊపిరి కాసేపు ఆగిపోయింది. ఇది 1902 నాటి సంగతి. ఇప్పుడా రాయి బరోడాలోని శాయాజీబగ్‌ మ్యూజియంలో ఉంది.

గామా చేసే కసరత్తు అంత ఆషామాషీగా ఉండదు. రోజుకి ఐదువేల స్క్వాట్స్, మూడువేల పుషప్స్ ఏకబిగిన చేస్తాడు. డైలీ పది లీటర్ల పాలు తాగుతాడు. ఆరు నాటుకోళ్లు లాగించేస్తాడు. ఒకటిన్నర పౌండ్ల బాదాం పప్పు పేస్టుని ఏదో ఒక జ్యూస్‌లో కలుపుకుని తాగుతాడు.

పదేళ్ల వయసులోనే గెలుపు రుచేంటో తెలిసింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతీ పోటీలో ప్రత్యర్ధికి చుక్కలు చూపించడమే! పెద్దగా పొడగరేం కాదు. ఐదడుగుల ఏడంగుళాలు. కొందరు అతని హైట్ మీద జోకులు కూడా వేసేవారు. కానీ గామా అవేం పట్టించుకునేవాడు కాదు.

ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచంలోనే గామా పహిల్వాన్‌ కు సాటిలేరు పోటీ లేరు. అప్పటికే వరల్డ్ ఛాంపియన్లయిన స్టానిస్లాస్, ఫ్రాంక్‌ గోచ్‌, బెంజమిన్ రోలర్ లాంటి హేమాహేమీలను మట్టికరిపించాడు. ఒక్కోసారి రింగులో దిగిన కొద్ది నిమిషాల్లోనే ప్రత్యర్ధిని ఓడించేవాడు. ఇంకొన్నిసార్లయితే నిమిషం కూడా పట్టకపోయేది. అలా ఉండేది ఫైటింగ్. బ్రూస్ లీ సహా ఎందరో రెజ్లర్లకు గామా పహిల్వానే స్ఫూర్తి. ముఖ్యంగా పుష్ అప్ కి సంబంధించిన క్యాట్ స్ట్రెచ్‌, బైఠక్స్ లాంటివి గామా నుంచే నేర్చుకున్నాను అనేవాడు బ్రూస్ లీ !

1947 తర్వాత గామా పహిల్వాన్ కుటుంబం పాకిస్తాన్ వెళ్లిపోయింది. 1952 వరకు అతడి విజయ పరంపర కొనసాగింది. 1960లో ఉబ్బసం, గుండె సంబంధితవ్యాధితో పహిల్వాన్ తుది శ్వాస విడిచాడు.

ఇలాంటి లిజెండరీ స్పోర్ట్స్‌ మెన్ చరిత్ర దొంతరలో ఎక్కడో అట్టడుగున ఉండొద్దు. ఫర్‌గాటెన్ హీరోలా మరుగున పడొద్దు. అందుకే గామా పహిల్వాన్ జీవిత కథ ఆధారంగా వెండితెరపై బయోపిక్ ఆవిష్కరించాలని డైరెక్టర్ పర్మీత్ సేథీ ముందుకొచ్చారు. లీడ్ రోల్ కోసం జాన్ అబ్రహంని అనుకున్నారు.

Related Stories

Stories by HIMA JWALA