చీకటి బతుకుల్లో వెలుగు దివ్వె సునీతా కృష్ణన్

అత్యాచారాల బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న సామాజిక ఉద్యమకారిణి 

చీకటి బతుకుల్లో వెలుగు దివ్వె సునీతా కృష్ణన్

Friday May 27, 2016,

10 min Read


ఆ అమ్మాయి వయసు అప్పటికి 16ఏళ్లు. కానీ తన వయసు వారి కన్నా ఎంతో ఎక్కువ మెచ్యురిటీతో వ్యవహరించేది. సాధారణ టీనేజ్ అమ్మాయిల్లా కాకుండే ఆమె ఆలోచనలు, కలలు, లక్ష్యాలు భిన్నంగా ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్లొచ్చాక సాయంత్రం వేశ్యావాటికలకు వెళ్లి అక్కడ వారు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసేది. అవకాశం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడేది. నిత్యం, హింస, దోపిడీ, అవమానం, అత్యాచారాలకు బలవుతున్న అమ్మాయిలు మహిళల పరిస్థితి చూసి ఆమె హృదయం ద్రవించేది. వారిని ఆ రొంపి నుంచి బయట పడేయాలని, దుర్మార్గుల చెర నుంచి రక్షించే ప్రయత్నం చేసేది. బ్రోతల్ హౌస్ నడిపే మహిళల్ని కలిసి అక్కడున్న అమ్మాయిల్ని వదిలిపెట్టమని వేడుకునేది. కానీ వ్యభిచార కొంపలు నడిపేవారు ఆమెను బండబూతులు తిట్టేవారు. అక్కడితో ఆగకుండా మెడపట్టి బయటకు గెంటేసేవారు. అయినా ఆమె మాత్రం ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండేది. ఇలా నిత్యం శారీరక హింసకు, దోపిడీకి గురవుతున్న అమ్మాయిలు, మహిళల్ని కాపాడేందుకు నడుం బిగించిన ఆ 16 ఏళ్ల అమ్మాయి మరెవరో కాదు.. సునీతా కృష్ణన్.

ఒకరోజు ఎప్పటిలాగే బెంగళూరులోని ఓ వ్యభిచార గృహానికి వెళ్లింది. తిట్లు తప్పవని అయినా ఓసారి ప్రయత్నిస్తే తప్పులేదుగా అనుకుని లోపల అడుగుపెట్టింది. అయితే అక్కడ తాను ఊహించినట్లు ఏమీ జరగలేదు. వ్యభిచార గృహం నడిపి వ్యక్తి అక్కడున్న ఓ అమ్మాయిని చూపించాడు. ఆమె వయసు 12-13ఏళ్లు ఉంటుంది. ఆ అమ్మాయిని చూపించిన నిర్వాహకుడు సునీతకు ఓ సవాల్ విసిరాడు. తనకు చేతనైతే ముందు ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లమన్నాడు. 12ఏళ్ల అమ్మాయిని చూసి సునీతకు జాలేసింది. ఎలాగైనా తనకు విముక్తి కల్పించాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ అమ్మాయిని గమనించడం మొదలుపెట్టింది. తన మానసిక పరిస్థితి సరిగాలేదన్న విషయం సునీతకు తొందరగానే అర్థమైంది. అందుకే అక్కడున్న మిగతా వేశ్యలు కూడా ముందు ఆ అమ్మాయిని ఎందుకు రక్షించమన్నారో అర్థమైంది.

12 ఏళ్ల ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్న సునీత కృష్ణన్- ఆమె చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయింది. మంచీ చెడూ తెలియని ఆ అమాయకురానికి కూడా కామాంధులు వదలడం లేదన్న విషయం అర్థమైంది. కుర్రాళ్లు, ముసలాళ్లన్న తేడా లేదు. అందరూ ఆ అమ్మాయిని వాడుకుంటూ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కోరిక తీర్చుకున్న తర్వాత ఆ అమ్మాయి జాకెట్లో ఐదో పదో పెట్టి వెళ్లేవారు. నోటును చేతిలోకి తీసుకున్న అమ్మాయికి అసలు అది ఎందుకిచ్చారో, దాన్ని ఏం చేయాలో అర్థమయ్యేదికాదు. ఆ నోటును అలా చూస్తూ ఉండిపోయేది.

image


బుద్ధిమాంద్యంతో ఉన్న ఆ అమ్మాయి కష్టం చూసి సునీత మనసు ద్రవించిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లకు విముక్తి కల్పించాలని భావించింది. ఆ అమ్మాయికి సరిగా మాటలు రావు. దాంతో ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాలేదు. అయినా సునీత వదల్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి లాంటి డిజార్డర్ ఉన్నవాళ్లతో కలిసి పనిచేసింది. ఆ అనుభవంతో ఆ అమ్మాయి చెప్పిన వివరాల ఆధారంగా తన ఊరి గురించి తెలుసుకుంది. ఇంకేముంది ఆ అమ్మాయిని వారి చెంతకు చేర్చే ప్రయత్నం మొదలుపెట్టింది. సునీత తండ్రి ఆఫీసులో పనిచేసే ఓ సీనియర్ ఆఫీసర్ ను కలిసి ఓ కారు ఏర్పాటు చేయమని కోరింది. ఆమెపై ఉన్న అభిమానంతో ఆయన కారు ఏర్పాటు చేశారు. దాంట్లో బ్రోతల్ హౌస్ కు వెళ్లేసరికి అక్కడ 12ఏళ్ల అమ్మాయితో పాటు మరో నలుగురు కారులో కూర్చున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆ అమ్మాయిని తన కుటుంబసభ్యులకు జాగ్రత్తగా అప్పజెప్పే ప్రయత్నంలో తమవంతు సాయం చేసేందుకు వారంతా సునీతతో బయలుదేరారు. వాళ్లలో వచ్చిన మార్పు చూసి సునీత ఆశ్చర్యపోయింది.

ఆ అమ్మాయి ఊరెళ్లాక తన గురించి తెలిసిన విషయాలు విని వెళ్లినవారంతా ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి తండ్రి పెద్ద జమిందారు. కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఓ ప్రమాదంతో ఆయనతో పాటు భార్య కూడా చనిపోవడంతో బంధువులు ఆస్తిపై కన్నేశారు. దాన్ని కాజేసేందుకు అమ్మాయిని హైవేపై వదలేసి చేతులు దులుపుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అమ్మాయిని బెంగళూరు తీసుకెళ్లి వ్యభిచార గృహంలో అమ్మేశాడు.

ఇదంతా తెలుసుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్న సునీత తన వెంట వచ్చిన మిగిలిన నలుగురితో కలిసి వెళ్లి గ్రామ పంచాయితీ సాయం కోరారు. ఇందుకోసం ఎన్నో విషయాలు దాచిపెట్టారు. బుద్దిమాంద్యం గల ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఓ వేశ్యావాటికలో ఉందనే విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ అమ్మాయి ఇన్ని రోజులు తన ఇంట్లోనే ఉందని ఇన్నాళ్లకు ఊరి పేరు చెప్పడంతో తీసుకొచ్చామని అబద్దం చెప్పింది. ఒకప్పుడు తనను బండబూతులు తిట్టిన వేశ్యలు ఆ అమ్మాయి కోసం ఇప్పుడు తనతో కలిసి నాటకమాడటం సునీతకు సంతోషం కలిగించింది. పంచాయితీ పెద్దల జోక్యంతో ఆ అమ్మాయికి న్యాయం దొరికింది. అలా ఓ అమ్మాయికి విముక్తి కల్పించే ప్రయత్నంలో సునీత కృష్ణన్ తొలి విజయం సాధించింది. ఈ ఘటనతో ఆమెలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న వేలాది మంది అమ్మాయిలు, మహిళలకు విముక్తి కల్పించేందుకు ఓ ఉద్యమమే మొదలుపెట్టింది.

image


ఇదంతా చదివాక అసలు 16 ఏళ్ల సునీత వ్యభిచార గృహాలకు ఎందుకు వెళ్లేదన్న సందేహం కలగడం సహజం. అయితే దాని వెనుక పెద్ద కారణమే ఉంది. సునీత కృష్ణన్ కూడా అత్యాచార బాధితురాలే. 15 ఏళ్ల వయసులో సునీతపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పట్లో సునీత ఊరిలో దళితుల సాధికారత కోసం ప్రయత్నిస్తోంది. పేద, వెనకబడిన, నిరక్ష్యురాస్యులైన దళితులు ఎదుర్కొనే అవమానాలు, దుర్భర జీవితాన్ని చూసి చలించిపోయింది. వారి పిల్లలకు చదువునేర్పి వారి తలరాత మార్చాలని నిర్ణయించుకుంది. అంత చిన్న వయసులోనే దళితుల అధికారాల గురించి వారిలో అవగాహ కల్పించే ప్రయత్నం చేసింది. అయితే సునీత చేస్తున్న ప్రయత్నం అగ్రవర్ణాల వారికి నచ్చలేదు. ఆమె వారి కంటిలో నలుసులా మారింది. దళితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని, లేకపోతే పర్యవసానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సునీత ఆ హెచ్చరికల్ని లెక్క చేయలేదు. తన ప్రయత్నం కొనసాగించింది. ఫలితం ఓ రోజు చిమ్మచీకట్లో కొందరు వ్యక్తులు సునీతపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఎనిమిది మంది ఆమెపై సామూహిత అత్యాచారం చేశారు.

“అత్యాచార ఘటనతో జీవితమే మారిపోయింది. అంతకు ముందు అందరి దృష్టిలో బెస్ట్‌ అయిన నేను ఒక్క రోజులోనే వరస్ట్‌ అయిపోయాను. ఎవరెస్ట్‌ శిఖరాగ్రానికి చేరుకున్న నన్ను వెనక నుంచి ఎవరో నెట్టేయడంతో ఒక్కసారిగా నేలపై పడ్డట్లనిపించింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే అత్యాచారం చేసిన వారిపై గ్రామ పంచాయితీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఘటను నన్నే బాధ్యురాలిని చేశారు. తప్పంతా నాదే”-సునీత కృష్ణన్.
image


అత్యాచార ఘటనతో ఒక్క రోజులోనే అంతా తలకిందులైంది. అమ్మానాన్నల ముద్దుల బిడ్డయిన సునీతకు రోజుకో అవమానం ఎదురయ్యేది. ఒకప్పుడు తనను పొగిడిన పేరెంట్స్, బంధువులే కోప్పడ్డారు. సునీత చేసే పనులు వారికి తప్పుగా అనిపించాయి. గతంలో పొగిడిన వాళ్లు ఇప్పుడు ప్రతి విషయాన్ని తప్పుబట్టడం మొదలుపెట్టారు. అయినా సునీత నిరాశ చెందలేదు. ఆశ వదలుకోలేదు. సాహసమే ఊపిరిగా ముందుకు సాగింది.

గ్యాంగ్ రేప్ జరిగిన కొన్ని రోజులకు సునీత కృష్ణన్ ఓ నిర్ణయానికొచ్చింది. తనలా అత్యాచారానికి గురైన వారిని కలిసి వారి కష్టాలు బాధలు తెలుసుకోవాలనుకుంది. అప్పటి నుంచి వ్యభిచార గృహాలకు వెళ్లి, అక్కడి బాధితుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం మొదలుపెట్టింది. వ్యభిచార గృహాల్లో యువతులు పడుతున్న కష్టాలు చూశాక వారి బాధ ముందు అసలు తనది బాధే కాదనిపించింది. తాను ఒక్కసారి మాత్రమే అత్యాచారానికి గురైంది. కానీ ఆ అమ్మాయిలపై రోజూ రేప్ జరుగుతోంది. ఎంతో మంది వ్యక్తులు బలవంతంగా వారిని అనుభవిస్తున్నారని అర్థమైంది. అలాంటి వారికి విముక్తి కల్పించి పునరావాసం కల్పించడమే తన లక్ష్యంగా మార్చుకుంది సునీత కృష్ణన్.

సునీతకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయడమంటే ఇష్టం. 8 ఏళ్ల వయసులోనే బుద్ధిమాంద్యం గల పిల్లలకు డ్యాన్స్ నేర్పించి వారి ముఖాల్లో కాసేపైనా చిరునవ్వు తెప్పించే ప్రయత్నం చేసింది. అలా చేయడం వల్ల వారిలో కొంతలో కొంత మార్పు వస్తుందన్నది సునీత నమ్మకం. 8ఏళ్ల వయసులోనే బుద్దిమాంద్యం గల పిల్లల కోసం సునీత ఇంతగా తాపత్రయపడడం వెనుక కొన్ని కారణాలున్నాయి.

సునీత కృష్ణన్‌ది దిగువ మధ్యతరగతి కుటుంబం. దారిద్ర్య రేఖకు కొంచెం ఎగువన ఉండేది. తండ్రి సర్వే ఆఫ్‌ ఇండియా ఉద్యోగి. తల్లి నళిని. ఆమె గృహిణి. సునీత రెండో సంతానం. వారి వంశంలో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి సునీత తండ్రి. అందుకే ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందుతరాలన్నీ కడుపు నింపుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకునేవి. సునీతకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు.

సునీత ఈ భూమ్మీదకు వస్తూనే సవాళ్లను మోసుకొచ్చింది. ఆమె పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఒక కాలు వంకరగా ఉండేది. పుట్టిన కొన్ని రోజులకే నాన్నమ్మ కాళ్లు వంకరగా ఉన్న విషయాన్ని గుర్తించింది. దాంతో తొందరగానే ట్రీట్‌ మెంట్‌ ప్రారంభమైంది. చికిత్సలో భాగంగా సునీత ఎప్పుడూ కాలికి పట్టీ కట్టుకోవాల్సి వచ్చేది. తనతోటి వారితో కలిసి ఆడుకోవడం మాట అటుంచితే, నడవడానికి కూడా ఇబ్బందిపడేది.

image


సునీత చిన్నప్పటి నుంచే మిగతా పిల్లల కన్నా భిన్నంగా ఉండేది. నచ్చిన వస్తువు కోసం మారాం చేయడం ఆమెకు తెలియదు. తాను ఎప్పుడూ ఏడ్చేది కాదు. ఇది కావాలి అని అడిగేది కాదు. అందుకే తల్లిదండ్రులే ఆమె అవసరాలు గుర్తించి వాటిని తీర్చేవారు. బయటకెళ్లే అవకాశం లేకపోవడంతో సునీత చదువుపై దృష్టి పెట్టింది. తన ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఏ పోటీలో పాల్గొన్నా గెలుపు ఆమెనే వరించేది. తన వయసు పిల్లల కన్నా ఎక్కువ తెలివితేటలు, లోకజ్ఞానం ఉన్న సునీతకు అంత చిన్న వయసులోనే మంచి – చెడు, తప్పొప్పుల మధ్య వ్యత్యాసం తెలిసేది.

ఇంట్లో ఎవరైనా తప్పుచేస్తే సునీత అస్సలు ఊరుకునేది కాదు. ఇంట్లో పెద్దలకు కూడా తప్పొప్పుల గురించి చెప్పేది. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఆమెకు బాగా తెలుసు. కొన్ని విషయాల్లో పెద్దలకు సలహాలు కూడా ఇచ్చేది. ఈ పెద్దరికం, లోకజ్ఞానం వల్లే ఇంట్లో అందరూ ఆమెను ముసలమ్మ అని ఆటపట్టించేవారు. సునీత తన చెల్లెలితో పాటు తన వయసువారినీ దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేది. ఓసారి బుద్దిమాంద్యం గల పిల్లలను చూసిన సునీకకు వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. ఓవైపు చదువుకుంటూనే వారికి డ్యాన్స్ నేర్పించడం మొదలుపెట్టింది. తనకు డ్యాన్స్ రాదు. కాలు కూడా సరిగ్గా లేదు. అయినా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. డ్యాన్స్ తో ఆ పిల్లల జీవితాల్లో ఆనందం నింపొచ్చన్నదే సునీత ఉద్దేశం.

12 ఏళ్ల వయసు వచ్చేసరికి సునీత కృష్ణన్ ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. దాని ద్వారా మురికివాడల్లో ఉండే పిల్లలకు చదువు నేర్పించేది. అయితే సునీత కృష్ణన్ తండ్రికి బదిలీకావడంతో వాళ్లు విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఓ స్కూల్ లో జాయిన్ అయింది. తాను స్కూల్ కి వెళ్లొచ్చే దారిలో చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా ఆటలాడుతూ కనిపించేవారు. ఆ పిల్లలు చదువు నేర్చుకోకపోతే వారి జీవితాలు కూడా వారి తల్లిదండ్రుల్లాగే మారతాయని.. రెండు పూటల తిండి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సునీతకు అనిపించింది. వాళ్లకు చదువు నేర్పిస్తే మంచి ఉద్యోగాలు వచ్చి వారి జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో వారికోసం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. ఒక చిన్న రూంలో పిల్లలందరినీ చేర్చి వారికి చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఉదయం స్టూడెంట్ గా స్కూల్ కు వెళ్లే సునీత- సాయంత్రం టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు నేర్పేది. సునీత చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ ఆమెను ఎంతో ప్రశంసించారు. ఆమె చేస్తున్న సేవకుగానూ అవార్డు ఇచ్చారు.

“జీవితం దేవుని ప్రసాదం. ఓ సదుద్దేశంతో దేవుడు నన్ను భూమ్మీదకు పంపాడు. కష్టాల్లో ఉన్న వారిని చూడగానే వారికి సాయం చేయాలన్న ఆలోచన వస్తుంది. నాకన్నా ఎక్కువ బాధ, కష్టాలు అనుభవించిన వాళ్ల కోసం వెతుకుతుంటాను. అలాంటి వాళ్లు కనిపించినప్పుడు అవసరమైన సాయం చేస్తాను. ముందుగా ప్లాన్ చేసుకుని పనిచేయడం నాకు తెలియదు. పేదలు, బాధితులు, నిస్సహాయులు ఎదురైనప్పుడూ వారికి సాయం చేసే శక్తి వస్తుంది”- సునీత కృష్ణన్.
image


బాల్యంతో తనను తాను అర్థంచేసుకోవడానికి సునీతం ఎంతో కష్టపడింది. మిగతా పిల్లలకు తనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా తనను తాను సిద్ధంచేసుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. తనలో ఉన్న లోపాలేంటి? మిగతా వారికన్నా ఏ విషయంలో తాను బెటర్ అనే ప్రశ్నలకు సమాధానం దొరికాక సునీత జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టింది.

మహిళలపై అత్యాచారాలు, దోపిడీకి పాల్పడుతున్న నేరస్థులపై పోరాటం మొదలుపెట్టిన సునీత- ఇప్పటి వరకు వేల మంది యువతులు, మహిళలకు వేశ్య వృత్తి నుంచి విముక్తి కల్పించింది. అనేక ప్రాంతాల్లో అనేకమంది చేతుల్లో హింసకు గురవుతున్నా వారిని దుర్మార్గుల చెర నుంచి రక్షించింది. ఇలాంటి నరక కూపాల నుంచి బయటపడిన యువతులు, మహిళల రక్షణ, పునరావాసానికి తన జీవితాన్ని అంకింతం చేసింది సునీత కృష్ణన్. సునీత ప్రయత్నాల వల్ల యువతుల్ని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఎంతో మంది కటకటాలు లెక్కబెడుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆమెకు ఎంతో మంది శత్రువులయ్యారు. సునీత కృష్ణన్ పై ఇప్పటి వరకు 17 సార్లు దాడులు జరిగాయి. కొందరు హత్యాయత్నం చేస్తే... మరికొందరు అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇవేవీ ఆమెపై ప్రభావం చూపలేదు. ఎవరికీ భయపడకుండా యువతుల్ని, మహిళల్ని కాపాడే ప్రయత్నాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు సునీత కృష్ణన్.

హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని తమ సంస్థ ప్రజ్వల ఆఫీసులో యువర్ స్టోరీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీత కృష్ణన్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

తనపై జరిగిన దాడుల గురించి అడిగినప్పుడు..

నాపై ఎలాంటి దాడులు జరగలేదు. ఎందుకంటే నేను వాటిని అసలు దాడులు అనుకోను. నా దృష్టిలో సమాజం చేసేదే పెద్ద దాడి. క్రిమినల్స్ నాపై చేసే దాడుల్ని అవార్డులుగా స్వీకరిస్తారు. వాళ్లు కోపాన్ని నాపై కాకపోతే ఇంకెవరిపై చూపిస్తారు. చేస్తున్న పనికి ఏదో ఒక ఇండికేటర్ కావాలి. ఇండికేటర్ ఉన్నప్పుడే మంచి చేస్తున్నానో లేదో తెలుస్తుంది. ఇలాంటి దాడులు నాకు ఇండికేటర్ లాంటివి. రిపోర్ట్ కార్డుల్లాంటివి. వీటిని చూసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యానన్న ఫీలింగ్ కలుగుతుంది అంటారు సునీత.

అయితే ఈ దాడుల కారణంగా అప్పుడప్పుడూ కొంచెం ఆందోళనకు గురవుతాను అంటారామె. దాడులు చేసేవారి ప్రయత్నం ఫలించి తాను చనిపోతే తన పోరాటాన్ని ఎవరు కొనసాగిస్తారన్నదే ఆమె ఆందోళన. ఏ మంచి పని చేసేందుకైతే తాను భూమ్మీద అడుగుపెట్టిందో అది పూర్తయ్యాక ప్రాణాలు పోయినా పర్వాలేదంటారామె.. అందుకే ఏ పని కోసమైతే భూమ్మీదకు పంపాడో ఆ పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనిమ్మని, జీవిత లక్ష్యం పూర్తయ్యాక తీసుకెళ్లమని సునీత దేవున్ని కోరుకుంటుందట.

ఏ వ్యక్తి కూడా దోపిడీకి గురికావొద్దన్నదే తన లక్ష్యం అంటారు సునీత కృష్ణన్. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే సమాజం ఏర్పడ్డప్పుడే అందరూ సుఖంగా ఉండగలుగుతారన్నది ఆమె ఆలోచన. సమాజంలో తనలాంటి యాక్టివిస్ట్, ప్రజ్వల లాంటి సంస్థల అవసరమే ఉండకూడదన్నది సునీత కృష్ణన్ మాట.

ఇలాంటి సమాజ స్థాపన లక్ష్యం చేరుకోవడం సాధ్యమేనా?

అసంభవం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రపంచాన్ని మనమే తయారుచేసుకున్నాం. మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక మనిషి తాను ఎవరినీ హింసించను అని నిర్ణయించుకుంటే మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయి. హింస, దోపిడీని ఆపడమన్నది కేవలం సునీత కృష్ణన్ ఒక్కదాని పని మాత్రమే కాదు. ఇది అందరి బాధ్యత. అందరూ కలిసికట్టుగా ముందుకొస్తే సురక్షితమైన సమాజాన్ని ఏర్పరచుకోడం పెద్ద కష్టమేం కాదు అంటారు సునీత.

సునీత కృష్ణన్ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆమె పోరాటం మాత్రం ఆపలేదు. ఓటమిని అంగీకరించలేదు. విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉన్నారు. మిస్ వరల్డ్ అందాలపోటీలను అడ్డుకునేందుకు ఇలాంటి పోరాటమే చేశారు సునీత కృష్ణన్.

అది 1996వ సంవత్సరం. బెంగళూరులో మిస్ వరల్డ్ కాంటెస్ట్ నిర్వాహించుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కాంటెస్ట్ ను అడ్డుకునేందుకు సునీత అలుపెరగని పోరాటం చేసింది. కొందరు వ్యక్తులు మహిళల్ని అంగడి సరుకుగా భావిస్తారు. అలాంటి వారే బ్యూటీ కాంటెస్ట్ లు నిర్వహిస్తారన్నది సునీత అభిప్రాయం. అందాల పోటీల కారణంగానే మహిళలకు దక్కాల్సిన గౌరవం, అధికారం దక్కడంలేదన్నది ఆమె వాదన. భారీ స్థాయిలో జరుగుతున్న ప్రోగ్రాంను అడ్డుకునేందుకు సునీత ప్రయత్నిస్తుండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటీ కాంటెస్ట్ పూర్తయ్యే వరకు బయటకు రాకుండా జైలులోనే ఉంచారు. దాదాపు రెండు నెలల పాటు సునీత జైలు జీవితం గడిపారు. తనను కుట్ర చేసి ఇరికించారని సునీతకు తెలుసు. ఆమె దగ్గర డ్రగ్స్ దొరిఖకాయని అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. 

అయితే జైలు జీవితాన్ని కూడా జీవితంలో ఒక పాఠంగా మలుచుకున్నారు సునీత. జైలులో ఉండగా ఆమె ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా శిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి, వారి చేసిన నేరాలు, వారిపై జరిగిన అఘాయిత్యాల గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. జైలులో ఉండగా అధికారులు సునీతతో దారుణంగా వ్యవహరించారు. మార్చుకునేందుకు వేరే డ్రెస్ కూడా ఇవ్వలేదు. దీంతో 60రోజుల పాటు ఆమె ఒకే డ్రెస్ లో ఉంది. జైలు నుంచి బయటకు వచ్చాక సునీత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవల్సి వచ్చింది. తనవాళ్లు దూరమయ్యారు. పోలీసులు, ప్రభుత్వం ఆమె బెంగళూరు వదిలి వెళ్లిపోయే పరిస్థితి కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో సునీత తాను పుట్టిన గడ్డ బెంగళూరును వదిలి హైదరాబాద్ కు చేరుకుంది. ఆ తర్వాత హైదరాబాదే ఆమెకు కర్మభూమి అయ్యింది.

హైదరాబాద్ లో సునీతకు బ్రదర్ వర్గీస్ పరిచయమయ్యారు. ఆయన మురికివాడల్లోని ప్రజల సంక్షేమం కోసం పనిచేసేవారు. సునీత బ్రదర్ వర్గీస్ బాటలోనే నడిచింది. నెమ్మదిగా పరిచయాలు పెరిగాయి. ఎంతో మంది శ్రేయోభిలాషులుగా మారారు. ఇంకెంతో మంది తనతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారు. 1996లో జరిగిన ఓ ఘటన సునీత కృష్ణన్ ప్రజల్వ సంస్థ ఏర్పాటు చేసేందుకు కారణమైంది.

హైదరాబాద్ పాతబస్తీలో మెహబూబ్ కీ మెహందీ అనే బస్తీ ఉండేది. అక్కడ జోరుగా వ్యభిచారం జరిగేది. 1996లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న బ్రోతల్ హౌస్ లన్నింటినీ మూసేశారు. వ్యభిచార గృహాల్లో పనిచేస్తున్న మహిళల్ని తరిమేశారు. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఆ మహిళల పునరావాసం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. చాలా మంది వేశ్యలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరికొంత మందిని నడిరోడ్డుపై వదిలేశారు. ఏం చేయాలో, ఎలా పొట్ట నింపుకోవాలో తెలియక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆ మహిళల్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సునీత వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. సామాజిక కార్యకర్త బ్రదర్ జార్జ్ వెట్టికటిల్ తో కలిసి ప్రజ్వల సంస్థను ఏర్పాటు చేశారు. మహబూబ్ కీ మెహందీ బాధిత మహిళల్ని అక్కున చేర్చుకున్నారు.

అలా మొదలైన ప్రజ్వల ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. సునీత కృష్ణన్ నేతృత్వంలోని ఈ సంస్థ హింస, అత్యాచారాలకు గురైన వారి తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడుతోంది. వ్యభిచార గృహాలు నడిపేవారిని, బ్రోకర్లను, వారికి అండగా నిలిచే గుండాలను కటకటాల వెనక్కి పంపిస్తోంది. ఎంతోమంది మహిళలు, యువతులకు విముక్తి కల్పిస్తోంది. మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో సునీత కృష్ణన్ ఓ వెలుగు దివ్వె. ఆ వెలుగు దోపిడీ, అత్యాచారాలకు గురైన మహిళల జీవితాల్లో అంధకారాన్ని దూరం చేస్తోంది. సమాజ సేవ, మహిళా సాధికారిత కోసం సునీత కృష్ణన్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

అత్యాచారాలకు, దోపిడీకి గురవుతున్న మహిళల్ని కాపాడి వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న సునీత కృష్ణన్ ను యువర్ స్టోరీ మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.