నేషనల్ హైవేల వెంట వైన్ షాపుల నిషేధం ఇతని పోరాట ఫలమే..

తనలాగా ఎవరూ బలికావొద్దని అలుపెరుగని పోరాటం చేసిన హర్మన్

నేషనల్ హైవేల వెంట వైన్ షాపుల నిషేధం ఇతని పోరాట ఫలమే..

Friday January 20, 2017,

4 min Read

నేషనల్ హైవేలపై మద్యం అమ్మరాదంటూ ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే సుప్రీం ఇచ్చే అనేక తీర్పుల్లో అదొకటి అని తేలిగ్గా తీసుకోకండి. అత్యున్నత న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వెలువడ్డానికి కారణం.. ఒక దివ్యాంగుడి అలుపెరుగని పోరాటం. తనలాగా రోడ్డు ప్రమాదంలో మరె వరూ గాయపడకుండా ఉండాలని అతను సాగించిన ఉద్యమ ఫలితమే.. ఇవాళ హైవేలపై మద్యం షాపుల నిషేధం.

అసలేం జరిగింది? ఎందుకు అతను జాతీయ రహదారిపై మద్యం అమ్మకాలను నిషేధించాలని పోరాటానికి దిగాడు? ఇదంతా తెలుసుకోవాలంటే 21 సంవ్సతరాలు వెనక్కి వెళ్లాలి.

image


అది 1996 అక్టోబర్. 26 ఏళ్ల హర్మన్ సింగ్ సిద్ధు, ముగ్గురు స్నేహితులతో కలిసి చండీగఢ్‌ వెళ్తున్నాడు. మార్గమధ్యలో హిమాచల్ లేక్ చూసుకుని, పోతూపోతూ చిరుతపులల శాంక్చువరీ టచ్ చేస్తూ వెళ్లారు. అక్కడితో ఆగలేదు. మెయిన్ రోడ్డుమీదుగా వెళ్తే వైల్డ్ యానిమల్ మిస్సవుతామని, బండి అడ్డదారుల్లోకి తిప్పారు. అదే వాళ్లు చేసిన బ్లండర్ మిస్టేక్. ఒకచోటికి రాగానే బండి స్కిడ్డయింది. వేగం అదుపులోకి రాలేదు. బండి పల్టీలు కొడుతూ పెద్ద లోయలోకి పడిపోయింది. అందులో ఉన్నవారంతా ఎలాగోలా బయటపడ్డారు. కానీ హర్మన్ సింగ్ మాత్రం రాలేకపోయాడు. వెన్నుముకకు తీవ్రమైన గాయాలు.

హర్మన్ సింగ్ రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆరోజు నుంచి వీల్ చైర్ కే అంకితమైపోయాడు. చాలాఏళ్ల దాకా హాస్పిటల్ బెడ్ మీదనే ఉన్నాడు. నాకొక్కడికే ఇలా ఎందుకైందని బాధపడ్డాడు. ఆ తర్వాత తెలిసింది.. రోడ్డు ప్రమాదం వల్ల తనలాగే చాలామంది వెన్నుముక దెబ్బతిని, చావలేక బతుకుతున్నారని. వెంటనే ఒక ఆలోచన తట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలైన వారి రికార్డులు తెప్పించుకున్నాడు. విచిత్రం ఏంటంటే మాగ్జిమం యాక్సిడెంట్లన్నీ మద్యం తాగి నడపడం వల్ల జరిగినవే.

ఆశ్చర్యమేసింది. ఆపై ఒక ఆలోచన తట్టింది. హైవేల మీద మద్యం షాపులు ఉండటం వల్లనే ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయని, వాటినే అరికడితే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించొచ్చని అనుకున్నాడు. అంతకంటే ముందు కొందరితో కలిసి రోడ్ సేఫ్టీ మీద అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఉంటే తప్ప క్యాంపెయిన్ కు సరైన స్పందన ఉండేది కాదు. కారణం, మన ఇండియన్ టిపికల్ మైండ్ సెట్. ఇలా అయితే లాభం లేదనుకుని వేరే రూట్లో వెళ్లాలని డిసైడ్ అయ్యాడు.

ఒక మిత్రుడి సలహాతో వెబ్ సైట్ క్రియేట్ చేశాడు. దాంట్లో రోడ్డుభద్రత, డ్రైవింగ్, పాటించాల్సిన నిబంధనలు, తదితర విషయాల గురించి సమగ్ర సమచారాన్ని పొందుపరిచాడు. పనిలో పనిగా చండీగఢ్ పోలీసుల కోసం కూడా ఒక సైట్ తయారు చేసిచ్చాడు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. వాస్తవానికి అంత రెస్పాండ్ వస్తుందని కూడా హర్మన్ ఊహించలేదు. వందలు కాదు వేలు కాదు.. లక్షల మంది జనం వెబ్ సైట్ చూసి రియాక్టయ్యారు.

కొన్ని నెలల తర్వాత హర్మన్ సొంతంగా అరైవ్ సేఫ్ పేరుతో ఒక ఎన్జీవో స్థాపించాడు. దాని ద్వారా రోడ్ సేఫ్టీ మీద అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టాడు. ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఫైనల్ టార్గెట్ పెట్టుకున్నాడు. హైవేలపై మద్యం షాపులకు లైసెన్స్ ఇవ్వొద్దు. ఇదే అంతిమ లక్ష్యంగా ముందుకు కదిలాడు.

దేశంలో సగటున ప్రతీ నాలుగు నిమిషాలకోసారి రోడ్డు ప్రమాదం జరుగుతోంది. .అందులో ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఇది అత్యంత కలవరపెట్టే అంశం. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మనదగ్గర జరిగినన్ని యాక్సిడెంట్లు మరెక్కడా లేవు. గత ఏడాది 1,46,133 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అందులో తాగి నడిపిన కేసులే ఎక్కువ.

ఈ లెక్కలు చూసిన హర్మన్ సింగ్ గుండె జారిపోయింది. అసలు జాతీయ రహదారుల వెంట లిక్కర్ షాపులు ఎన్ని ఉన్నాయి? ఆర్టీఐ, ఎక్సైజ్ శాఖ, ఎన్ హెచ్ఏఐ ద్వారా జాబితా తెప్పించుకుని చూశాడు. మైండ్ బ్లాంకైంది. 291 కిలోమీటర్ల పానిపట్-జలంధర్ జాతీయ రహదారిపై 185 వైన్ షాపులున్నాయి. అంటే ఇంచుమించు కిలోమీటరున్నరకు ఒక లిక్కర్ షాపు ఉందన్నమాట.

హర్మన్ షాక్ నుంచి తేరుకోకముందే ఒక నిర్ణయానికొచ్చాడు. అర్జెంటుగా పంజాబ్, హర్యానా హైకోర్టులో పిల్ వేశాడు. జాతీయ రహదారి అయినా, రాష్ట్రీయ రహదారి అయినా లిక్కర్ షాప్ ఉండొద్దు అని అప్పీల్ చేశాడు. మార్చి 2014లో తీర్పొచ్చింది. దాంతో పంజాబ్, హర్యానాలో రోడ్డుకి ఇరువైపులా ఉన్నా వెయ్యికి పైగా మద్యం దుకాణాలు క్లోజయ్యాయి.

అయినా హర్మన్ మనసు ఊరట చెందలేదు. ఇంకా ఎక్కడో లోపం ఉంది. మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచిత్రం ఏంటేంటే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంలో పిటిషన్ వేశాయి. ఎందుకంటే వైన్ షాపులు క్లోజ్ చేయడం వల్ల సర్కారు ఖజానకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయందని.. మళ్లీ వాటిని తెరిపించాలని పిటిషన్ లో కోరాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుపై స్టే విధించింది.

వాదోపవాదాలు, మరణాల లెక్కలు, ప్రమాదాల సంఖ్యలు.. ఇవన్నీ సమగ్రంగా పరిశీలించిన కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. మనిషి జీవితం ఎంతో విలువైంది.. మనుషులంతా వట్టిపుణ్యానికే రోడ్డుమీద పడి తనువు చాలించడం బాధాకరమని అభిప్రాయ పడింది. కేవలం మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే.. కచ్చితంగా దాన్ని నిషేధించడమే మేలని న్యాయస్థానం భావించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైవేలు, రాష్ట్ర రహదారులు వెంబడి మద్యం షాపులు ఉండరాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏవైతే షాపులు ఉన్నాయో, వాటి లైసెన్స్ మార్చి 31 తర్వాత రిన్యూవల్ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం తీర్పుతో హర్మన్ సింగ్ మొహంలో విజయగర్వం తొణికిసలాడింది. వందల, వేల ప్రాణాలు కాపాడేందకు. అతను నాలుగేళ్ల పాటు చేసిన పోరాటం చివరికి ఫలించింది. జాతిమొత్తం అతడి సంకల్పానికి జై కొట్టింది. హర్మన్ సింగ్ అంతటితో ఆగలేదు. మార్చి 31 వరకు టైముంది. ఆ లోపు ఏ హైవేపైనా లిక్కర్ షాప్ దగ్గర జనం ఆగకుండా, కొనకుండా, తాగకుండా చేయాలని ఒక టీం ఏర్పాటు చేసుకుని, పట్టువదలని విక్రమార్కుడిలా రహదారుల వెంట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.