వయసు 20 ఏళ్లు.. స్టార్టప్ వేల్యూ రెండు కోట్లు

0


మ‌న‌సు చెప్పిందే వేదం.. మ‌న‌కు తోచిందే మార్గం. ఈ మాటను వృశాలి ప్రసాద్ అక్షర సత్యం చేసింది. యువ‌తరం త‌లుచుకుంటే ఏదైనా సాధ్యమే అనేందుకు వృశాలీయే నిదర్శనం. అందరి లాంటి అమ్మాయే. కానీ చురుకుదనంలో మాత్రం ఎవరితోనూ పోల్చలేము. పదో తరగతి చదివేనాటికి టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా తయారయ్యింది. పదో తరగతి పరీక్షల సమయం. సరిగ్గా అదే రోజు టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడాలి. మామూలుగా అయితే ఆట లేదు.. గీటలేదు ముందు పరీక్ష రాయ్.. అని ఇంట్లో వారు కసురుకుంటారు. కానీ వృశాలి విషయంలో అలా జరగలేదు.  

ఇలా రిస్క్‌ తీసుకోవడం అనేది వృశాలి చిన్నప్పటి నుంచే అలవర్చుకుంది. పదో ఏట నుంచే టేబుల్ టెన్నిస్‌ క్రీడను ఎంచుకొని అంతర్జాతీయ స్థాయిలో ఆడింది. 2009 లో భారత్‌ తరపున అండర్-17 టీంలో సభ్యురాలిగా వృశాలి ప్రదర్శన ఇచ్చింది. స్కూలు పూర్తయిన వెంటనే బిట్స్‌ గోవాలో జాయిన్‌ అయ్యింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. శుభం మిశ్ర, హరి వలియత్‌ అనే స్నేహితులతో కలిసి తన కలలకు రూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఒక ఆలోచన.. ఒక విజయం

90 దశకంలో పుట్టిన పిల్లలందరిలోనూ కనిపించే కామన్‌ అభిరుచి వీడియో గేమ్‌ ఆడటం. అవంటే వారికి విపరీతమైన ఇష్టం.   వృశాలి కూడా అంతే. అయితే, ఆమె అందరిలా ఆడామా.. ఎంజాయ్ చేశామా అన్నట్టు కాదు. వీడియోగేమ్స్‌ లో ఏకంగా  స్టార్టప్‌ మొదలు పెట్టింది. గేమింగ్ లో ఒక విప్లవం తీసుకురావాలని వృశాలి.. ఆమె మిత్రులు కలిసి బెంగళూరులో ఆబ్సెన్షియా పేరిట ఓ కంపెనీ స్థాపించారు. వర్చువల్‌ రియాలిటీ అనే కాన్సెప్ట్‌ తో వీడియోగేమ్స్ తయారుచేయడం దాని కాన్సెప్ట్.

వర్చువల్‌ రియాలిటీ అంటే మన కళ్లముందే జరుగుతున్నట్లు అనుభూతిని కలిగించడం. ఇందుకోసం టెస్సరెక్ట్‌ హెడ్‌ గేర్‌ పేరిట, కళ్లజోడుతో కూడిన ఓ మొబైల్‌ వీడియో తెరను రూపొందించారు. దీన్ని కళ్లకు తగలించుకుంటే చాలు మీరు గేమింగ్‌ ప్రపంచంలో అడుగుపెట్టినట్లే. కళ్లముందే మీరు వీడియోగేమ్ ఆడుతున్న అనుభూతి పొందుతారు. ఈ హెడ్‌ గేర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లో సినిమాలు కనెక్ట్‌ చేసుకొని చూడొచ్చు.

కల నిజమైన వేళ..

వర్చువల్‌ రియాలిటీ అనే కాన్సెప్ట్‌ మనకు చాలా కొత్తది. అలాంటిది స్టార్టప్‌ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎంతమంది వస్తారనేది చిక్కు ప్రశ్నే. కానీ వృశాలి, ఆమె మిత్రులు మాత్రం ఎలాంటి టెన్షనూ పడేలేదు. తమ కాన్సెప్ట్‌ను మార్కెట్లో వివరించారు. ఇన్వెస్టర్లను మెప్పించారు. మొదటి రౌండ్‌లో 1.2 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. విష్ సత్తప్పన్, సమీర్‌ సైనాని, రాజీవ్‌ కృష్ణన్, అభిషేక్‌ జైన్, నాగరాజ్‌ మాగదమ్‌ అనే ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అలా మొదలైంది వృశాలి ఆంట్రప్రెన్యూర్ జర్నీ.

వర్చువల్‌ రియాలిటీ డివైజ్‌లను తయారు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడ్డారు. అనుకున్నది సాధించారు. నేడు వృశాలి స్థాపించిన స్టార్టప్‌ వేల్యూ రెండు కోట్లకు చేరింది. ప్రస్తుతం మార్కెట్లో సైతం వర్చువల్‌ రియాలిటీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో వీరి స్టార్టప్‌ మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

 

Related Stories