అజాత శత్రువు ఈ ఆంధ్రా క్రికెటర్

అజాత శత్రువు ఈ ఆంధ్రా క్రికెటర్

Tuesday December 15, 2015,

3 min Read

క్రికెట్ అంటే ఇండియాలో తెలియని వారుండరంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటి క్రికెట్ లో మన ఆంధ్రా నుంచి ఎంతమంది ప్రాతినిధ్యం వహించారంటే వెంటనే సమాధానం చెప్పలేం. హైదరాబాద్ బోర్డ్ నుంచి చాలా మంది లెజెంట్స్ ఇండియన్ క్రికెట్ లో తమ సత్తా చాటారు. కానీ 60 ఏళ్లు దాటిన ఆంధ్రా బోర్డ్ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. అందులో మొదటి వ్యక్తి ఎమ్మెస్కే ప్రసాద్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు టీం ఇండియా క్రికెట్ సీనియర్ సెలక్టర్లలో ఒకరిగా అత్యున్నత పదవికి చేరుకున్నారు. ఆయన క్రీడా జీవితంలో ఎన్నో మజిలీలు. ముంబై, బెంగాల్ బోర్డుల హవా కొనసాగుతున్న సమయంలోనే భారత క్రికెటర్ గా తన ప్రస్థానం ప్రారంభించారు ఎమ్మెస్కే.

image


జమీందారీ కుటుంబ నేపధ్యం

ఎమ్మెస్కే ప్రసాద్ ది జమీందారీ కుటుంబం. అతని తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చి సొంతగా ఎదగాలని ఉద్యోగం సంపాదించుకున్నారు. తనకు చెందాల్సిన ఆస్తిని ఇంటివారికే విడిచిపెట్టారు. దీంతో ఎమ్మెస్కే చిన్నతనం నుంచే మధ్యతరగతి జీవితం అలవాటైంది. పేరుకి జమీందారీలే అయినా సాధారణ మధ్యతరగతి పరిస్థితుల్లో పెరిగారు. అన్న, చెల్లి ఇంజనీరు, డార్టర్ అయితే తాను మాత్రం క్రికెటర్ అయ్యానని నవ్వుతూ చెప్పుకొచ్చారాయన.

“నా చిన్నప్పుడు రెండు గదులున్న ఇంటిలో మేం ఉండేవాళ్లం” ఎమ్ఎస్కె ప్రసాద్

స్కూల్ అయి పోయిన తర్వాత గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోవడమే వీళ్లకి తెలుసట. ప్రాక్టీస్ చేయడానికి సరైన గైడ్ లైన్స్ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాణించడం ప్రసాద్ కి మాత్రమే సాధ్యమైంది.

image


కోచ్ లేని కోచింగ్

క్రికెట్ ప్రారంభించిన మొదటి రోజుల్లో ఒక కోచ్ ఉండేవారట. అనంతరం ఆయన ట్రాన్స్ ఫర్ అయి వేరే చోటికి వెళ్లిపోవడంతో తమకు కోచ్ లేకుండానే ప్రాక్టీస్ చేసేవాళ్లమని ఎమ్మెస్కే అంటున్నారు.

“టీవీలో చూసి, హ్యాంగింగ్ బాల్ తో ప్రాక్టీస్ చేశాం.” ఎమ్మిస్కే

ఓనామాలు నేర్పిన కోచ్ లేకపోవడంతో క్రికెట్ చూసి ప్రాక్టీస్ చేసేవారట. ఇక నెట్ ప్రాక్టీస్ అనేది అసలు తెలియనే తెలియదట. ఇప్పటి లాగ పరిస్థితులుండుంటే కనీసం తాను మరింత గొప్ప క్రికెటర్ అయి ఉండేవాడినని అంటున్నారాయన. అప్పటి కాలంలో ఉన్న పట్టుదల, ఆలోచన ఈతరం వారికి లేవంటున్నారు ఎమ్మెస్కే.

image


కుటుంబమే నాకు శ్రీరామ రక్ష

నాన్న గారు చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెంచారు. డబ్బులు కంటే చదువుకి, గౌరవ మర్యాదలకి ఎక్కువ విలువిచ్చారు. అవే నన్నీ స్థితికి తీసుకొచ్చాయన్నారు.

“నిజాయితీగా ఉండమని నాన్న గారు నేర్పించారు.” ప్రసాద్

మా కుటుంబం గురించి పెద్దగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేకపోయినా , ఏదైనా చెప్పాల్సి వస్తే అది నాన్న గురించే చెప్పాలి. నిజాయితీగా ఉండాలని మాకు నేర్పించారు. ఓ తండ్రిగా జీవితంలో నేర్పించాల్సిన విషయం ఇంతకంటే ఏముంటందన్నారు. చాలా సార్లు మా రిలేటివ్స్, తెలిసిన వాళ్లు నాన్నగారి తో చాలా సార్లు నన్ను దారిలో పెట్టమంటూ సలహా ఇచ్చేవారు. కానీ నాన్న ఒక్కసారి కూడా క్రికెట్ ఆపేసేయ్ అని తనతో అనలేదని గుర్తు చేసుకున్నారు. మా అమ్మ కూడా నేను గ్రౌండ్ నుంచి వచ్చే సరికి తినడానికి అన్ని సిద్ధం చేసేది. ఇలా నేనీ స్థాయికి రాడానికి నా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎంతైనా ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు.

image


ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో అనుబంధం

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు అయిన తర్వాత మొదటి క్రికెటర్ గా నేనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడానని చెప్పకోడానికి గర్వంగా ఉందంటారు ఎమ్మెస్కే ప్రసాద్. బిసిసిఐ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఆంధ్రా బోర్డులో సభ్యుడిగా చేరిన ఎమ్మెస్కే ఆంధ్ర క్రికెట్ నుంచి చాలా మంది కుర్రాళ్లను తయారు చేయడంలో భాగస్వామ్యం అయ్యారు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ లో ముంబై జట్టుని గడగడ లాడించిన ఆంధ్రా క్రికెట్ జట్టు ఈ స్థాయికి రావడం వెనక ఎమ్మెస్కే సేవలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్.

“ఇళ్లు కట్టుకోడానికి నాలుగేళ్లు పట్టింది.” ఎమ్మెస్కే ప్రసాద్

ఆంధ్రా క్రికెట్ నుంచి టీం ఇండియాలో చోటు సంపాదించినందుకు అప్పటి ఆంధ్రా సిఎం తనకు ఇల్లు కట్టుకోడానికి జూబ్లీ హిల్స్ లో స్థలం ఇచ్చారు. అయితే అక్కడ కట్టుకోడానికి వున్న ఆస్తులన్నీ అమ్మాల్సి వచ్చిందట. దాదాపు నాలుగేళ్లు పట్టిందట. రూపాయి, రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్నానని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాతీయ సెలెక్టర్ గా సరికొత్త బాధ్యత చేపట్టారు. దాన్ని నూటికి నూరు పాళ్లు న్యాయం చేయడానికి పాటుపడతానని అంటున్నారాయన. నేచురల్ కీపర్ అని, బ్యాటింగ్ లో అన్ని టెక్నిక్స్ తెలియకపోయినా తన దైన ఆట తీరుతో క్రికెట్ ని ఆస్వాదించాన్నారు.

image


చివరిగా

జమీందారీ కుటుంబ నేపథ్యం, ఆంధ్రా నుంచి మొదటి ఇంటర్నేషనల్ క్రికెటర్, ఇప్పుడు జాతీయ సెలక్టర్ ఇవేవీ ఇవ్వని ఆనందం గ్రౌండ్ లో క్రికెట్ ఆడినప్పుడు లభిస్తుందని అంటారు ఎమ్మెస్కే ప్రసాద్.

“నా జీవితంలో మంచి స్నేహితులని సంపాదించుకున్నానో లేదో తెలియదు కానీ, ఒక్క శత్రువు కూడా లేడు. ఇదే నా పెద్ద సక్సస్. ఇంతకంటే ఏమీ చెప్పలేనని ముగించారు ఎమ్మెస్కే ప్రసాద్.”