మన యానిమేషన్ సత్తా ఏంటో చూపుదాం

ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్‌ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

0


ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసుల్లో తెలంగాణ ఇప్పటికే లీడర్ పొజిషన్ లో ఉందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. డిజిటల్ యానిమేషన్ రంగంలో మనం దూసుకుపోతున్నామని తెలిపారు. గేమింగ్ ఇండస్ట్రీలో మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నమని వెల్లడించారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న నాస్కామ్‌ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన కేటీఆర్.. త్వరలో హైదరాబాద్‌లో నిర్మించబోయే ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్‌ ను ఆవిష్కరించారు. అత్యాధునిక డిజైన్‌లో చేపట్టిన ఈ టవర్ల నిర్మాణం ఇంగ్లిష్ లెటర్ టీ ఆకారంలో కనిపిస్తుంది.

నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటు.. పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ నిర్మాణం కనిపిస్తుంది. టవర్ల మధ్యభాగంలో కూడా పెద్ద పరిమాణంలో టీవీ స్క్రీన్లు మోడల్‌లో కనిపిస్తాయి. కింద రెండు స్విమ్మింగ్ పూల్స్ డిజైన్‌ లోకనిపిస్తాయి. ప్రధానంగా మల్టీమీడియా, గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ప్రభుత్వం ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతోంది.

ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో దాదాపు 30 వేల మంది గేమింగ్ ఇండస్ట్రీలో పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎన్నో సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ భాగ్యనగరంలోనే రూపుదిద్దుకున్నాయని కేటీఆర్ అన్నారు. మగధీర, ఈగ, బాహుబలి, అరుంధతి, లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రపంచ దేశాలకు మన యానిమేషన్ సత్తా ఏంటో చూపుతున్నామని అన్నారు. త్వరలో టీ-హబ్ రెండో దశ బిల్డింగ్‌ని 3వేల చదరపు అడుగుల్లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో వందకుపైగా పేరున్న గేమింగ్ సంస్థలున్నాయన్న కేటీఆర్.. భాగ్యనగరంలో 30వేల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గేమింగ్ ఇండస్ట్రీలో మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. గేమింగ్, మల్టీమీడియా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇస్తుందని స్పష్టం చేశారు. 

Related Stories