పర్మాకల్చర్ తో భవిష్యత్ వ్యవసాయానికి బాటలు పరుస్తున్న నర్సన్న

పర్మాకల్చర్ తో భవిష్యత్ వ్యవసాయానికి బాటలు పరుస్తున్న నర్సన్న

Monday May 08, 2017,

3 min Read

వ్యవసాయం గురించి ఎప్పుడు చెప్పాలన్నా కన్నీళ్లే వస్తాయి. అదొక సంక్షోభాల సుడిగుండం. విత్తనాల దగ్గర్నుంచి పకృతి విపత్తుల దాకా అనేక సమస్యలు అన్నదాత మెడకు ఉరితాడుని బిగిస్తుంటాయి. రైతుల ఆత్మహత్యల మీద మీడియాలో ఎన్నిసార్లు చర్చలు జరిగినా, ఎన్ని నివేదికలు వచ్చినా, అవన్నీ రాజకీయ కోణంలో మాత్రమే కనిపిస్తుంటాయి. అంతేకానీ, సమస్య మూలాల్లోకి వెళ్లి చర్చించే సందర్భాలు చాలా తక్కువ. వ్యవసాయం అంటే దండుగ కాదు.. పండుగ అని ప్రాక్టికల్ గా చూపించే వ్యవస్థ లేకపోడం ఈ దురవస్థకు మూల కారణం. అలా అన్వేషణ చేసి, అన్నదాత ముఖంలో ఆనందాన్ని నింపే మహోద్యమాన్ని చేపట్టింది అరణ్య అనే ఎన్జీవో సంస్థ. ఆ ఉద్యమం పేరే పర్మా కల్చర్. అంటే శాశ్వత వ్యవసాయ పద్ధతి. వనరుల్నీ, భూమిని, మనిషి జీవన విధానాన్ని ఏకకాలంలో కాపాడే మహోన్నత సంకల్పం. 25 ఏళ్లుగా ఆ దిశగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు నర్సన్న కొప్పుల. 

image


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామీకరణ- ఈ రెండు పదాలు వ్యవసాయాన్ని పాతాళంలో పాతిపెట్టాయి. ఏ రంగంలో అయినా సంస్కరణలు ముఖ్యమే. అలాగని చిన్నపాటి రైతును వ్యవసాయం అన్న మాటకే దూరం చేయడం క్షమించరాని నేరం. ఏ సంస్కరణలు జరిగినా అవి మనిషి మనుగడ కోణంలోనే జరగాలి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ రంగం- పైకి అనుకున్నంత హ్యాపీగా లేదు. రైతు ఆత్మహత్య అన్న ఒక్కో కోణం చాలు. ఎద్దు-వ్యవసాయం ఎంత దీనావస్థలో ఉన్నాయో చెప్పడానికి. 

అలాంటి పద్ధతి పోవాలి. తినే అన్నంలో విషం కలుపునే దైన్య స్థితి మారాలి. నేలతల్లి కడుపులో యంత్రాల కత్తులు దిగబడొద్దు. నీటిచుక్క కోసం అంజనం వేయొద్దు. వాన ఎప్పుడు పడుతుందా అని ఆకాశం వైపు దీనంగా చూడొద్దు. వ్యవసాయం నిత్య కనుమ పండుగ కావాలి. కళ్లు మూసినా తెరిచినా కలలో ధాన్యరాశులు కనపడాలి. అంటే వ్యవసాయం చేసే తీరు మారాలి. ఆ మార్పు ఎక్కడో చోట మొదలుకావాలి. ఆహార కొరత, నీటి కొరత, నిస్సారమైన భూమి అన్న మాట వినిపించొద్దు. ఏసీ రూముల్లో కూర్చొని నివేదికలు, పుస్తకాలు రాసి, లెక్చర్లు దంచితే కుదరదు. నేలమీదికి దిగిరావాలి. మెత్తటి మట్టిని చేతుల్లోకి తీసుకోవాలి. దోసిట పట్టిన నీళ్లవైపు తదేకంగా చూడాలి. ఎండిపోయిన చెట్టుకొమ్మ కింద కూర్చొని పచ్చటి కల కనాలి. రాలిపోయిన ఆకుల గలగలల్లో హరిత విప్లవం అనే మాట వినిపించాలి. 

నర్సన్న కొప్పుల చేసేదదే. పర్మాకల్చర్. అంటే శాశ్వత వ్యవసాయ పద్ధతి. అలాగని ఒక్క వ్యవసాయమే కాదు. నీటి సంరక్షణ. చెట్ల సంరక్షణ. భూమి సంరక్షణ. మనిషి జీవన విధాన సంరక్షణ. వ్యవసాయం అనేమాటకు అనుబంధంగా ఉన్న ప్రతీ వనరునీ, ప్రతీ ప్రాణిని సంరక్షించుకోవడం. ఇదే పర్మాకల్చర్ నమ్మిన సిద్ధాంతం. ఆ ప్రిన్సిపుల్స్ ఆధారంగానే అరణ్య సంస్థ నడుస్తోంది. ఈ ఎన్జీవో ఏ పని చేసినా ఆ మూడు సూత్రాలను ఆధారంగానే చేస్తుంది. మొదటిది నేల సంరక్షణ. మనుషుల సంరక్షణ. ఫెయిర్ షేర్. 

image


ఆర్గనైజేషన్ తరుపున ఏ యాక్టివిటీ చేపట్టినా ఈ మూడింటి ఆధారంగానే చేస్తారు. స్థానిక సమస్యలను బేస్ చేసుకుంటూనే, దీర్ఘకాలిక సమస్యలను ఎలా పరిష్కరించాలనే కోణంలో చూస్తారు. ఇప్పుడున్న వ్యవసాయ విధానం, ఆహార కొరత, అడవుల నరికివేత విధానం.. ఇవన్నీ అనుకూలంగా మార్చుకునేలా వ్యవసాయం ఎందుకు చేయకూడదు. వర్షాధార భూముల్లో ఎలా నీటిని నిలుపుకోవాలి. నిలుపుకున్న నీటిని ఎలా వాడుకోవాలి. అవి నేర్చుకున్న తర్వాతే వ్యవసాయం చేయాలన్నది సంస్థ ముఖ్య సిద్ధాంతం. నేల మీద ప్రతీ వాన చినుకును ఒడిసిపట్టే కార్యక్రమం చేపడతారు. తర్వాత చెట్లపెంపకం. అవి ఎంత ఎక్కువుంటే వ్యవసాయం అంత బాగా ఉంటుంది. అందుకే ముందు చెట్లు పెంచడానికి ప్రోత్సహిస్తారు. చెట్లు లేకుంటే వాన లేదు. వాన లేకుంటే పంట లేదు. భూమిని సారవంతం చేయడం పర్మాకల్చర్ మరో ముఖ్యమైన కార్యక్రమం. భూమి అనుకూలంగా ఉంటేేనే కదా కావల్సిన పంటలు పండించేది. 

వాణిజ్య పంటలు అవసరమే. కానీ ముందు తినడానికి పండించాలి. తిని మిగిలిన దాన్ని అమ్ముకోవాలి. దాన్నే కమర్షియల్ చేయాలి. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసమే పర్మా కల్చర్ పుట్టిందంటారు నర్సన్న. ఆ కోణంలో రైతులతో మమేకం అవుతుంటారు. ఈ ఎన్జీవోలో మహిళా సంఘాలు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. వేల మందితో సంస్థ పనిచేస్తున్నది. స్థానిక ప్రజల జీవన విధానాన్ని కాపాడుకుంటూ ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఏ చెట్టు మొలిచినా దాన్ని కలుపుకుంటూ పోవడమే అంటారాయన. పాతికేళ్ల క్రితం మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం.. నేడు అది ఒక మహోద్యమంలా తయారైంది. బీడు భూమి అన్న మాటలే ఉండొద్దనేది అరణ్య సంస్థ నమ్మిన సిద్ధాంతం. పర్మా కల్చర్ అనేది భవిష్యత్ వ్యవసాయానికి మార్గదర్శి కావాలంటారు నర్సన్న కొప్పుల.