చండిల్ రిజర్వాయర్‌ లో కేజ్ కల్చర్.. 2వేల మంది నిర్వాసితులకు భరోసా

0

జార్ఖండ్ సుబర్ణరేఖ నది మీద కట్టిన చండిల్ డామ్ రిజర్వాయర్ ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద డ్యాముల్లో ఒకటి. జంషెడ్‌పూర్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్టు మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే సాగునీరు అందుతోంది. డామ్ నుంచి దిగువకు ఉరకలెత్తే నీటి సుడుల వెనుక తీర్చలేని వెతలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం 20వేల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. 116 గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.

అయితే ఏ నీటి కారణంగా వాళ్లు నిర్వాసితులుగా మిగిలారో.. అదే నీళ్ల ద్వారా ఉపాధి కల్పించే కార్యక్రమానికి 2011లో శ్రీకారం చుట్టింది జార్ఖండ్ ప్రభుత్వం. ఛాండిల్ డ్యామ్లో కేజ్ కల్చర్ విధానాన్ని ప్రారంభించి, నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపింది. సుమారు రెండువేల మందికి రిజర్వాయర్‌ మీద జీవనోపాధి కల్పించింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కేస్ ఫిష్ ఫామింగ్ ప్రాజెక్ట్ చేపట్టింది. కేవలం నిర్వాసితుల కోసమే చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి వందశాతం సబ్సిడీ ఇచ్చింది. స్టేట్ ఫిషరీస్ డిపార్టుమెంట్ వారు కావల్సిన శిక్షణ, సాంకేతిక సహకారం అందించారు.

వియాత్నాం, కాంబోడియా, థాయ్ లాండ్ లో ఎక్కువగా కనిపించే పంగాసియస్ అనే చేపల్ని ఇక్కడ పెంచుతున్నారు. అవి ఆరు నెలల్లో కేజీ బరువు పెరుగుతాయి. ప్రొడక్షన్ కాస్ట్ కేవలం 70-40 రూపాయలే. అమ్మితే కేజీకి రూ.70 నుంచి రూ.80 వస్తాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఆ రకమైన చేపల్ని ఓపెన్ అక్వాకల్చర్లో గానీ డామ్స్, రిజర్వాయర్లలోగానీ పెంచాలి. ధర తక్కువ డిమాండ్ ఎక్కువ. అతి తక్కువ సమయంలోనే చేప ఎదుగుతుంది. ఒక కేజ్ నుంచి ప్రతీ ఆరు నెలలకోసారి ఐదారు టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. 2011 నుంచి 2013 వరకు 134 టన్నుల చేపలు ఎగుమతి చేశారు. 2012-13 కాలంలో 25 లక్షల ఆదాయం వచ్చింది.

కేజ్ కల్చర్ విధానంలో చేపలెలా పెంచుతారంటే.. నీటిలోనే ప్లాస్టిక్ డబ్బాలతో అరలను తయారుచేస్తారు. వాటిని 12 అడుగుల లోతులో పంజరం లాంటి వలలను వదులుతారు. వాటిలోనే చేప పిల్లలను విడిచిపెడతారు. వాటికి తగిన ఫీడింగ్ ఇస్తుంటారు. ఈ విధానం ద్వారా ఒక్కో అరలో సుమారు 5 వేల పిల్లలను పెంచవచ్చు. అవి 50 గ్రాముల బరువు పెరగగానే వాటిని తీసి ఖాళీ అరల్లో వదులుతారు. అలా వదలిన వాటిని 6నెలల వరకు పెంచుతారు. అప్పటికే అవి కేజీ వరకు పెరుగుతాయి.

సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే కేజ్ కల్చర్ విధానంలో ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచే అవకాశముంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని అడాప్ట్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పాలేరు రిజర్వాయర్లో కేజ్ కల్చర్ విధానం సత్ఫలితాలిస్తోంది. కేజ్ కల్చర్లో శాస్త్రీయత ఉండటమే కాకుండా లాభసాటి ఆదాయం కూడా వస్తుంది. అందుకే ఈ పద్ధతిని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

అయితే ప్రస్తుతానికి రెండువేల మంది మాత్రమే కేజ్ కల్చర్ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మిగతా 18వేల మంది పొట్టచేత పట్టుకుని చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. వాళ్లకు కూడా ఏదో రకంగా ఉపాధి కల్పించడం జార్ఖండ్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.

Related Stories

Stories by team ys telugu