ఇదొక సంగీత శ్రీమంతుడి కథ..!

ఇదొక సంగీత శ్రీమంతుడి కథ..!

Sunday February 28, 2016,

4 min Read

‘‘ఊరు నాకెంతో ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాను’’ ఇటీవల వచ్చిన తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ గోవాకు చెందిన జాజ్ ప్లేయర్ కొలిన్‌కు తెలిసి ఉండొచ్చు. కానీ తనకెంతో ఇచ్చిన సంగీతానికి ఆయన ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తున్నారు. సంగీతాన్ని నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో సొంత ఖర్చుతో అన్ని వసతులు కలిగిన స్టూడియోను ఏర్పాటు చేసి యువ ఆర్టిస్టులకు ఉచితంగా వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్త సంగీత కళాకారులందరికీ జాజ్ గోవా స్టూడియో చాలా ఇష్టం..

గోవాకు చెందిన ప్రఖ్యాత జాజ్ మ్యూజిషియన్ కొలిన్ డిక్రూజ్ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అందరిలా సాధారణ జాజ్ ప్లేయరే అయినప్పటికీ.. అందరినీ ఆకర్షిస్తున్నది మాత్రం డీక్రూజ్ నిర్వహిస్తున్న మ్యూజిక్ స్టూడియో.

గోవా అంటే బీచ్ అందాలే కాదు.. సంగీతానికి స్వర్గధామం కూడా. సముద్ర తీరంలో మ్యూజిక్ వాయిస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నవారెంతో మంది. అందుకే గోవాలో వందలాది స్టూడియోలు వెలిశాయి. కానీ జాజ్ గోవా స్టూడియో మాత్రం అన్నిటికంటే ప్రత్యేకం. గోవాలో ఉండే ప్రతి మ్యూజిషియన్‌కు ఈ స్టూడియో తెలుసు. అందరూ దీన్ని గర్వంగా చెప్పుకొంటారు. ఉత్తర గోవాలోని సాంగ్లోడా గ్రామంలో కొలిన్ జాజ్ గోవా స్టూడియో ఉంది.

undefined

undefined


 కష్టాల కడలి.. మ్యూజిక్ అరంగేట్రం

మ్యూజిక్ రంగంలో ఉండే కష్టాలేంటో సంగీతంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రొఫెషనల్ స్టూడియోలో తమ సాంగ్‌ను రికార్డు చేయించుకునేందుకు మ్యూజిషన్లు ఎంతో కష్టపడతారు. తక్కువ ఖర్చుతో అన్ని వసతులున్న స్టూడియో దొరకడం చాలా కష్టం. సంగీత రంగంలోకి అప్పుడప్పుడే అడుగుపెట్టినవారినైతే ఈ సమస్య మరింత పట్టిపీడిస్తుంటుంది. టాలెంట్ ఉన్నప్పటికీ, సాంగ్స్‌ను ప్రొఫెషనల్ స్టూడియోలో రికార్డు చేయించేంత డబ్బు వారి చేతిలో ఉండదు. ఫలితంగా యువ టాలెంట్ వెలుగులోకి రావడం లేదు. అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులకు అండగా నిలుస్తున్నది జాజ్ గోవా. దేశంలోని ప్రముఖ, అనుభ‌వజ్ఞులైన‌ బాస్ ప్లేయర్లు, దేశవ్యాప్త సంగీతకారుల సాయంతో ఉచితంగా రికార్డు చేసుకునే అవకాశాలను కల్పిస్తున్నదీ సంస్థ. అంతేకాదు.. ఈ స్టూడియోకు వెళితే సొంత ఇంటిలో ఉన్నంత సౌకర్యంగా ఉంటుంది. ఇవన్నీ వింటుంటే కలలా అనిపిస్తుంది కదా.. కానీ అదంతా నిజమే.

‘‘గోవా జీవితంలోనే సంగీతం ఓ భాగం. స్థానిక మ్యూజిషన్స్‌కు ఎప్పుడూ ముడిసరుకే లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో స్టూడియోను అందిస్తున్నది మేమే. స్థానిక కళాకారులకు మెరుగైన వసతులు కల్పించాలన్న ఉద్దేశంతోనే జాజ్ గోవాను ఏర్పాటు చేశాను. అంతర్జాతీయ సౌకర్యాలతో స్థానిక కళాకారులకు మంచి ప్లాట్‌ఫామ్‌ను అందించాలన్నదే నా ఉద్దేశం’’- కొలిన్ .
image


అప్పుడు.. ఇప్పుడు...

సంగీతంలో దశాబ్దానికిపైగా అనుభవమున్న కొలిన్.. ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. భారత సంగీత రంగంలో వచ్చిన మార్పులకే కొలినే ప్రసాక్షి. అంతేకాదు భారత సంగీత వాతావరణంలోనే ఆయన పెరిగారు. ‘‘కెరీర్ ఆరంభంలో ముంబైలోని పైవ్ స్టార్ హోటల్స్‌లలో ప్రదర్శన చేశాం. అందరం కలిసి ఒకేసారి వేదికపై నిల్చుని, ఒక్కొక్కరం ఒక్కోసారి ప్రదర్శన ఇచ్చాం. తాజ్ మహల్ హోటల్‌లోని రెండెజావూస్, ఓబెరాయ్ షర్టన్ హెటల్స్‌లో సూపర్ క్లబ్‌లలో వేదికపై ప్రదర్శనలు ఇచ్చాం. కానీ ఇప్పుడు అదే హోటల్స్‌లో సోలోగా లేదంటే, ఇద్దరం కలిసి ప్రదర్శనలు నిర్వహించే సౌకర్యాలు వచ్చాయి’’ అని కొలిన్ గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడైతే యూత్‌కు ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్స్ అంటే పండుగే. హోటల్స్ నుంచి పెళ్లిళ్ల వరకు, రేడియో స్టేషన్స్ నుంచి వర్క్ స్టేషన్ల వరకు ఎక్కడ చూసినా డీజే వినిపించాల్సిందే. ప్రపంచంలో ఎక్కడో ఒక చోటా ప్రతి క్షణం ఈ డీజే చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి మార్పులను స్వాగతించాల్సిందే. కానీ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డ్యాన్స్‌లు సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి.

‘‘గతంలోనైతే మ్యూజిషన్లే స్వయంగా సంగీత పరికరాలను వాయించేవారు. తమ టాలెంట్‌ను ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ప్లే బటన్ నొక్కితే చాలు ఎలాంటి మ్యూజికైనా వచ్చేస్తుంది’’ అని కొలిన్ వాపోతున్నారు.

టెక్నాలజీ పరంగా ఎంతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో లైవ్ మ్యూజిక్ చాలా తక్కువగా కనిపిస్తున్నది. ఒక మ్యూజిక్ బీట్‌ను రూపొందించాలంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు. సంగీతం లేకుండా ప్రపంచం.. ఆలోచించడమే కష్టం. కానీ ఈ రంగంలోకి ప్రవేశించేవారి సంఖ్య తగ్గిపోతున్నది. అందుకు కారణం సరైన అవకాశాలు లేకపోవడమే. లైవ్‌గా తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశాలు రాకపోవడంతో సంగీతకారులు డ్యాన్స్ మ్యూజిక్ సీన్‌లోకి ప్రవేశిస్తున్నారు.

సంగీతంతో ప్రపంచం ఏకం..

సంస్కృతిక వైవిధ్యాలు, సరిహద్దు సమస్యలు, జాతీయ విభేదాలు ఇలా ఎన్నో అడ్డంకులున్నా ప్రపంచవ్యాప్త సంగీతకారులను ఏకం చేస్తున్నది మాత్రం జాజ్ గోవా స్టూడియోనే. నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, యూఎస్.. ఇలా అన్ని దేశాలకు చెందిన కళాకారులు జాజ్ స్టూడియోలో తమ మ్యూజిక్‌ను రికార్డు చేసుకున్నారు. కొలిన్‌తో కలిసి ప్రదర్శనలిచ్చారు. బ్రిటన్‌కు చెందిన శాక్సాఫోనిస్ట్ గోవా కొంకణి ఫోక్ సాంగ్‌కు వాయించడం ఎప్పుడైనా విన్నారా.. అది ఒక్క జాజ్ స్టూడియోలో మాత్రమే సాధ్యమైంది.


image


ఇది ఎలక్ట్రానిక్ డ్యాన్స్, మ్యూజిక్, రియాల్టీ షో కాలం. పేరు, విజయాలు సాధించడం ఇప్పుడు చాలా సులువైపోయింది. కానీ ఇప్పటితరం మాత్రం కొంత మిస్సవుతున్న వెలతి కనిపిస్తున్నది.

‘‘ప్రస్తుతతరం చిన్నారులు మ్యూజిక్‌వేర్ బదులుగా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ, మార్పు ఇవన్నీ సహజమే . కానీ సంగీతం అనేది మనలోని నైపుణ్యాలను బయటకు తెచ్చేది. సంగీత పరికరంతోకానీ, మన గొంతుతో కానీ మ్యూజిక్‌ను పలికించాలి.. ప్లే బటన్ నొక్కి కాదు’’ అని కొలిన్ అంటారు. ఎంతోమంది టాలెంటెడ్ మ్యూజిషన్స్ తమ సత్తా నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. అలాంటివారికి ఎడారిలో నీటిబొట్టులా జాజ్ గోవా సాయం చేస్తున్నది. సహకారం అందిస్తున్నది. యువ సంగీతకారుల కలలను నిజం చేస్తున్నది.

‘‘నాకు జీవితంలో సంగీతం ఎంతో ఇచ్చింది. ఎంతో పేరు సంపాదించిపెట్టింది. అందుకే ఆ మహోన్నతమైన సంగీతానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతోనే స్టూడియోను ఏర్పాటు చేశాను’’ అని కొలిన్ అంటారు.

కొద్దిగా పేరు ప్రఖ్యాతలు వస్తేనే ఎవరినీ కేర్ చేయకుండా, గర్వం పెంచుకుంటున్న యువతరాన్ని చూస్తున్న ఈ రోజుల్లో తనకెంతో ఇచ్చిన సంగీతానికి సేవ చేయాలన్న తలంపుతో స్టూడియోను ఏర్పాటు చేసిన కొలిన్ ఆదర్శనీయుడు. కొలిన్‌ను చూసి యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొలిన్ బాటలో యువతరం నడవాలని యువర్‌స్టోరీ ఆశిస్తోంది..