కిరాణా షాపులను సూపర్ మార్కెట్లుగా మారుస్తున్న స్నాప్ బిజ్

1

గత 30 ఏళ్లుగా చూసుకుంటే కిరాణా స్టోర్ ముఖచిత్రం ఏమాత్రం మారలేదు. ఆరోజు ఎలా వుందో ఇవాళ కూడా అలాగే ఉంది. వీటిని ముందుగా దెబ్బకొట్టంది ఈ-కామర్స్. తర్వాత ఎం-కామర్స్. ముందొచ్చిన కిరాణా స్టోర్ కంటే వెనకొచ్చిన సూపర్ మార్కెట్ గ్రేట్ అన్నట్టుగా తయారైంది. టెక్నాలజీ ఎంత పరుగులు పెడుతున్నా.. వీధి చివరన ఉండే దుకాణం ఏమాత్రం మారలేదు. అందుకే కిరాణా కొట్టు కూడా సూపర్ మార్కెట్ కి ఏమాత్రం తీసిపోవద్దనే ఉద్దేశంతోనే స్నాప్ బిజ్ అనే క్లౌడ్ టెక్నాలజీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది.

మన దేశంలో కిరాణా షాపు ప్రజల దైనందిన జీవనంలో భాగమైంది. ఆ మాటకొస్తే రిటెయిలర్లు దేశంలోనే మొట్టమొదటి ఆంట్రప్రెన్యూర్లు. బిజినెస్‌ ని ఒక కల్చర్‌లాగా విస్తరింపజేశారు. వ్యాపార దృక్పథం ఒక్కటే కాదు.. ఆత్మీయత, అభిమానం, స్నేహం అన్నీ కలగలిసి ఉంటాయి. చాలా ఏళ్లుగా జనంతో మమేకమైన కిరాణా స్టోర్ సూపర్ మార్కెట్ల పుణ్యమాని వెనుకబడిపోయింది. హైపర్ మార్కెట్ల ధాటికి విలవిల్లాడిపోతోంది. ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్ లో వీధి చివర దుకాణం కనమరుగవడం ఖాయం. 

అందుకే మానవుని దైనందిన జీవనంలో భాగమైన కిరాణా స్టోర్‌ ను జనం నుంచి దూరం చేయొద్దనే ఉద్దేశంతోనే స్పాప్ బిజ్ అనే క్లౌడ్ టెక్నాలజీ సంస్థ ముందుకొచ్చింది. కస్టమర్లకు ఎప్పటికప్పుడు ఆఫర్లను తెలియజేయడం, కమ్యూనికేట్ చేయడం, ఎస్సెమ్మెస్ రూపంలో పంపడం దీని మెయిన్ కాన్సెప్ట్. కిరాణా షాప్ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అందిస్తున్నది స్నాప్ బిజ్. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక ట్రెడిషనల్ కిరాణా షాపుని డిజిటల్ సూపర్ మార్కెట్ లాగా, వర్చువల్ సూపర్ మార్కెట్ కింద తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం.

ఉదాహరణకు ఒక వ్యక్తి సూపర్ మార్కెట్ కి వెళ్తే మినిమం 150 రూపాయలు తగ్గకుండా సరుకులు కొంటాడు. అదే వినియోగదారుడు కిరాణా షాపుకొస్తే 90-100 రూపాయల లోపే ఐటెమ్స్ తీసుకుంటాడు. దానికి కారణాలు అనేకం. సూపర్ మార్కెట్లోలాగా కిరాణా షాపులో డిస్ ప్లే కనిపించదు. సరిపడా స్థలం ఉండదు. కస్టమర్ ని ఆకట్టుకునే ప్రైస్ బోర్డు కూడా వీలుకాదు. వీటన్నిటికీ పరిష్కారం చెప్తుంది స్పాప్ బిజ్ సాఫ్ట్ వేర్.

దేశంలో 9మిలియన్ రిటెయిలర్స్ దాకా ఉంటారని అంచనా. వాళ్లంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తునారు. ఒక్కో రిటెయిలర్ మూడు నుంచి నాలుగు కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. దేశంలో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ విలువ 120 బిలియన్ డాలర్స్ ఉంటుందని అంచనా. అందులో 50 శాతం ప్యాకేజ్ గూడ్స్.. మరో 50 శాతం లూజ్ ఐటెమ్స్ ఉంటాయి. ప్రతీరోజూ 750 మిలియన్ డాలర్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. డెయిలీ 1.2 బిలియన్ వినియోగదారులు రిటెయిలర్లతో టచ్‌లో ఉంటారు. వెయ్యికి పైగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలున్నాయి.

ప్రస్తుతానికి స్నాప్ బిజ్ ఆపరేషన్స్ బొంబాయి, పుణె, ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్ లో ఉన్నాయి. మూడు నెలల క్రితమే గుజరాత్ లో స్టార్ట్ చేశారు. దేశం మొత్తమ్మీద 2,500 సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్స్ ఉన్నాయి. హైదరాబాదులో 80 సిస్టమ్స్ దాకా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీ మీద ఫోకస్ చేశారు. వచ్చే ఏడాదికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3వేల సిస్టమ్స్ ఇన్ స్టాల్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

2013లో ఏర్పాటైన స్పాప్ బిజ్ సంస్థకు రతన్ టాటా ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచారు. హైదరాబాద్‌, ముంబై,పుణె, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో వేలాది కిరాణా దుకాణాలతో కలిసి పనిచేస్తోందీ సంస్థ. రానున్న రోజుల్లో ద్వితీయ,తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రతన్‌ టాటా పెట్టుబడులు స్నాప్‌బిజ్‌ వ్యాపార వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా, దేశీ కిరాణా స్టోర్లలో డిజిటల్‌ విప్లవానికి ఊతమిచ్చింది. ఈ సంస్థతో కలిసి పనిచేసేందుకు పలు పెద్ద బ్రాండ్లు ముందుకు వస్తున్నాయి.      

Related Stories

Stories by team ys telugu