మన ఇంటి కూరగాయలు..

-సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు-వెబ్ ద్వారా సాగులో శిక్షణ -దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పూర్ణ ఆర్గానిక్స్

0

మాటకామాటే చెప్పుకోవాలి. జనంలో హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఇన్నాళ్లూ అడ్డమైనగడ్డి తిని వొళ్లు పాడుచేసుకున్నాం. ఇకనైనా రోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం అనే స్పహ జనంలో వచ్చింది. ఈ చైతన్యంలోంచి పుట్టిందే సేంద్రీయ ఉద్యమం

2008 నుంచి మొదలైన ప్రస్థానం..

పూర్ణ ఆర్గానిక్స్ 2008లో బెంగళూరులో ప్రారంభమైంది. ఇప్పటికే 10,000లకుపైగా కస్టమర్లకు చేరువైందీ కంపెనీ. ఎవరికివారు ఇంటిపైన, బాల్కనీల్లో, పెరట్లో కూరగాయలు పండించేలా ప్రోత్సహిస్తోందీ సంస్థ. ఇందుకోసం ప్రత్యేక, ఎక్కువ కాలం మన్నే యూవీ స్టెబిలైజ్డ్ బాక్సులను పూర్ణ ఆర్గానిక్స్ సరఫరా చేస్తోంది. మొక్కలను సమయానికి నీళ్లు పట్టించేలా సెల్ఫ్ వాటరింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో పెట్టెలు తయారయ్యాయి. ఉత్పత్తులన్నీ పూర్ణ ఆర్గానిక్స్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలా వినియోగించాలో వీడియోలు కూడా ఉన్నాయి. గార్డెనింగ్ నిర్వహణపై వెబ్‌సైట్లో పూర్తి వివరణలు ఉంచారు సంస్థ ఫౌండర్ మల్లేశ్ తింగలి.

ఈ-గార్డెనింగ్..

గతేడాది 500ల మందికిపైగా వెబ్ ద్వారా ఇంట్లోనుంచే శిక్షణ తీసుకున్నారని అన్నారు. ఎకోపాల్, గార్డెన్ కనెక్ట్ కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, కార్పొరేట్ కంపెనీలకు కంపెనీ చేరువ అవుతోంది. 3,000లకుపైగా విద్యార్థులకు కూరగాయలు పెరిగే, పండించే విధానం గురించి వివరించారు. అలాగే ఖాళీ సమయాల్లో కూరగాయల సాగు చేపట్టి దానిని వ్యాపకంగా మలుచుకునేలా 1,000కిపైగా వివిధ కంపెనీల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.ఔత్సాహిక కస్టమర్లకు వ్యక్తిగతంగానూ, ఆన్‌లైన్ ద్వారానూ శిక్షణ ఇస్తున్నారు. ఇంటి దగ్గర నుంచే కస్టమర్లు సులభంగా నేర్చుకుంటున్నారని చెబుతున్నారు మల్లేష్.

పూర్తి స్థాయి కంపెనీగా..

ప్లాంటర్ బాక్సులకు కంపెనీ పేటెంటుకు దరఖాస్తు చేసింది. సేంద్రియ మొక్కల పెంపకం, సేంద్రియ పురుగు మందుల వాడకం, పరికరాలనూ సరఫరా చేస్తోంది. ఆహారోత్పత్తులు, వ్యక్తిగత, సౌందర్య సంరక్షణ ఉత్పత్తులూ కంపెనీ సిబ్బంది ద్వారా విక్రయిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లించొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ విధానమూ ఉంది. ఇక బాక్సులను అమర్చడం చాలా తేలిక. అవసరమైతే ఫోన్‌లో టీం వివరిస్తుంది. బెంగళూరు కస్టమర్లు కోరితే టీం సభ్యులు ప్రత్యక్షంగా వెళ్లి అమరుస్తారని మల్లేష్ తెలిపారు. ఈ రంగంలో చాలా కంపెనీలే ఉన్నా.. శిక్షణ, ఉత్పత్తులు, సేవలు వ్యవస్థీకృత విధానంలో అందించే కంపెనీ తమదేనని ఆయన అన్నారు.

చెట్టంత లక్ష్యం..

ధ్రువీకరణ ఉన్న సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ఒక వేదికను ఏర్పాటు చేసే పనిలో కంపెనీ నిమగ్నమైంది. ఈ మార్కెట్ ప్లేస్ విధానం త్వరలోనే అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఈ వేదికపైకి రావొచ్చు. ఫుడ్, హోం, హెల్త్, వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను ఈ వేదిక ద్వారా విక్రయిస్తామని మల్లేష్ తెలిపారు. కస్టమర్లు సేంద్రియ ఉత్పత్తుల పట్ల మొగ్గు చూపేలా చేస్తామని చెప్పారు. అందుబాటు ధరలో సేంద్రియ ఉత్పత్తులు కస్టమర్లకు చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్‌లో సేంద్రియ సాగు ఊపందుకుంది. కొన్ని వేదికలు పంపిణీకి వేదికయ్యాయి. అయితే ఒక స్థాయి వరకే ఈ విధానం పరిమితమవుతోంది. దేశవ్యాప్తంగా విస్తరణ దిశగా అడుగులేస్తున్నాం. విభిన్న తరహాలో ఉత్పత్తిదారులకు, కస్టమర్లను అనుసంధానిస్తాం అని మల్లేష్ వెల్లడించారు.