భీమ్ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

ఇంటర్నెట్ లేకున్నా స్మార్ట్ ఫోన్ లేదా ఫీచర్ ఫోన్ ఉంటే చాలు

భీమ్ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

Saturday December 31, 2016,

2 min Read

డిజిటల్ లావాదేవీలను ఈజీ చేయడానికి ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్ ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ అనబడే ఈ యాప్ ను ఇంటర్నెట్ లేకపోయినా ఉపయోగించవచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్, లేదంటే ఫీచర్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో ఆన్ లైన్ లావాదేవీలు జరపొచ్చు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డెవలప్ చేసిన ఈ యాప్ బ్యాంక్ అకౌంట్స్, యూపీఐతో ఇంటర్ లింక్ అయి వుంటుంది.

ఇంతకూ యూపీఐ అంటే ఏంటి?

మొబైల్‌ ఫోన్‌ ద్వారా తక్షణ చెల్లింపుల సౌకర్యాన్ని అందించే వినూత్న విధానమే యూపీఐ. నగదు జమ చేయాల్సిన ఖాతాదారుడి వర్చువల్‌ ఐడీ తెలిస్తే చాలు క్యాష్ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. బ్యాంకు ఖాతా, కార్డు నెంబరులాంటి ఎలాంటి వివరాలను చెప్పాల్సిన చేయాల్సిన అవసరం లేదు.

మరి భీమ్ యాప్ అంటే..?

<మొబైల్ నంబర్@యూపీఐ> లేదంటే <యూజర్ ఐడీ@యూపీఐ> ఇదే భీమ్ యాప్ ప్రైమరీ అడ్రస్. వీటి ద్వారానే నగదు పొందవచ్చు. లేదంటే ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.

image


చేయాల్సిందల్లా ఒకటే. మొదటగా భీమ్ యాప్ కు బ్యాంక్ అకౌంట్ నెంబర్ రిజిస్టర్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. అంతే.. యాప్ ఓపెన్ చేసి, మనీ సెండ్ ఆప్షన్ కొట్టి, ఇవ్వాల్సిన మొత్తాన్ని టైప్ చేసి.. అవతలి వారి ఫోన్ నెంబర్ టైప్ చేస్తే చాలు.. చెల్లింపు జరిగిపోతుంది.

ఈ యాప్ వాడాలంటే స్మార్ట్ ఫోనే అవసరం లేదు. ఏ మొబైల్ నుంచైనా *99# ను డయల్ చేస్తే మెనూ కనిపిస్తుంది. నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల హిస్టరీ కోసం వివిధ నెంబర్లు వాటిలో అగుపిస్తాయి.

నాన్ యూపీఐ బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు పంపొచ్చు. కాకపోతే ఆయా ఖాతాల ఐఎఫ్ఐసీ, ఎంఎంఐడీ కోడ్ వివరాలు కావాలి. డబ్బులు పంపిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయమూ ఉంది. ట్రాన్సాక్షన్ డిటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు.

క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయడం ఇంకా ఈజీ. స్కాన్ చేసిన మరుక్షణమే మర్చెంట్ కు నగదు బదిలీ అయిపోతుంది. ఒక రోజులో మినిమం పదివేలు.. మాగ్జిమం 20వేల లావాదేవీలు జరపొచ్చు.

భీమ్ యాప్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంది. త్వరలో అన్నీ ప్రాంతీయ భాషల్లోకి తీసుకొస్తామని NPCI చెప్తోంది.

భీమ్ యాప్ కు సపోర్ట్ చేసే బ్యాంకులు ఇవే

అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, కేథలిక్ సిరియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెడ్ఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఐడీబీఐ బ్యాంకుతో పాటు తదితర బ్యాంకులు భీమ్ యాప్ ద్వారా లావాదేవీలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయి.

భీమ్ యాప్ ద్వారా జరిగిన లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేయరు. మొబైల్ వాలెట్ ద్వారా అయితే మొదట దాంట్లో క్యాష్ ట్రాన్స్ ఫర్ చేయాలి. ఆ తర్వాతనే వాడుకోవాలి. కానీ ఈ యాప్ అలా కాదు. డెబిట్ కార్డు మాదిరిగానే కస్టమర్ల ఫోన్ కు డైరెక్ట్ గా బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి పేమెంట్లు వెనువెంటనే జరిపోతాయి. దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

ప్రస్తుతానికి యాండ్రాయిడ్ వెర్షన్ లో ఉన్న ఈ యాప్ త్వరలో ఐఓఎస్ వెర్షన్ లో కూడా లాంఛ్ చేయబోతున్నారు. 

యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి