వీళ్లంతా ఏం వ్యాపారం చేస్తున్నారో తెలుసా..?

వ్యాపార రంగంలో రాణిస్తున్న సెలబ్రిటీలు

వీళ్లంతా ఏం వ్యాపారం చేస్తున్నారో తెలుసా..?

Friday January 13, 2017,

3 min Read

దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత తెలిసిందే. ఈ సూత్రం సినిమా తారలకు బాగా వర్తిస్తుంది. వెండితెరమీద వెలుగున్న తరుణంలోనే ఏదో ఒక బిజినెస్ రంగంలోకి ఎంటరవుతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటారో తెలియదు. ఒక్కసారి కెమెరా నుంచి తప్పుకున్నాక ఆర్ధిక వనరు అడుగంటి పోతుంది. అందుకే తెరమరుగయ్యాక కూడా ఫైనాన్సియల్ గా దృఢంగా ఉండాలంటే బిజినెస్ వెంచర్ తప్పనిసరి. అందుకే ఆంట్రప్రెన్యూర్లుగా కంఫర్ట్ జోన్‌లోకి వెళ్లిపోతారు. ఇందుకు క్రీడాకారులేం అతీతులు కాదు. వాళ్లకూ సొంత వ్యాపారాలున్నాయి. ఏ సెలబ్రిటీ ఏ వ్యాపార రంగంలో రాణిస్తున్నాడో ఒక లుక్కేయండి.

image


శిల్పాశెట్టి

ఈ లాంగ్ లెగ్‌డ్‌ బ్యూటీది బాడీకి తగిన మైండ్ సెట్. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అసోసియేట్ సంగతి పక్కన పెడితే, శిల్పాశెట్టి అనేక స్పా సెంటర్లు లాంచ్ చేసింది. ఆమధ్య గోల్డ్ బిజినెస్‌లోకి ఎంటర్ కావాలని ప్రయత్నించింది. 2014లో తన సొంత కంపెనీ అయిన ఎస్సెన్షియల్ స్పోర్ట్స్ మీడియా బేనర్లో దిష్కియాన్ అనే సినిమా కూడా ప్రొడ్యూస్ చేసింది.

సునీల్ శెట్టి

యాక్షన్ హీరో సునీల్ శెట్టిలో మాస్ యాంగిలే కాదు వ్యాపార కోణమూ ఉంది. సినిమా షూటింగులు లేని టైంలో తన రెస్టారెంట్ బిజినెస్‌లో తలమునకలై ఉంటాడు. ఫిలిం ప్రొడ్యూసర్‌గానే కాకుండా బట్టలు, హోం డెకార్ సెగ్మెంట్లలో కూడా ఈ యాక్షన్ హీరోకి వెంచర్లున్నాయి.

సుస్మితా సేన్

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ వెండితెర నుంచి దూరమయ్యాక అతితక్కువ కాలంలోనే వ్యాపారవేత్తగా రాణించింది. ఆమె పాజిటివ్ ఆటిట్యూడ్ జివెల్రీ రంగంలో ఎదిగేలా చేసింది. దుబాయ్‌లో సుస్మితకు రిటైల్ బంగారం షాప్ ఉంది. దాంతోపాటు పలు హోటళ్లు, స్పా సెంటర్లు ఉన్నాయి.

జాన్ అబ్రహం

కండలవీరుడు జాన్ అబ్రహం సినిమాల మీద, ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెడతాడో, వ్యాపారం మీద అంతే దృష్టి సారిస్తాడు. తన సొంత ప్రొడక్షన్ హౌజ్ జేఏ ప్రొడక్షన్స్ అతన్ని క్రియేటివ్ ఆంట్రప్రెన్యూర్ అయ్యేలా చేసింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ బిజినెస్ లీడర్ షిప్ అవార్డు సెవెంత్ ఎడిషన్లో జాన్ క్రియేటివ్ ఆంట్రప్రెన్యూర్‌ గా ఎంపికయ్యాడు. బ్రిటిష్ బాక్సింగ్ లెజెండ్ డేవిడ్ హాయెతో కలిసి ఫిట్ నెస్ ఫ్రాంచైజీ మొదలుపెట్టాడు. అందులో బాక్సింగ్ మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాడు.

లారా దత్తా

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ లారా దత్తాకు భీగి బసంతి అని సొంత ప్రొడక్షన్ హౌజ్ ఉంది. ఒకపక్క ఫిట్ నెస్ డీవీడీలు విడుదల చేస్తూనే మరోవైపు చాబ్రా 555తో కలిసి శారీ కలెక్షన్ చేస్తోంది.

ట్వింకిల్ ఖన్నా

ట్వింకిల్ ఖన్నా నటిగా మెప్పించడమే కాదు మంచి రచయిత కూడా. డీఎన్‌ఏ ఇండియాకు రెగ్యులర్ కాలమిస్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మిస్సెస్ ఫన్నీబోన్స్ ద్వారా రచయితగా ఆమె జనాలకు మరింత దగ్గరయ్యారు. రచనా వ్యసాంగం పక్కన పెడితే, గ్రేజింగ్ గోట్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్ ఉంది. దానికి ట్వింకిల్ కో ఫౌండర్. ముంబై వ్యాప్తంగా ఉన్న వైట్ విండో అనే ఇంటీరియర్ డిజైన్ స్టోర్ బ్రాంచీలకు ఆమె కో-ఓనర్.

ఇక క్రీడాకారుల్లోనూ ఆంట్రప్రెన్యూర్లకు కొదవలేదు. కెరీర్ కొనసాగుతున్నప్పుడే వ్యాపారాలకు పునాదులు వేసుకున్నవారు ఎంతోమంది.

వీరేంద్ర సెహ్వాగ్

బంతిని వీరుబాదుడు బాదే వీరేంద్రుడు మైదానంలో దూకుడు ప్రదర్శించినా కాస్తో కూస్తో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. భావిభారత పౌరులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హర్యానా ఝజ్జర్‌ లో సెహ్వాగ్ పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నాడు.

జహీర్ ఖాన్

ఈ టాలెంటెడ్ ఫాస్ట్ బౌలర్ కు పుణెలో జడ్‌ కే పేరుతో రెస్టారెంట్ ఉంది. 2005లో దీన్ని స్థాపించాడు. రుచికరమైన ఆహారాన్ని, స్పోర్ట్స్‌ తో మిక్స్ చేసి అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. పుణెలోని లుల్లానగర్‌లో జహీర్ ఖాన్‌కు చెందిన రెస్టారెంట్ కమ్ స్పోర్ట్స్ లాంజ్, బార్ కస్టమర్లను కట్టిపడేస్తోంది.

సానియామీర్జా

సక్సెస్ ఫుల్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు హైదరాబాదులో రిస్ట్రెట్టో కాఫీ షాప్ ఉంది. జంటనగరాల్లో ఉన్న అతిపెద్ద కాఫీ షాపుల్లో ఇదొకటి. మరో వెంచర్ వైజాగ్ లో ఏర్పటు చేయాలని ప్లాన్ చేస్తోంది. తర్వాత సౌతిండియా అంతా విస్తరించాలనేది సానియా టార్గెట్. భావి టెన్నిస్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న సానియా మీర్జా అకాడమీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.