ఖచ్చితమైన ఆటోమొబైల్ రివ్యూలకు కేరాఫ్ అడ్రస్ 'మోటార్ బీమ్'

కార్లు, బైకుల రివ్యూలు అందిస్తున్న వెబ్ సైట్నిజాయితీ రివ్యూలకు కేరాఫ్ అడ్రస్బ్లాగ్ నుంచి వెబ్ సైట్ వరకు... ఫైజల్ లాంగ్ డ్రైవ్పాఠకులను ఆకట్టుకోవడమే మోటార్ బీమ్ టార్గెట్

ఖచ్చితమైన ఆటోమొబైల్ రివ్యూలకు కేరాఫ్ అడ్రస్ 'మోటార్ బీమ్'

Wednesday July 01, 2015,

3 min Read

వ్యాపారవేత్తలు రెండు రకాలు. తమ కలలను నెరవేర్చుకునేవాళ్లు ఒకరైతే... మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేవాళ్లు ఇంకొకరు. ఈ రెండు కాకుండా మరో తరహా వ్యాపారవేత్తలు ఉంటారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే వాళ్లన్నమాట. అలాంటి వ్యక్తి ఫైజల్ ఖాన్. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అన్న టైప్ ఫైజల్ మైండ్ సెట్. అందుకే ఫైజల్ బిజినెస్... మార్కెట్లో ఉన్న పోటీ సంస్థలకు భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఎవరా ఫైజల్..? అతని బిజినెస్ ఏంటో తెలుసుకోవాలంటే అతడినే పలకరించాలి.

బ్లాగ్ టు వెబ్ సైట్

ఫైజల్ ఖాన్... మోటార్ బీమ్ వ్యవస్థాపకుడు. మోటార్ బీమ్ ఏంటనుకుంటున్నారా? ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మార్కెట్లోకి ఏ ప్రొడక్ట్ వచ్చినా... దానికి సంబంధించిన రివ్యూ మోటార్ బీమ్ వెబ్ సైట్ లో ప్రత్యక్షమవుతుంది. ఆటోమొబైల్ మార్కెట్లోని ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు, నిజాయితీతో కూడిన రివ్యూలు ఇందులో ఉంటాయి. ఏ వాహనం గురించైనా సరే... వీరి దగ్గర పక్కా సమాచారం, హానెస్ట్ రివ్యూ ఉంటుంది. ముంబైలోని స్టార్టర్ లీడర్ షిప్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఫైజల్ ను యువర్ స్టోరీ టీమ్ కలిసి పలకరించింది. అతడి గురించి, అతడి బ్లాగ్ గురించి, ఆ బ్లాగ్ వెబ్ సైట్ గా మారిన తీరు గురించి మొత్తం తెలుసుకుంది. బైకులు, కార్లకు సంబంధించి అత్యంత నిజాయితీతో కూడిన రివ్యూలను అందించడమే తన లక్ష్యమని ఒక్క వాక్యంలో తన వెబ్ సైట్ గురించి వివరించాడు ఫైజల్. అంతేకాదు... ఇండియాలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంత నిజాయితీగా రివ్యూలు అందించే వెబ్ సైట్లు లేవని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు ఫైజల్.

“ఆటోమొబైల్ ఉత్పత్తుల పూర్తి వివరాలు, క్వాలిటీ, నిజాయితీగా ఉండే రివ్యూలకు మా వెబ్ సైట్ వేదిక కావాలన్నది మా లక్ష్యం” అంటాడు ఫైజల్.
పైజల్, మోటార్ బీమ్ వ్యవస్థాపకుడు

పైజల్, మోటార్ బీమ్ వ్యవస్థాపకుడు


ఫస్ట్ గేర్ @మోటార్ బీమ్

అది 2008వ సంవత్సరం. మే నెల. మోటార్ బీమ్ అప్పుడే మొదలైంది. మోటార్ బీమ్ ఇప్పుడంటే వెబ్ సైట్ కానీ... కొన్నేళ్ల క్రితం అది ఓ బ్లాగ్ మాత్రమే. తన హాబీగా ఫైజల్ ప్రారంభించిన బ్లాగ్ వెబ్ సైట్‌గా మారి పాఠకుల ఆదరణ సంపాదించుకుంటోంది. ప్రస్తుతం ప్రతీ రోజూ 40 వేల మంది నెటిజన్లు మోటార్ బీమ్ వెబ్ సైట్‌ను సందర్శిస్తున్నారు. అంటే నెలకు 12 లక్షల మందికి పైగా అన్నమాట. ఇదంతా రాత్రికి రాత్రి అందిన విజయం కాదు. ఆరేడేళ్లుగా నెమ్మదిగా నెటిజన్లలో ఆదరణ సంపాదించుకుంది. ఇప్పుడు సూపర్ హిట్టైంది. ఫైజల్ మొదట్లో చదువు, ఇంటర్న్‌షిప్ పైనే దృష్టి పెట్టేవాడు. కానీ ఈ చదువులు, కార్పొరేట్ జీవితం తనకు తగినది కాదని తెలుసుకున్నాడు. తనకేం కావాలో, తన కలలేంటో, వాటినెలా నెరవేర్చుకోవాలో అతడికి అప్పుడు జ్ఞానోదయం కలిగింది. అంతే మోటార్ బీమ్ బ్లాగ్ పుట్టింది. ఇప్పుడదే వెబ్ సైట్‌గా మారి... రీడర్స్‌కు ఫేవరెట్‌గా మారిపోయింది. ఐదేళ్ల నుంచి వెబ్ సైట్ నడుస్తున్నా... ఇంకా ఎలాంటి లాభాలు లేవు. అలాగని నష్టాలు కూడా లేవు. లాభనష్టాల్లేకుండా వెబ్ సైట్ నిర్వహణ సాగిపోతోంది. దీని గురించి ఫైజల్ కు అస్సలు బెంగలేదు. ఎందుకంటే... అతడి ఫోకస్ అంతా పోర్టల్ డెవలప్ చెయ్యడం గురించే. అంతేకాదు... ఫోరమ్స్, సోషల్ మీడియా ద్వారా వెబ్ సైట్ కు మరింత గుర్తింపు తీసుకురావాలన్నది అతడి ఆశయం. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం మోటార్ బీమ్ డిజిటల్ ఆటోమొబైల్ మేగజైన్ ను ప్రారంభమైంది. చూడ్డానికి రియల్ మేగజైన్‌లా ఉంటూ రీడర్స్ కు సౌకర్యవంతంగా ఉంది.

హానెస్ట్ రివ్యూలపైనే ఫోకస్

వ్యాపార విస్తరణ గురించి అడిగితే తన దృష్టి అంతా కంటెంట్ పైనే అంటాడు ఫైజల్. మరింత మంచి కంటెంట్ ను రీడర్స్ కు అందించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

"మార్కెట్లో ఆటోమొబైల్ కంటెంట్ అందించే వాళ్లంతా రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి పాలసీ కొన్నాళ్లే వర్కవుట్ అవుతుంది కానీ దీర్ఘ కాలం కాదు. చాలామంది యూజ్డ్ కార్లపైనే ఫోకస్ పెట్టారు. సెర్చ్ ఇంజిన్లను ప్రసన్నం చేసుకునేందుకు కంటెంట్ తయారు చేస్తున్నారు తప్ప రీడర్స్ గురించి ఆలోచించట్లేదు. కానీ మేము రీడర్స్ కోసం రాస్తున్నాము కానీ సెర్చ్ ఇంజిన్ల కోసం కాదు. ఎలాంటి వాస్తవాలు దాచకుండా విస్తృతమైన, విస్తారమైన రివ్యూలు ఇవ్వడంపైనే మా ఫోకస్. చాలా వరకు ప్రధానమైన మేగజైన్ల నిర్వాహకులు ఆటోమొబైల్ తయారీదారుల నుంచి వ్యాపార ప్రకటనలు తీసుకుంటారు. అందుకే వాళ్లు రాసే రివ్యూల్లో నిజాయితీ కనిపించదు" అని మార్కెట్ తీరు గురించి వివరిస్తున్నాడు ఫైజల్.

image


లాంగ్ డ్రైవ్

స్టార్టప్ లీడర్ షిప్ ప్రోగ్రామ్ ఫైజల్ కు ఎంతగానో ఉపయోగపడింది. ఈ ప్రోగ్రామ్ గురించి, ఇక్కడున్న మంచి విషయాలు, లాభాల గురించి తెలుసుకున్నానని చెబుతున్నాడు ఫైజల్.

"నేను ఇంతకుముందు ఏ స్టార్టప్ గ్రూప్ లో లేను. నేను చేరిన మొదటి ప్రోగ్రామ్ ఎస్ఎల్పీ. నా బిజినెస్ ను మరింత విశాల దృష్టితో చూసేందుకు ఈ ప్రోగ్రామ్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఇక్కడ నేర్చుకున్న విషయాలు ప్రొడక్టివిటీ పెంచేందుకు దోహదపడ్డాయి" అని వివరిస్తున్నాడు ఫైజల్.

మొదటి రెండేళ్లు ఫైజల్ పడ్డ శ్రమ, కృషి చూసిన అతని సోదరుడు జావేద్... ఫైజల్ కు జత కలిశాడు. అలా 2010లో తొలి ఉద్యోగి మోటార్ బీమ్ లో చేరాడు. ప్రస్తుతం ఫైజల్ టీమ్ లో పది మంది సభ్యులున్నారు. మార్కెట్ నడుస్తున్న దానికంటే భిన్నమైన దారిలో వెళ్లడం ఫైజల్ లాంటి సాహస పారిశ్రామికవేత్తకు ఎంతో ఉపయోగకరమనే చెప్పాలి. అలాంటి వైఖరే మోటార్ బీమ్ కు పాఠకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మరింతమంది పాఠకులను సంపాదించుకోవడం, వారికోసం సరైన ప్లాట్ ఫామ్ రూపొందించడంలో ప్రస్తుతం మోటార్ బీమ్ టీమ్ బిజీబిజీగా ఉంది. అంతేకాదు... ఆటోమొబైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూస్తున్నారు వారంతా.