భాగ్యనగరంలో వెయ్యి వై-ఫై హాట్ స్పాట్స్.. త్వరలో మూడువేలకు పెంపు

0

హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింప జేసేందుకు నగరవాసులకు ఉచిత వైఫై సేవలను విస్తృత పరిచింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. డిజిటల్ తెలంగాణ విజన్లో భాగంగా నగరంలోని జనభా అధికంగా ఉన్న 1,000 ప్రాంతాల్లో హాట్స్పాట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో వీటిని 3 వేల ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. హాట్స్పాట్స్ ప్రాంతాల వివరాలను జీహెచ్ఎంసీ, ఐటీశాఖ వెబ్సైట్లలో పొందుపరిచారు. అన్నీ అందుబాటులోకి వస్తే 3 వేల ఉచిత హాట్ స్పాట్లతో దేశంలోనే మొదటి పూర్తి వైఫై సిటీగా హైదరాబాద్ నిలువబోతోంది.

ప్రస్తుతానికి 5-10 ఎంబీపీఎస్ వేగంతో 30 నిమిషాలపాటు ఉచితంగా వైఫై అందిస్తున్నారు. తర్వాత నామామాత్రపు చార్జీలు విధిస్తారు. పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేష న్లు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రద్దీ ప్రాంతాల్లో హాట్ స్పాట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో పలు సెల్యులార్, ఇతర కంపెనీలు భాగస్వాములయ్యాయి. ఇతర కంపెనీలు కూడా ముందుకు రావాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది.

రెండేండ్ల కిందట ప్రయోగాత్మకంగా 100 చోట్ల హాట్స్పాట్లు అందుబాటులోకి తెచ్చారు. అది విజయవంతం కావడంతో ఆ సంఖ్యను వెయ్యికి చేశారు. మరో మూడు నెలల్లో 3 వేల ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. సెల్ ఫోన్ సంస్థల మధ్య పోటీ, సమన్వయ లోపం కారణంగా సేవల్లో కొంత అంతరాయం జరిగింది. ఇకపై కలిసికట్టుగా వైఫై సేవలు అందించే దిశగా కృషి చేస్తామని ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ చెప్పారు. త్వరలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో ఈ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తామన్నారు.  

Related Stories

Stories by team ys telugu