వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారా? మీకోసమే ఈ సూచనలు..

యువ పారిశ్రామికవేత్తల కోసం విలువైన సలహాలు

వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారా? మీకోసమే ఈ సూచనలు..

Tuesday March 22, 2016,

3 min Read


ప్రతినెలా స్థిరమైన ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. కొందరైతే తమ మదిలో మెదిలిన వెంటనే జాబ్ ను వదిలేసి, వ్యాపారం చేసేందుకు ముందుకొస్తారు. మరికొందరు కొంతకాలం పాటు ఊగిసలాడుతారు. జాబ్ చేయడమా? బిజినెస్ లోకి దిగడమా? అని ఆలోచిస్తారు. ఇంకొందరికి మాత్రం బిజినెస్ చెయ్యాలనుంటుంది కానీ, జాబ్ ను వదిలి రాలేరు. బిజినెస్ లోకి ఎందుకు దిగలేదా అని కొన్నాళ్ల తర్వాత బాధపడతారు.

చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆంట్రప్రెన్యూర్ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారా? ఇప్పటికే అలాంటి డెసిషన్ తీసేసుకున్నారా? ఐతే మీలాంటి వారి కోసం ఈ సలహాలు. ఆంట్రప్రెన్యూర్ రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉన్న హెర్ష్ లీలా రమణి కొన్ని సూచనలు ఇస్తున్నారు. వ్యాపారంలోకి అడుగుపెట్టేముందు ఆ సూచనలను గుర్తుంచుకోవాలని ఆయన అంటున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..

image


1. జీవితం తాత్కాలికం

ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అది మీకప్పటికే తెలుసు. మీరు, నేను, మన బంధువులు, స్నేహితులు అందరం భూమ్మీద శాశ్వతంగా ఉండిపోము. ఏదో కొన్ని రోజులు బతకడానికి వచ్చాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టడం ఎందుకు? మీ కలలను, మీ లక్ష్యాలను మీరే నిర్ణయించుకోండి. వెంటనే పథ నిర్దేశం చేసుకుని ముందుకు సాగండి.

2. అనవసర బాధ్యతలను నెత్తినేసుకోవద్దు..

స్టార్టప్ కెరీర్ ను ప్రారంభించే ముందు మీపై అనసవర బాధ్యతలు లేకుండా చూసుకోండి. కొత్త కారు కోసం లోన్, మీ క్రెడిట్ కార్డుపై టీవీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం వంటి బాధ్యతలు లేకుండా చూసుకోవాలి. మీ వ్యాపారంలోకి అవి ఉపయోగపడతాయంటే తప్ప, అనవసరమైనవాటిని నెత్తినేసుకోవద్దు. అవసరం లేని వాటి ఈఎంఐలు కట్టేందుకు మీరు ఉద్యోగాన్ని వదలొద్దు.

3. జీవిత నైపుణ్యం..

ఉద్యోగాన్ని వదిలేసే ముందు ఓ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీకు అనేక విధాలుగా ఆదాయం వస్తున్నదీ లేనిదీ సరి చూసుకోవాలి. గతంలో జాబ్ చేసినప్పుడు ఏవైనా సేవింగ్స్ చేసి ఉంటే.. వాటిని సరైన విధంగా పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడే రోజువారీ ఖర్చులకు కొంత ఆదాయం వస్తుంది. మీరు కాలేజీలో చదివినప్పుడు మీ బడ్జెట్ ను ఎలా ఫిక్స్ చేసుకున్నారో గుర్తు చేసుకోవాలి. మీ జీవిత చక్రంలో ఇదో ముఖ్యమైన నైపుణ్యం. దీన్ని నేను స్కిల్ ఆఫ్ సర్వైవల్ (జీవిత నైపుణ్యం)గా పిలుస్తాను. ఒకవేళ మీకు సరిపడా ఆదాయం లేకపోతే పార్ట్ టైమ్ జాబ్ కానీ, వర్క్ ఫ్రం హోం వంటి పనులు కానీ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోం కోసం fiverr వంటి ఫ్రీలాన్స్ వెబ్ సైట్ లను విజిట్ చేయాలి. ఇలాంటి నిజమైన ఆదాయాన్ని ఇచ్చే వెబ్ సైట్ల ద్వారా రోజువారీ ఖర్చులకు డబ్బు సంపాదించొచ్చు.

4. సరైన తరుణం ఇదే..

జీవితంలో చాలామందిని చూస్తుంటాం. ఏదైనా పని ప్రారంభించే ముందు సవాలక్ష సాకులు చెప్తుంటారు. అది జరిగితే.. ఇది జరిగితే చేస్తాను అంటూ సాగదీస్తుంటారు. కొత్త దాన్ని ప్రారంభించేందుకు సరైన సమయమంటూ ఏదీ ఉండదు. మనం ఎప్పుడనుకుంటే అప్పుడే సరైన సమయం. అనుకున్నప్పుడే ప్రారంభించడమే అన్నింటికంటే అత్యుత్తమమైన సమయం. ధైర్యంగా తొలి అడుగువేసినప్పుడు అన్ని సర్దుకుంటాయి. ఒక్కసారి బరిలోకి దిగి చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఊహించుకోవడం ముందుగా ఆపేయాలి. చేయాలనుకున్నది చేసేయాలి. మనం ఏదైతే జరుగుతుందని ముందు ఊహిస్తామో, బరిలోకి దిగిన తర్వాత అది అస్సలు కనిపించనే కనిపించదు. 

5. మీ గురించి మీరు చెప్పుకోండి..

వ్యవస్థాపక రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న యువకులందరికీ నేను ఇస్తున్న సలహా ఒక్కటే. మీ పని గురించి మీరు చెప్పుకోండి.. ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించొద్దు. ఓ ఎయిర్ లైన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఓ విషయాన్ని గ్రహించాను. మేనేజర్ల దగ్గరి నుంచి కలిగ్స్ వరకూ అందరూ పక్కవారిని ఇంప్రెస్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇది మనలోని క్రియెటివిటీని, నిజాన్ని వ్యక్తీకరించే నైజాన్ని చంపేస్తుంది.

ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత, మీ కాళ్లపై మీరు నిలబడాలనుకున్నప్పుడు, స్నేహితులను, తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించొద్దు. మీ గురించి వివరిస్తూ పనిచేయండి. భయంలేకుండా పనిచేయండి. గుండె ధైర్యాన్ని ప్రదర్శించండి. 

6. బలాలను, బలహీనతలను విశ్లేషించుకోండి..

వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందే, అసలు మీరేంటి? మీ జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని పరిశీలించుకోవడం అన్నిటి కంటే ముఖ్యం. మీ బలాలేంటి? బలహీనతలు ఏంటి? మీ రోజువారీ జీవితంపై అవి ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అన్న విషయాలను విశ్లేషించుకోవాలి. నెగటీవ్ థాట్స్ పై దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు.

7. ఫ్యామిలీ టైమ్..

కొన్నిసార్లు మనం ఆర్థికంగా కుటుంబానికి బాసటగా నిలవలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మానసికంగా కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. కుటుంబసభ్యుల అవసరాలను గ్రహించాలి. ఉద్యోగం చేస్తున్న సమయంలో మీ తల్లిదండ్రులకు, మీకు మధ్య ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేందుకు ప్రయత్నించాలి. మీ తల్లిదండ్రుల కలలు, కోరికలేంటో తెలుసుకోవాలి. వాటిని సాకారం చేసుకునేలా వారికి సాయం చేయాలి. మీ నిర్ణయంపై మీ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినా పర్లేదు. అన్నిటికంటే వారికి మీరే ముఖ్యం. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదేనని వారికి ఎప్పటికైనా అర్థమవుతుంది.

8. వినయాన్ని మర్చిపోవద్దు..

మీకు వచ్చిన ఐడియాను సాకారం చేసుకునేందుకు మీరు ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మీరు చేస్తున్న పనిపై మీరు నమ్మకంతో ఉండండి. మీరు ఎవరినైనా కలిసినప్పుడు, కాన్ఫిడెంట్ గా కనిపించండి. ఎవరి ముందూ మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. అదేసమయంలో మీకు ఎదురుగా ఉన్నవారి కంటే పది రెట్లు వినయపూర్వకంగా మసలుకోండి. ప్రజలతో కలవండి. 

(ఈ స్టోరీలో చెప్పిన అంశాలు రచయిత, ఆంట్రప్రెన్యూర్ హెర్ష్ లీలా రమణి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని యువర్ స్టోరీ అభిప్రాయాలుగా భావించొద్దని మనవి)