పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ - 'ప్యూపెల్' వినూత్న విప్లవం

పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ - 'ప్యూపెల్' వినూత్న విప్లవం

Wednesday October 07, 2015,

4 min Read

పరీక్షల కోచింగ్ కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నారా ? అయితే మీకోసం మేమున్నాం అంటోంది ఇండోర్‌కు చెందిన ప్యూపెల్ డాట్ కామ్. ఉచిత కోచింగ్ ప్లాట్‌ఫాంను అందిస్తోంది ఈ స్టార్టప్.

బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ప్రశాంత్ దేశ్వాల్. ఈయన కొన్ని విషయాలను బలంగా విశ్వసిస్తారు. "మధ్యాహ్న భోజనం మాదిరిగా ఉచితంగా వచ్చేది ఏదీ లేదు. బ్యాంకింగ్ కెరీర్‌లో ప్రవేశించేందుకు ఐబీపీఎస్ పరీక్షలు రాద్దామని నిర్ణయం తీసుకున్నపుడు.. కోచింగ్ కోసం బాగానే ఖర్చు చేసేందుకు మానసికంగా రెడీ అయ్యారు ప్రశాంత్. ఉత్తర్ ప్రదేశ్‌లోని మారుమూల పట్టణమైన బిజ్‌నోర్‌లో నివాసం ఉండడంతో... ఎటువంటి కోచింగ్ సెంటర్స్ కానీ, ట్యూటర్స్‌ కానీ అందుబాటులో లేరు. వెబ్‌సైట్స్ తిరగేస్తున్న సమయంలో ప్యూపెల్.కాం కనిపించింది. ఆన్‌లైన్‌లో టెస్ట్‌లు తీసుకోవడానికి అనువైన కోచింగ్ పోర్టల్ ఇది. 

అన్ని రకాల కోర్సులకు సంబంధించిన మెటీరియల్ ఉచితంగా అందించడం ఈ సైట్ ప్రత్యేకత. ఆయా కోర్సులపై విపరీతంగా పరిశోధన చేసి.. వీడియో కోచింగ్ కూడా అందిస్తోంది ప్యూపెల్. 8 రకాల ఉచిత టెస్ట్‌లు, కోర్సులు అందించే ఈ సైట్‌కు 5వేలకు పైగా స్టూడెంట్స్ విజిటర్స్‌గా ఉన్నారు. తాము నిర్వహించే అన్ని టెస్టులకు ఛార్జీలు వసూలు చేసే సైట్స్ కొన్నయితే... మొదట కొన్నింటిని ఉచితంగా అందించి, తర్వాత రుసుములు వసూలు చేసేవి మరికొన్ని. కానీ ప్యూపెల్ మాత్రం పూర్తిగా అన్ని రకాల సర్వీసులను ఫ్రీగానే అందించడం విశేషం. విస్తృతమైన కోర్సులను ఆన్‌లైన్ వేదికగా అందించడం ఈ ప్యూపెల్ ప్రత్యేకత.

image


భారత దేశంలో కోచింగ్ రంగం ఇంకా అసంఘటితంగానే ఉందంటారు ప్యూపెల్ సహ వ్యవస్థాపకుడు భరత్ పటోడీ. “సరైన ఫీజుల నిర్ణయ విధానం లేకపోవడంతో.. ఇష్టం వచ్చినట్లుగా ఛార్జ్ చేస్తున్నారు. కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కనీసం కోచింగ్ వరకూ అయినా ఉచితంగా ఇచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం” అంటున్నారు భరత్.

ప్రస్తుతం ప్యూపెల్‌లో 8 రకాల పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మెటీరియల్ లభిస్తుంది. వీటితోపాటు 150 వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టెస్ట్‌కు వెయ్యికి పైగా ప్రశ్నకు సిద్ధం చేశారు. ఈ తరహా టెస్ట్‌లు/క్విజ్‌లు అన్నీ సొంతంగానే రూపొందించడం విశేషం. “ఔత్సాహికుల కోసం నాణ్యమైన మాక్ ఇంటర్వ్యూలను కూడా అందించబోతున్నాం. ఇది కూడా పూర్తయితే.. పరీక్షలకు సంపూర్తిగా వారి ప్రిపరేషన్ పూర్తయినట్లే ” అంటున్నారు భరత్. ఐబీపీఎస్, క్యాట్, సీమ్యాట్, క్లాట్, జీఆర్ఈ, ఎస్ఎస్‌సీ, ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలకు తగిన ఎగ్జామ్ మెటీరియల్ లభ్యమవుతుంది. దీన్ని యాక్సెస్ చేసేందుకు ప్యూపెల్.కాంలో సైనప్ చేస్తే సరిపోతుంది.

ప్రతీ అడుగులోనూ విశ్లేషాత్మకంగా వ్యవహరిస్తోంది ఈ టీం. ఓ 15 లెక్చర్స్ తర్వాత విద్యార్ధుల్లో ఆసక్తి తగ్గిన విషయాన్ని గమనించారు. స్వయం ప్రేరణ లేకపోవడమే ఇందుకు కారణమని వారికి అర్ధమైంది. “ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆన్‌లైన్ లెక్చర్స్‌ అందించే పోర్టల్స్‌కి కూడా ఈ సమస్య తప్పలేదు. అందుకే ప్రతీ రోజూ కంటెంట్‌ని మరింత నాణ్యంగా రూపొందిస్తున్నాం. మా టెస్టింగ్ విధానం అంతా సరైన పద్ధతి ప్రకారం ఉంటుంది. థియరీని అందించే లెక్చర్స్‌కి నిడివి 7 నిమిషాల లోపే ఉంటుంది. అలాగే దీన్ని ప్రాక్టీస్ చేసేందుకు 15 నిమిషాల టైం లభిస్తుంద"ని చెప్పారు ప్యూపెల్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి చౌదరి.

“నాణ్యమైన వీడియో లెక్చర్స్ అందించాలంటే సరైన స్టూడియో ఉండాలి. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశాం. ఇండీగోగో.కాంలో ఈ క్రౌడ్ ఫండింగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా లక్ష్యంలో ఇప్పటికే 80శాతాన్ని సమీకరించగలిగామ”ని చెప్పారు స్వాతి.

స్వానుభవమే స్టార్టప్‌కు కారణమైంది

ఫాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ -ఢిల్లీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే.. ఆంట్రప్రెన్యూర్ అవతారమెత్తారు భరత్. ముంబై ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీయే పూర్తి చేసిన స్వాతి.. రెండేళ్ల పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌లో విధులు నిర్వహించారు.

2014 డిసెంబర్‌లో సొంత నిధులతో ప్యూపెల్ ప్లాట్‌ఫాంని ఏర్పాటు చేశారు వీరిద్దరూ. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించడంతో పాటే... ప్రతీ కోర్స్‌కి స్పాన్సర్స్‌ని అన్వేషించాలన్నది వీరి ఆలోచన. ఇండోర్‌లో భరత్ ఇంట్లోని ఓ చిన్న రూంలో ప్యూపెల్ ఆఫీస్‌ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం.

“ఓ ప్రఖ్యాత కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో క్యాట్ శిక్షణ పొందడం కోసం ఫీజులు కట్టేందుకు.. పార్ట్ టైమర్‌గా ట్యూషన్స్ చెప్పేవాడిని. ఆ సమయంలోనే నాకు స్వాతి పరిచయం అయింది. కోచింగ్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు వెదజల్లాల్సి వస్తోందనే భావన మా ఇద్దరిలోనూ కలిగింది. ఈ అంతరాన్ని తగ్గించాలని ఆలోచించాం. అలా ప్రారంభమైనదే ప్యూపెల్” అన్నారు భరత్. అప్పటికే స్వాతి కొన్ని పుస్తకాలను కూడా పబ్లిష్ చేయడం విశేషం.

ప్యూపెల్ ప్లాట్‌ఫాంని సుదీర్ఘకాలం కొనసాగిస్తామని చెబ్తున్నారు నిర్వాహకులు. ఇందుకోసం ఇప్పటికే పలు ఇనిస్టిట్యూట్స్, యూనివర్సిటీలను... తమ కోర్సులను స్పాన్సర్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇది వారికి కూడా లాభదాయకమైన విధానం అంటారు వీళ్లు. ఉదాహరణకు సీమ్యాట్ కోర్స్‌ని ఏదైనా మేనేజ్‌మెంట్ కాలేజ్ స్పాన్సర్ చేస్తే.. దానికి రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీలు, విద్యార్ధులకు ఉమ్మడిగా లాభం కలిగించే యోచన ఇది. విద్యార్ధులకు టెస్ట్ ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో యూనివర్సిటీలు గ్రహిస్తాయి. అదే సమయంలో పెద్ద మొత్తంలో సొమ్ములు వెచ్చించాల్సిన అవసరం స్టూడెంట్స్‌కు తగ్గుతుందంటున్నారు భరత్.

మార్కెట్ సైజ్ పెద్దదే

ప్రతీ ఏటా ఐబీపీఎస్ పరీక్షకు 8 లక్షల మంది హాజరవుతున్నారు. క్యాట్‌కు అప్లై చేసేవారి సంఖ్య 2 లక్షలకు పైగానే. ప్యూపెల్ ఇప్పటికే ఈ విభాగాలను కవర్ చేస్తోంది. అలాగే శాట్, జీమ్యాట్‌లకు కూడా 2015 చివరినాటికి ఉచిత కోర్స్‌లను అందించాలన్నది ప్యూపెల్ టార్గెట్. ఈ రెండింటినీ కూడా కలిపితే.. మొత్తం వీరి పోర్ట్‌ఫోలియో పది కోర్స్‌లకు చేరుతుంది. “ఈ ఏడాది చివరకు 20వేలమంది స్టూడెంట్స్ స్థాయిని అందుకోవాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం” అన్నారు స్వాతి. తాము స్వయంగా అనుభవించిన పరిస్థితులే ఈ తరహా వెంచర్‌కు నాంది పలికాయని, తమకు ఎవరూ మార్గదర్శకులు లేరంటున్నారు భరత్.


స్టూడెంట్స్ అందించే టెస్టిమోనియల్స్, వాలంటీర్స్‌గా పని చేసేందుకు ముందుకొస్తున్న వారిని చూస్తే.. ఎంతో ఉత్సాహం వస్తోందని చెబ్తున్నారు ఈ కో-ఫౌండర్స్. 17 ఏళ్ల వయసు గల రాయపూర్‌కు చెందిన డీపీఎస్ విద్యార్ధి అక్షత్ త్రిపాఠి.. ఉచితంగా కోర్సులు అందిస్తున్న ఈ సైట్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు.

“ప్రతీ టెస్ట్‌ని ఉచితంగా అందిస్తున్న వీరిని చూశాక.. నేను కూడా వారితో జత అవాలని అనిపించింది. విద్యార్ధి లోకానికి మేలు చేసే ఓ మంచి ప్లాట్‌ఫాం ఇది. ప్రస్తుతం వీరి కోసం శాట్ కంటెంట్‌ని సిద్ధం చేస్తున్నాన”ని చెప్పాడు అక్షత్.

ఆన్‌లైన్ కోర్స్, టెస్ట్ మార్కెట్‌లో ప్యూపెల్.కాం వేసిన అడుగు వినూత్నమైనదే కాదు.. విప్లవాత్మకమైనది కూడా. ఇద్దరు సహ వ్యవస్థాపకులు, ఒక వాలంటీర్, ఒక నికాన్ కెమెరాలతో మొదలైన ఈ స్టార్టప్.. అద్భుతాలకు కేంద్రం కాబోతోంది. మరికొంతమంది వాలంటీర్లు, స్పాన్సర్స్ జాయిన్ అయితే.. ఈ వెంచర్ వేగం మరింతగా ఊపందుకుంటుంది.

వెబ్‌సైట్