ఎవరూ పట్టించుకోకపోవడంతో 6 లక్షల లీటర్ల రక్తం వృధా అయింది  

0

యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అర్జెంటుగా రక్తం కావాలి. కానీ లేదు. ఏం చేయాలి? 

అర్జెంటుగా చిన్నారికి సర్జరీ చేయాలి. కావల్సిన బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేదు. ఇప్పుడెలా? 

నిత్యం ఇలాంటి వార్తలు ఏదో మూల వినిపిస్తునే ఉంటాయి. కనిపిస్తునే ఉంటాయి. పేరుకే బ్లడ్ బ్యాంకులు. ఏం లాభం. వ్యవస్థలో సరైన సమన్వయం లేక విలువైన రక్తాన్ని చేజేతులా నేలపాలు చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. గత ఐదేళ్లలో 28 లక్షల యూనిట్ల బ్లడ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీన్నిబట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

దేశంలో ఏటా 1.2 బిలియన్ల మందికి 12 మిలియన్ యూనిట్లకు పైబడి రక్తం అవసరమవుతోంది. కానీ అందులో దొరికేది కేవలం 9 మిలియన్ యూనిట్లు మాత్రమే. సంవత్సరానికి మూడు మిలియన్ యూనిట్ల రక్తం దొరకడం లేదు. నేషనల్ కేపిటల్ రిజియన్ కోణంలో చూస్తే లక్ష యూనిట్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

రక్తం, ప్లాస్మా, ప్లేట్లెట్స్ మొదలైనవి అందుబాటులో లేక చాలామంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దానికి కారణం కొరత కాదు.. బ్లడ్ బ్యాంకులు ఆసపత్రుల మధ్య సమన్వయ లోపం. ఫలితంగా గత కొన్నేళ్లుగా ప్రాణాలు కాపాడే సంజీవని లాంటి రక్తం వేస్టేజీ కింద పడిపోతోంది. ప్లాస్మా, ఎర్రరక్తకణాలను సరైన టైంలో వాడకపోవడం వల్ల అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.

కర్నాటక, మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు రాష్ట్రాలు మిలియన్ యూనిట్ల రక్తాన్ని నిరుపయోగంగా పడేసే జాబితాలో ఉన్నాయి. అది క్షమించరాని నేరం. ఆరు శాతంగా ఉన్న ఈ క్యూమిలేటివ్ వేస్టేజీ ఆరు లక్షల లీటర్లతో సమానం. అంటే ఇంచుమించు 53 వాటర్ ట్యాంకర్ల రక్తం ఎందుకూ పనికిరాకుండా పోతోందన్నమాట.

రక్తంలో ప్రధానంగా ఎర్రరక్త కణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్స్, ప్లాస్మా అని నాలుగు రకాలుంటాయి. అవి మనిషి ప్రాణాలను కాపాడటంలతో కీలకపాత్ర పోషిస్తాయి. ఎర్ర రక్తకణాలతో పోల్చుకుంటే ప్లాస్మా ఏడాదిపాటు నిల్వ ఉంటుంది. అలాంటి ప్లాస్మా కూడా యాభై శాతం వేస్టేజీ కింద పోవడం విచారకరం. ఇలా వృధా చేస్తున్న రాష్ట్రాల్లో యూపీ, కర్నాటక ముందు వరుసలో ఉన్నాయి.

సమాచార హక్కు చట్టం ద్వారా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ తరుపున చేతన్ కొఠారి అనే పిటిషనర్ వెల్లడించిన చేదు నిజాలివి. ఒకపక్క ఇంత రక్తం వృధాగా పోతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం మరో 79 కొత్త బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం ఒకరకంగా విడ్డూరమే. దానికంటే ముందు, అవగాహన లేని కారణంగా ఎంతో విలువైన రక్తాన్ని వృథాగా పారేస్తున్న వ్యవస్థను గాడిలో పెట్టాలని వైద్య రంగ నిపుణులు కోరుతున్నారు.