250 మందికి దంగల్ సినిమా చూపించిన ఇండోర్ కలెక్టర్ నరహరి

ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నూరిపోసేందుకు స్పెషల్ షో

250 మందికి దంగల్ సినిమా చూపించిన ఇండోర్ కలెక్టర్ నరహరి

Wednesday January 04, 2017,

2 min Read

అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఆ చిత్రం నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని రగిలించి, ప్రజల్లో పాజిటివ్ ఆటిట్యూడ్ పెంపొందిస్తోంది. ఆ సినిమా చూసి చాలామంది తల్లిదండ్రులు మారిపోతున్నారు. ఆడపిల్లలు జీవితంలో ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.

ఇండోర్ కలెక్టర్ తెలంగాణ బిడ్డ పరికిపండ్ల నరహరి కూడా దంగల్ సినిమాతో ఎంతో ఇంప్రెస్ అయ్యారు. 250 మంది అనాథలు, అభాగ్యులైన అమ్మాయిలకు ప్రత్యేకంగా దంగల్ మూవీని చూపించారు. వాళ్లంతా

వివిధ అనాథాశ్రమాల నుంచి, ఎన్జీవోల నుంచి వచ్చినవారే. ఆ సినిమా ఆడపిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపుతుందన్న ఉద్దేశంతో స్పెషల్ షో అరెంజ్ చేశారు.

image


ఇదీ సంగతి అని సినిమా హాల్ ఓనర్‌ కి చెప్తే వెంటనే ఒప్పుకున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే.. వచ్చిన అమ్మాయిలంతా జీవితంలో మొదటిసారి థియేటర్‌లో సినిమా చూశారు. అది కూడా దంగల్ లాంటి స్ఫూర్తిరగలించే మూవీ కావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అంత పెద్ద తెరమీద సినిమా చూస్తున్న వారి కళ్లలో చెప్పలేని సంతోషం కనిపిచిందంటారు కలెక్టర్ నరహరి. పిల్లలందరికీ మధ్యలో స్నాక్స్ కూడా ఇప్పించాడు.

పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కష్టాలేంటో తెలిసిన నరహరి ఇలాంటి కార్యక్రమాల పట్ల ఎప్పుడూ ముందుంటారు. ఎందుకంటే తను కూడా అదే కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగాడు కాబట్టి. గతంలో గ్వాలియర్ కలెక్టర్‌ గా ఉన్నప్పుడు ఆడపిల్లల ఉన్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా ఎన్నో స్ఫూర్తిదాయక ప్రసంగాలిచ్చేవాడు.

నరహరి కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు, ఒక సోదరి. అంతమంది మగపిల్లలకు తోడుగా కూతురు కావాలని నరహరి తండ్రి తపించారు. అబ్బాయి- అమ్మాయి అన్న లింగబేధం నాన్నకు లేవని అంటారాయన. ఆడపిల్లలపై వివక్షను నాన్న ఆనాడే సహించేవారు కాదని గుర్తు చేశారు. తమ సోదరి అందరికంటే చదువులో ముందుండేవారని చెప్పారు. మహిళలు ఆత్మగౌరవంతో, ఆర్ధిక స్వావలంబనతో బతకాలన్న తన తండ్రి ఆశయాన్ని కలెక్టర్ నరహరి కొనసాగిస్తున్నారు.